త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | బీజేపీ దీక్షలన్నీ డ్రామాలే.. దమ్ముంటే ఢిల్లీ నుంచి ఫండ్స్ తీసుకురండి: మంత్రి పొన్నం ఫైర్

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బీజేపీ నేతలు చేస్తున్న దీక్షలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు తేవాలని సవాల్ విసిరారు.

J

Karimnagar | Published On Aug 24, 2026, 2.52 pm IST

Ponnam Prabhakar | బీజేపీ దీక్షలన్నీ డ్రామాలే.. దమ్ముంటే ఢిల్లీ నుంచి ఫండ్స్ తీసుకురండి: మంత్రి పొన్నం ఫైర్
Advertisement
  • నవాబ్ పేటలో జరిగిన 'పల్లె పల్లెకు పొన్నం అన్న' కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
  • బీజేపీ నేత రామచందర్ రావు చేస్తున్న ఫీజు దీక్షలు కేవలం రాజకీయ ఉనికి కోసమేనని విమర్శ
  • బీఆర్ఎస్ హయాంలో బకాయిలు పెడితే సైలెంట్‌గా ఉన్న బీజేపీ నేతలు, ఇప్పుడు మాట్లాడటం విడ్డూరమన్న మంత్రి
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు గ్రీన్ ఛానల్ ద్వారా అడ్వాన్స్‌గా ఫీజుల చెల్లింపు

Ponnam Prabhakar | త్రినేత్ర.న్యూస్ : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబ్ పేటలో జరిగిన 'పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజా పాలన' కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) ఇష్యూపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు చేస్తున్న దీక్షలు కేవలం పొలిటికల్ డ్రామాలేనని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు.

బీఆర్ఎస్ హయాంలో ఎందుకు సైలెంట్?

గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఫీజు బకాయిలు పెండింగ్‌లో పెడితే కిమ్మనకుండా కూర్చున్న బీజేపీ నేతలు, ఇప్పుడు ప్రజా ప్రభుత్వంపై గగ్గోలు పెట్టడం విడ్డూరంగా ఉందని ఆయన మండిపడ్డారు. పదవి రాగానే పార్టీలో లొల్లులు ఎక్కువయ్యాయని, తన ఉనికిని (Political existence) కాపాడుకోవడానికే రామచందర్ రావు ఈ దీక్షలకు దిగారని ఎద్దేవా చేశారు.

దమ్ముంటే నిధులు తీసుకురండి

బీజేపీ నేతలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన ఫండ్స్ తీసుకురావాలని పొన్నం సవాల్ విసిరారు. మొసలి కన్నీళ్లు ఆపి, ఢిల్లీ పెద్దలకు జ్ఞానోదయం చేసి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈ పథకాన్ని అమలు చేయించాలన్నారు. అసలు దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న ఏ ఒక్క రాష్ట్రంలోనైనా ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తున్నారా? అని నిలదీశారు.

గ్రీన్ ఛానల్ ద్వారా ఫీజుల చెల్లింపు

గత ప్రభుత్వం వదిలేసిన పాత బకాయిలను తమ ప్రభుత్వం క్రమంగా క్లియర్ చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అడ్వాన్స్‌గా ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తున్నామని తెలిపారు. సంక్షేమ హాస్టళ్లకు నిధుల కొరత లేకుండా 'గ్రీన్ ఛానల్' (Green Channel) ద్వారా పేమెంట్స్ చేస్తున్నామన్నారు.

విద్యార్థుల కడుపు నింపుతున్నాం..

సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్టళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని పొన్నం గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మెస్ ఛార్జీలు పెంచి విద్యార్థుల కడుపు నింపుతున్నామని, అభివృద్ధి పథంలో సాగుతున్న సర్కారుపై అనవసరంగా బురదజల్లొద్దని బీజేపీ నేతలకు చురకలంటించారు.

Advertisement
Advertisement