త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Middle East Crisis | గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులు.. చమురు సంక్షోభం దిశగా ప్రపంచం!

నిరంతర సైరన్ల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్న ఇజ్రాయెల్ పౌరుల కోసం ఆ దేశం ఒక వినూత్నమైన "బాంబ్ షెల్టర్ డేటింగ్ యాప్" ను తీసుకొచ్చింది

J

International | Published On Mar 10, 2026, 9.00 pm IST

Middle East Crisis | గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులు.. చమురు సంక్షోభం దిశగా ప్రపంచం!

సంక్షిప్త సారాంశం

అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో ఇరాన్ చేస్తున్న యుద్ధం 11వ రోజుకు చేరుకుంది. ఇరాన్ తమ దాడులను గల్ఫ్ దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్‌లకు విస్తరించింది. మరోవైపు హార్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తామని ఇరాన్ హెచ్చరించడంతో ఇంధన సరఫరా నిలిచిపోయి చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇరాన్ పాలకుల వెన్ను విరుస్తామని ప్రకటించగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను "20 రెట్లు కఠినంగా" దెబ్బకొడతామని హెచ్చరించారు. ఈ పరిణామాలతో ఆసియా, ఐరోపా దేశాల్లో ఇంధన కొరత ఏర్పడి ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతోంది.

Advertisement
  • ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధం 11వ రోజు
  • ఇరాన్ పాలకుల వెన్ను విరుస్తాం
  • ఇజ్రాయెల్ ప్రధాని హెచ్చరిక

Middle East Crisis | త్రినేత్ర.న్యూస్ : అమెరికా-ఇజ్రాయెల్ కూటమి, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం కేవలం ఈ మూడు దేశాలకే పరిమితం కాకుండా మొత్తం మిడిల్ ఈస్ట్‌ను దహించివేస్తోంది. అమెరికా స్థావరాలు, ఇజ్రాయెల్ లక్ష్యంగా దాడులు చేస్తున్న ఇరాన్, ఇప్పుడు గల్ఫ్ దేశాలైన యూఏఈ, బహ్రెయిన్, సౌదీ అరేబియా, కువైట్‌లపైనా విరుచుకుపడుతోంది.

తాజాగా మంగళవారం ఉదయం దుబాయ్, బహ్రెయిన్‌లలో క్షిపణి దాడుల సైరన్లు మోగాయి. దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులను బంకర్లలోకి తరలించారు. సౌదీ అరేబియా తమ తూర్పు ప్రాంతంలో రెండు డ్రోన్లను, కువైట్ తమ దేశంలో ఆరు డ్రోన్లను కూల్చివేసినట్లు ప్రకటించాయి. ఉత్తర ఇరాక్‌లోని ఇర్బిల్‌లో ఉన్న యూఏఈ కాన్సులేట్ సమీపంలో డ్రోన్ దాడి జరగ్గా, దాన్ని యూఏఈ తీవ్రంగా ఖండించింది. అలాగే ఇరాక్ లోని కుర్దిస్థాన్ ప్రాంతంలో ఉన్న అమెరికా 'అల్-హరీర్' వైమానిక స్థావరంపై 5 క్షిపణులతో దాడి చేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించారు. మరోవైపు ఇజ్రాయెల్ లోని హైఫా రిఫైనరీలు, ఆయిల్ డిపోలపై తామే డ్రోన్ దాడులు చేశామని ఇరాన్ ఆర్మీ ప్రకటించింది.

Middle East Crisis | "మా పని ఇంకా పూర్తి కాలేదు": నెతన్యాహు వార్నింగ్

ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర స్థాయిలో స్పందించారు. సోమవారం రాత్రి నేషనల్ హెల్త్ కమాండ్ సెంటర్‌ను సందర్శించిన ఆయన, "ఇరాన్ పాలకుల నిరంకుశత్వం నుంచి అక్కడి ప్రజలను విముక్తులను చేయడమే మా లక్ష్యం. ఇప్పటివరకు తీసుకున్న చర్యలతో ఇరాన్ పాలకుల వెన్ను విరిచాం, కానీ మా పని ఇంకా పూర్తి కాలేదు" అని హెచ్చరించారు. ఫ్రాన్స్‌లోని ఇజ్రాయెల్ రాయబారి జాషువా జార్కా మాట్లాడుతూ.. ఇరాన్‌పై యుద్ధ లక్ష్యాలను తాము అనుకున్న సమయం కంటే ముందే సాధిస్తున్నామని తెలిపారు. మరోవైపు దక్షిణ లెబనాన్‌లోని టైర్, సిడాన్, అన్సార్ తదితర ప్రాంతాల్లో ఉన్న హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తోంది. ప్రజలను ఆయా భవనాల నుంచి దూరం వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది.

బాంబ్ షెల్టర్ డేటింగ్ యాప్: నిరంతర సైరన్ల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్న ఇజ్రాయెల్ పౌరుల కోసం ఆ దేశం ఒక వినూత్నమైన "బాంబ్ షెల్టర్ డేటింగ్ యాప్" ను తీసుకురావడం గమనార్హం.

