త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Helle Lyng Journalist | ప్రధాని మోదీని ప్రశ్నించి వైరలైన నార్వే జర్నలిస్ట్ హెల్లే ల్యాంగ్ ఎవరో తెలుసా?

నార్వే పర్యటనలో ప్రధాని మోదీని ప్రశ్నించి రాత్రికి రాత్రే ఫేమస్ అయిన జర్నలిస్ట్ హెల్లే ల్యాంగ్ (Helle Lyng) చుట్టూ ఇప్పుడు పెద్ద వివాదమే నడుస్తోంది. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే..

J

International | Published On May 19, 2026, 6.42 pm IST

Helle Lyng Journalist | ప్రధాని మోదీని ప్రశ్నించి వైరలైన నార్వే జర్నలిస్ట్ హెల్లే ల్యాంగ్ ఎవరో తెలుసా?
Advertisement

Helle Lyng Journalist | త్రినేత్ర.న్యూస్ : నార్వే పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) మీడియా బ్రీఫింగ్ ముగించుకుని వెళ్తుండగా.. ఒక విదేశీ మహిళా జర్నలిస్ట్ గట్టిగా అరిచి అడిగిన ప్రశ్న ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్‌గా హాట్ టాపిక్‌గా మారింది. "ప్రపంచంలోనే అత్యంత స్వేచ్ఛా పత్రికా రంగానికి (Freest press) చెందిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వకూడదా?" అంటూ ఆమె అడిగిన ప్రశ్నతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆమెపై పడింది. మోదీ ఆ ప్రశ్న విన్నారో లేదో కానీ, ఆయన రూమ్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ చిన్న క్లిప్ కాస్తా సోషల్ మీడియాలో ప్రెస్ ఫ్రీడమ్‌పై పెద్ద డిబేట్‌కు దారితీసింది. ఇంతకీ ఎవరీ హెల్లే ల్యాంగ్ (Helle Lyng)? ఆమె చుట్టూ నడుస్తున్న వివాదం ఏంటి?

రాత్రికి రాత్రే పెరిగిన ఫాలోవర్స్.. ఎక్స్‌లో రచ్చ

"భారత ప్రధాని నరేంద్ర మోదీ నా ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోతారని నేను అనుకోలేదు. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో నార్వే నంబర్ 1 స్థానంలో ఉంటే, భారత్ 157వ స్థానంలో ఉంది" అంటూ హెల్లే ల్యాంగ్ ఎక్స్ (ట్విట్టర్) లో పోస్ట్ పెట్టింది. ఈ ఘటన కాస్తా పెద్దదవ్వడంతో నార్వేలోని భారత రాయబార కార్యాలయం ఆమెను ప్రత్యేకంగా పిలిచి ఆ తర్వాత జరిగిన ఒక ప్రెస్ బ్రీఫింగ్‌కు ఆహ్వానించింది.

Who is Helle Lyng The Norwegian Journalist Questioning PM Modi

అయితే, ఆ ప్రెస్ మీట్ కూడా కాస్త సీరియస్‌గానే సాగింది. భారత హక్కుల రికార్డుపై ఆమె అడిగిన ప్రశ్నలకు విదేశాంగ శాఖ (MEA) సెక్రటరీ సిబి జార్జ్ సమాధానమిస్తూ.. భారత సంస్కృతి, చదరంగం (Chess) మూలాలు, యోగా, కోవిడ్ వ్యాక్సిన్ డిప్లొమసీ గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ మధ్యలో జర్నలిస్ట్ కాస్త అసహనానికి గురై కాసేపు ప్రెస్ మీట్ నుంచి బయటకు వెళ్లి మళ్లీ తిరిగి వచ్చింది.

ట్రోలింగ్.. 'చైనా ఏజెంట్' అంటూ కామెంట్స్

ఈ లోపు సోషల్ మీడియాలో హెల్లే ల్యాంగ్‌పై విమర్శల వర్షం కురిసింది. కొందరు ఆమెను "ఫారెన్ ప్లాంట్" అని, "చైనా ప్రాక్సీ" (Chinese proxy) అని అభివర్ణించారు. గతంలో ఆమె చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను ప్రశంసిస్తూ రాసిన ఆర్టికల్స్‌ను నెటిజన్లు బయటకు తీశారు. అలాగే ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ కాదని, కేవలం జాయింట్ బ్రీఫింగ్ మాత్రమేనని, నార్వే ప్రధాని కూడా ఎలాంటి ప్రశ్నలు తీసుకోలేదని గుర్తుచేశారు.

