త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

US-Israel-Iran War | ఇరాన్‌కు అండగా రష్యా.. ఇరాన్‌లో అమెరికా, ఇజ్రాయెల్ గూఢచారులు

అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చుతోంది. ఇరాన్‌కు అండగా రష్యా రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతుండగా.. దుబాయ్, ఖతార్, ఇజ్రాయెల్‌లలో క్షిపణి దాడులు, చమురు నౌకలపై దాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. హార్ముజ్ జలసంధిలో ఇరాన్ ఆంక్షలతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ముంచుకొస్తోంది.

J

International | Published On Mar 31, 2026, 5.43 pm IST

US-Israel-Iran War | ఇరాన్‌కు అండగా రష్యా.. ఇరాన్‌లో అమెరికా, ఇజ్రాయెల్ గూఢచారులు
Advertisement
  • ఇరాన్‌పై దాడికి నిధులు ఇవ్వండి : ట్రంప్ రిక్వెస్ట్
  • ఇరాన్‌లోని ఇస్పహాన్ ఆయుధ డిపోపై యూఎస్ దాడి
  • మిడిల్ ఈస్ట్‌లో యూఎస్ ఎయిర్‌బోర్న్ సైనికులు
  • హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై ఇరాన్ టోల్ పన్ను
  • మలేషియా నౌకలకు ఇరాన్ టోల్ మినహాయింపు

త్రినేత్ర.న్యూస్ : అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణలు పశ్చిమాసియాను మరింత ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెట్టుతున్నాయి. దాడులు, ప్రతిదాడులతో ఈ ప్రాంతం రణరంగంగా మారింది. ఈ యుద్ధంలో ఇరాన్‌కు మద్దతుగా రష్యా బలగాలు రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌పై సైనిక చర్యలకు నిధులు సమకూర్చాలని మిడిల్ ఈస్ట్ మిత్రదేశాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరే అవకాశం ఉందని వైట్ హౌస్ ప్రకటించగా.. మరోవైపు ఎలైట్ 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్‌కు చెందిన వేలాది మంది అమెరికా సైనికులు ఈ ప్రాంతానికి చేరుకుంటున్నారు.

ఇరాన్ పట్ల అమెరికా, ఇజ్రాయెల్ వ్యవహరిస్తున్న తీరుపై రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చమురు, గ్యాస్ వనరులను నియంత్రించాలనే దురుద్దేశంతోనే ఇరాన్‌లో పాలన మార్పు కోసం అమెరికా ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.

గల్ఫ్‌లో టెన్షన్.. కువైట్ చమురు నౌకపై దాడి

దుబాయ్ తీరంలో ఇరాన్ దాడుల కారణంగా అల్ సల్మీ అనే కువైట్ చమురు నౌకలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపు చేయడంతో భారీ ప్రమాదం తప్పింది. నౌకలో ఉన్న 24 మంది సురక్షితంగా ఉన్నారని కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ తెలిపింది. ఇక, హార్ముజ్ జలసంధి, బాబ్ ఎల్-మండేబ్ రూట్లలో దాడులు పెరుగుతుండటం ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై టోల్ పన్ను విధించడంతో పాటు, అమెరికా, ఇజ్రాయెల్ నౌకలను పూర్తిగా నిషేధిస్తూ ఇరాన్ పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఫిలిప్పీన్స్, ఇండోనేషియా లాంటి ఆసియా దేశాలు చమురు కోసం రష్యా వైపు చూస్తున్నాయి. మలేషియా నౌకలకు మాత్రం ఇరాన్ టోల్ మినహాయింపు ఇచ్చింది.

ఖతార్, ఇజ్రాయెల్, దుబాయ్‌లపై ఇరాన్ క్షిపణుల వర్షం

దాడుల పరంపరలో భాగంగా ఖతార్‌లోని అల్ ఉదీద్ ఎయిర్ బేస్ (అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రధాన కార్యాలయం) పై ఇరాన్ దాడులు చేసినట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా వెల్లడైంది. అటు దుబాయ్ దక్షిణ ప్రాంతాల్లో ఇరాన్ క్షిపణులు పడటంతో నలుగురు గాయపడ్డారు. ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్, బ్నీ బ్రాక్ ప్రాంతాలపై ఇరాన్ జరిపిన దాడుల్లో ఎనిమిది మంది గాయపడినట్లు ఇజ్రాయెల్ అధికారులు ధృవీకరించారు.

ఇరాన్‌ను నాశనం చేస్తామన్న ట్రంప్.. ఇస్ఫహాన్‌పై అమెరికా దాడి

ఇరాన్ తీరు మార్చుకోకపోతే ఆ దేశ విద్యుత్ కేంద్రాలు, చమురు బావులు, నీటి శుద్ధి కర్మాగారాలను నాశనం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. మరోవైపు, ఇరాన్‌లోని ఇస్ఫహాన్‌లో ఉన్న ఓ భారీ ఆయుధ డిపోపై అమెరికా 'బంకర్-బస్టర్' బాంబులతో విరుచుకుపడినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది.

గూఢచారులకు మరణశిక్ష.. లెబనాన్‌లో యూఎన్ సిబ్బంది మృతి

అమెరికా, ఇజ్రాయెల్ నిఘా సంస్థలకు రహస్య సమాచారం చేరవేస్తున్నారనే ఆరోపణలతో ఇరాన్ భద్రతా బలగాలు ఇద్దరిని అరెస్టు చేశాయి. శత్రు దేశాలకు సహకరించినా, సున్నితమైన ప్రాంతాల ఫోటోలు/వీడియోలు షేర్ చేసినా మరణశిక్షతో పాటు ఆస్తుల జప్తు తప్పదని ఇరాన్ హెచ్చరించింది. మరోవైపు, లెబనాన్‌లో జరిగిన వేర్వేరు దాడుల్లో ఇండోనేషియాకు చెందిన ముగ్గురు ఐక్యరాజ్యసమితి శాంతిభద్రతల సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాల మధ్య యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలని గల్ఫ్ దేశాలు ముక్తకంఠంతో కోరుతున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement