త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ఆఫర్‌లో కొన్నారా.. ఆఫర్‌ చూసి కొన్నారా? పండుగ షాపింగ్‌లో అసలు లెక్క ఇదే!

పండుగ దగ్గరపడుతోంది… ఆఫర్లు ఊరిస్తున్నాయి… షాపింగ్‌ కార్ట్‌ నిండిపోతోంది! తగ్గింపు చూసి కొంటున్నాం… కానీ నిజంగా అవసరమా అని ఆలోచిస్తున్నామా? దసరా నుంచి సంక్రాంతి వరకు—ఆఫర్ల సందడిలో జేబు లెక్క మరిచిపోవద్దు!

V

Lifestyle | Published On Oct 3, 2026, 6.33 pm IST

ఆఫర్‌లో కొన్నారా.. ఆఫర్‌ చూసి కొన్నారా? పండుగ షాపింగ్‌లో అసలు లెక్క ఇదే!

సంక్షిప్త సారాంశం

డిస్కౌంట్లు, ఫ్రీ డెలివరీ, వాయిదాల ఆకర్షణలో అనుకున్న బడ్జెట్‌ దాటిపోవచ్చు. చివరి ధర, అదనపు ఛార్జీలు, ఇంట్లో ఉన్న వస్తువులను పరిశీలిస్తే అనవసర ఖర్చు తగ్గించుకోవచ్చు. అవసరాల జాబితాతో పండుగ షాపింగ్‌ చేస్తే… కొనుగోళ్ల ఆనందం బిల్లుల భారంగా మారదు.

Advertisement

                                                దసరా నుంచి సంక్రాంతి వరకు… ఆఫర్లలో ఆదా ఎంత?

 

దసరాకు కొత్త బట్టలు… దీపావళికి ఇంట్లో కొత్త వస్తువులు… సంక్రాంతికి కుటుంబమంతా షాపింగ్‌! పండుగలంటే కొనుగోళ్ల సందడి సహజమే. కానీ ఆ సందడిలో “మనకు ఏం కావాలి?” అనే ప్రశ్న వెనక్కి వెళ్లి… “ఏది ఆఫర్‌లో ఉంది?” అన్నదే ముందుకొస్తోంది. ఫోన్‌లో సేల్‌ నోటిఫికేషన్‌ కనిపించగానే కార్ట్‌ తెరుస్తాం. తగ్గింపు చూసి ఆనందపడతాం. కొన్నది నిజంగా అవసరమా అన్న లెక్క మాత్రం డెలివరీ తర్వాత మొదలవుతుంది! రానున్న దసరా, దీపావళి, సంక్రాంతి షాపింగ్‌కు సిద్ధమవుతున్న వేళ… ఈ తేడాను గుర్తించడం ముఖ్యం. అవసరమైన వస్తువును ఆఫర్‌లో కొనడం ఆదా. ఆఫర్‌ ఉందని అవసరం లేనిది కొనడం అదనపు ఖర్చు.

పండుగ కోసం షాపింగ్‌… సేల్‌ కోసం కాదు!

దసరాకు బట్టలు కొనాలనుకున్నారు. కానీ యాప్‌లోకి వెళ్లాక చెప్పులు, వాచ్‌, బ్యాగ్‌ కూడా కార్ట్‌లో చేరాయి. దీపావళికి ఒక వస్తువు మార్చాలనుకున్నారు. పక్కనే మరోదానిపై భారీ తగ్గింపు కనిపించింది. దాన్నీ తీసుకున్నారు. ఇక్కడ కొనుగోలు జాబితాను నిర్ణయిస్తున్నది మన అవసరమా, స్క్రీన్‌పై కనిపించే ఆఫరా అన్నది చూసుకోవాలి. పండుగ కోసం ముందుగా అనుకున్న ఖర్చుకు, సేల్‌ చూసిన తర్వాత పెరిగిన ఖర్చుకు మధ్య తేడానే అసలు లెక్క. కొనే ముందు ఇంట్లో ఉన్నవి ఒక్కసారి చూడటం ఉపయోగపడుతుంది. కొత్త బట్టలు అవసరమా? గతంలో కొన్నవి ఇంకా వాడలేదా? మార్చాలనుకుంటున్న వస్తువు నిజంగా పనిచేయట్లేదా?