ట్రోలింగ్ మరీ ఎక్కువ కావడంతో ఆమె స్వయంగా క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. "నేను ఇలా రాయాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. కానీ నేను ఎలాంటి విదేశీ గూఢచారిని (Foreign spy) కాదు. ఏ విదేశీ ప్రభుత్వం నన్ను పంపలేదు. నా పని కేవలం జర్నలిజం మాత్రమే" అని ఆమె ట్వీట్ చేసింది. ఈ వివాదం సృష్టించిన హడావుడితో ఎక్స్ లో ఆమె ఫాలోవర్ల సంఖ్య 800 నుండి ఒక్కసారిగా 17 వేలకు పైగా పెరిగిపోయింది.

Who is Helle Lyng The Norwegian Journalist Questioning PM Modi

అసలు ఎవరీ హెల్లే ల్యాంగ్?

హెల్లే ల్యాంగ్ నార్వేకు చెందిన ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. ప్రస్తుతం ఆమె 'దాగ్‌సవిసెన్' (Dagsavisen) అనే పత్రికలో కామెంటేటర్‌గా పనిచేస్తోంది. ఈ పత్రికకు నార్వేలో 14,000 కంటే తక్కువ సర్క్యులేషన్ ఉంది. ఇది అక్కడ టాప్ 10 మీడియా హౌస్‌లలో కూడా లేదు. ఆమె రాసిన గత ఆర్టికల్స్ చూస్తే.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను తీవ్రంగా విమర్శిస్తూ హెడ్‌లైన్స్ పెట్టారు. అలాగే ఎలాన్ మాస్క్‌కు చెందిన టెస్లా కంపెనీని తప్పుబడుతూ వ్యాసాలు రాశారు. మరోవైపు చైనాను 'సూపర్ పవర్' అంటూ పొగిడారు.

రాహుల్ గాంధీ ఎంట్రీ.. ఇండియాలో పొలిటికల్ వార్

ఈ అంతర్జాతీయ వివాదం కాస్తా ఇండియాలో రాజకీయ రంగు పులుముకుంది. రాహుల్ గాంధీ, మహువా మోయిత్రా వంటి ప్రతిపక్ష నేతలు మోదీని టార్గెట్ చేస్తూ.. కొన్ని ప్రశ్నలకే ప్రధాని భయపడి పారిపోయారంటూ ట్వీట్లు చేశారు.

"దాచడానికి ఏమీ లేనప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంది? ఒక అంతర్జాతీయ వేదికపై ప్రధాని ఇలా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా వెళ్లడం వల్ల దేశ ప్రతిష్ట ఏమవుతుంది?" అని రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రశ్నించారు.

దీనికి కౌంటర్‌గా హెల్లే ల్యాంగ్ నేరుగా రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ.. "హలో, మీరు ఫోన్ ఇంటర్వ్యూకి అందుబాటులో ఉంటారా? మోదీ నార్వే పర్యటనపై మీ అభిప్రాయాలు తెలుసుకోవాలనుంది" అని అడిగింది.

మరోవైపు బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ఈ వ్యవహారాన్ని కొట్టిపారేశారు. ఆమెను ఒక 'డెలింక్వెంట్ జర్నలిస్ట్' (బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించే జర్నలిస్ట్) గా పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎకోసిస్టమ్ అంతా కలిసి ఒక జర్నలిస్ట్ చేసిన పిచ్చి వాదనలను నెత్తిన పెట్టుకుంటోందని, బలమైన భారతదేశాన్ని చూడటం ఇష్టం లేని విదేశీ శక్తుల చేతుల్లో కాంగ్రెస్ నడుస్తోందా అని ఆయన మండిపడ్డారు. ఒక జర్నలిస్ట్ అడిగిన చిన్న ప్రశ్న.. ఇప్పుడు భారత్-నార్వే రాజకీయాల మధ్య పెద్ద తుఫానునే రేపింది.

Advertisement
Advertisement