ట్రంప్ వార్నింగ్.. రష్యాకు లాభం అంటున్న ఈయూ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం మూడున్నర రోజుల్లో ఇరాన్‌కు చెందిన 46 అత్యుత్తమ నావికా నౌకలను అమెరికా ముంచేసిందని, మొత్తం 5000 లక్ష్యాలను ఛేదించామని ఆయన తెలిపారు. హార్ముజ్ జలసంధి గుండా చమురు రవాణాను ఇరాన్ అడ్డుకుంటే, "20 రెట్లు కఠినంగా" ప్రతీకారం తీర్చుకుంటామని ట్రంప్ హెచ్చరించారు. అయితే, యుద్ధం "త్వరలోనే ముగుస్తుందని" ఆయన వ్యాఖ్యానించడంతో యూరోపియన్ స్టాక్ మార్కెట్లు మళ్లీ పుంజుకున్నాయి. ఇరాన్ దాడుల్లో మరణించిన 7వ అమెరికా సైనికుడు సార్జెంట్ బెంజమిన్ పెన్నింగ్టన్ భౌతికకాయాన్ని స్వదేశానికి తీసుకురాగా, వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు.

రష్యాకే లాభం

ఈ యుద్ధం వల్ల కేవలం రష్యా మాత్రమే లాభపడుతోందని ఈయూ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా అన్నారు. ఉక్రెయిన్ యుద్ధం పైనుంచి ప్రపంచం దృష్టి మళ్లడమే కాకుండా, ఇంధన ధరలు పెరగడం రష్యాకు లాభిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్, ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు. మధ్యవర్తిత్వం వహించడానికి తాను సిద్ధమని పుతిన్ ప్రకటించారు.

భగ్గుమంటున్న చమురు ధరలు.. ఆసియాలో ఇంధన కటకట

హార్ముజ్ జలసంధి నుంచి "ఒక్క లీటరు చమురు" కూడా బయటకు వెళ్లనివ్వబోమని ఇరాన్ హెచ్చరించడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మండిపోతున్నాయి.

గల్ఫ్ దేశాల ఉత్పత్తి తగ్గింపు

సౌదీ అరేబియా రోజుకు 2-2.5 మిలియన్ బ్యారెళ్లు, యూఏఈ 5,00,000 బ్యారెళ్లు, కువైట్ హాఫ్ మిలియన్ బ్యారెళ్లు తమ ఆయిల్ ఉత్పత్తిని తగ్గించాయి. దాడుల భయంతో సౌదీ అరామ్‌కో 2025 లాభాలు గతేడాదితో పోలిస్తే 104 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. రాబోయే 30 రోజుల్లో హార్ముజ్ జలసంధిలో చమురు సరఫరా పూర్తిగా నిలిచిపోవచ్చని పుతిన్ అంచనా వేశారు.

పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లలో సంక్షోభం

ఇంధన కొరతతో బంగ్లాదేశ్ తమ ప్రధాన ఆయిల్ డిపోల వద్ద ఆర్మీని మోహరించింది. పాకిస్థాన్ చమురు ధరలను 20 శాతం పెంచింది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధించింది, సగం మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించింది. తమ వాణిజ్య నౌకలకు పాక్ నావికాదళం ఎస్కార్ట్ ఇస్తోంది. వియత్నాం కూడా ఇంధనం ఆదా చేయడానికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని కంపెనీలను కోరింది. ఈజిప్ట్ ఇంధన ధరలను ఏకంగా 30 శాతం పెంచింది.

1000 కిలోల పేలోడ్

ఇప్పటినుంచి 1000 కిలోల కంటే ఎక్కువ పేలోడ్ ఉన్న భారీ క్షిపణులను మాత్రమే ప్రయోగిస్తామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించారు. అమెరికాతో చర్చలు ఇక ఎజెండాలో లేవని ఇరాన్ విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ తీరును ఇరాన్ తప్పుబట్టింది.

టర్కీలో పేట్రియాట్ క్షిపణులు

టర్కీ గగనతలం మీదుగా ఇరాన్ క్షిపణులు వెళ్లడంతో, నాటో దళాలు టర్కీలోని మాలత్య ప్రాంతంలో 'పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థ'ను మోహరించాయి. దక్షిణ కొరియా నుంచి కూడా కొన్ని అమెరికా ఆయుధాలు మిడిల్ ఈస్ట్‌కు తరలుతున్నాయి.

ఇరాక్ వార్నింగ్

పొరుగు దేశాలపై దాడులు చేయడానికి తమ గగనతలాన్ని ఉపయోగించవద్దని ఇరాక్ ప్రధాని అల్-సుదానీ, అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ రూబియోను కోరారు.

కోల్‌కతాలో చిక్కుకున్న క్రికెటర్లు

విమానయాన ఆంక్షల కారణంగా గల్ఫ్ ఎయిర్ తన విమానాలను నిలిపివేసింది. ఎయిర్ స్పేస్ మూసివేత వల్ల కోల్‌కతాలో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఆడిన వెస్టిండీస్, సౌతాఫ్రికా క్రికెట్ జట్లు గత 8 రోజులుగా అక్కడే చిక్కుకుపోయాయి.

మిడిల్ ఈస్ట్ నుంచి 10,000 మందికి పైగా తమ పౌరులను స్వదేశానికి చేర్చినట్లు చైనా ప్రకటించింది.

Advertisement
Advertisement