తగ్గింపు శాతం కాదు… చివరి ధర చూడాలి

“యాభై శాతం తగ్గింపు” కనిపిస్తే మంచి డీల్‌ అనిపించవచ్చు. కానీ చివరకు చెల్లించాల్సిన ధర ఎంత? అదే వస్తువు మరోచోట ఎంతకు దొరుకుతోంది? డెలివరీ ఛార్జీలు ఉన్నాయా? రిటర్న్‌ చేసుకునే అవకాశం ఉందా. ఈ వివరాలూ చూడాలి. ఎక్కువ తగ్గింపు చూపిస్తున్న వస్తువే తక్కువ ధరకు దొరుకుతుందని అనుకోలేం. మన బడ్జెట్‌ రూ.2,000 అయితే… రూ.4,000 వస్తువును తగ్గింపుతో రూ.3,000కు కొన్నా, అనుకున్నదానికంటే వెయ్యి రూపాయలు ఎక్కువ ఖర్చు చేసినట్టే. ఆఫర్‌ వల్ల ఎంత మిగిలిందన్నదితోపాటు, జేబు నుంచి ఎంత వెళ్లిందన్నదీ ముఖ్యం.

‘ఇంకోటి కొంటే ఫ్రీ’… మనకు రెండోది కావాలా?

ఒకటి కొంటే మరొకటి ఉచితం, కొంత మొత్తం దాటితే కూపన్‌, అదనంగా కొంటే ఫ్రీ డెలివరీ… ఇలాంటి ఆఫర్లలో అవసరమైన కొనుగోలు నిజంగా ఉపయోగపడొచ్చు. కానీ ఫ్రీ డెలివరీ కోసం అవసరం లేని వస్తువును కార్ట్‌లో వేస్తే? డెలివరీ ఛార్జీ తప్పించుకున్నా, మొత్తం ఖర్చు పెరిగిపోవచ్చు. రెండు వస్తువులూ ఉపయోగపడితే ఆఫర్‌కు విలువ ఉంటుంది. ఒకటి అల్మారాలో పడిపోతే, ‘ఫ్రీ’ అనే మాట ఇచ్చిన ఆనందమే మిగులుతుంది.

నెలకు కొద్దే… అన్ని వాయిదాలు కలిపితే?

వస్తువు పూర్తి ధర పెద్దగా కనిపించినా, నెలవారీ వాయిదా చిన్నగా అనిపిస్తుంది. కొనుగోలు నిర్ణయం సులభమవుతుంది. అయితే ఇప్పటికే చెల్లిస్తున్న వాయిదాలకు కొత్తది కలిపితే నెలకు ఎంత అవుతుంది? వడ్డీ, ప్రాసెసింగ్‌ ఫీజు, ఇతర ఛార్జీలు ఉన్నాయా? ఆ మొత్తం కుటుంబ ఖర్చులకు సరిపోతుందా? ముందే చూడాలి. దసరా కొనుగోలు వాయిదా కొనసాగుతుండగానే దీపావళి షాపింగ్‌ రావచ్చు. తర్వాత సంక్రాంతి ఖర్చులు చేరవచ్చు. అందుకే ఒక్క పండుగ బడ్జెట్‌తోపాటు రానున్న నెలల ఖర్చులనూ గుర్తుపెట్టుకోవాలి.

అమ్మమ్మ పొదుపు… పండుగలకూ పనికొస్తుంది

ఉన్న వస్తువులను పూర్తిగా వాడటం, మరమ్మతు చేయించడం, అవసరమైనవే కొనడం అనే ఆలోచన ‘అండర్‌కన్సంప్షన్‌ కోర్‌’ పేరుతో 2024లో సోషల్‌ మీడియాలో చర్చకొచ్చింది. మన ఇళ్లలో తెలిసిన పొదుపు అలవాట్లతో దీనికి పోలిక ఉంది. పండుగకు కొత్తవి కొనొద్దని దీని అర్థం కాదు. కొత్తది తెచ్చేముందు ఉన్నదానికి ఇంకా ఉపయోగం ఉందా అని చూడటం. బాగున్న డ్రెస్‌ను మళ్లీ వేసుకోవడం, చిన్న మరమ్మతుతో పనిచేసే వస్తువును కొనసాగించడం కూడా మంచి నిర్ణయాలే.

పండుగ ఆనందానికి బిల్లు భారమవ్వొద్దు

షాపింగ్‌కు ముందు అవసరాల జాబితా, ఖర్చు పరిమితి పెట్టుకోండి. వెంటనే అవసరం లేని వస్తువును చూసినప్పుడు కొంత సమయం ఆగండి. ఆఫర్‌ లేకపోయినా దాన్ని కొనాలనుకునేవారా అని ఆలోచించండి. పండుగ ఆనందం కుటుంబంతో గడిపే సమయం, కొత్త బట్టలు, బహుమతులు… అన్నింటిలో ఉంటుంది. ఆ ఆనందాన్ని నెలాఖరు బిల్లు ఒత్తిడిగా మార్చుకోకుండా చూసుకోవడమే తెలివైన షాపింగ్‌. ఆఫర్‌లో ఎంత ఆదా చేశామన్నది తర్వాతి లెక్క. ఆ కొనుగోలు మనకు అవసరమా అన్నదే మొదటి లెక్క!

Advertisement
Advertisement