త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

US-India Trade Deal | ట్రంప్‌ టారిఫ్ త‌గ్గింపు.. కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని మోదీ..

US-India Trade Deal | భారత ఉత్పత్తులపై టారిఫ్‌ను తగ్గిస్తూ అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ కీలక నిర్ణయంతో ద్వైపాక్షిక సంబంధాలకు పెద్ద ఊతం లభించిందని మోదీ అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కృతజ్ఞతలు తెలిపారు.

S

International | Published On Feb 3, 2026, 8.01 am IST

US-India Trade Deal | ట్రంప్‌ టారిఫ్ త‌గ్గింపు.. కృతజ్ఞతలు తెలిపిన ప్రధాని మోదీ..
Advertisement

US-India Trade Deal | భారత ఉత్పత్తులపై టారిఫ్‌ను తగ్గిస్తూ అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ కీలక నిర్ణయంతో ద్వైపాక్షిక సంబంధాలకు పెద్ద ఊతం లభించిందని మోదీ అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కృతజ్ఞతలు తెలిపారు. ట్రంప్ ప్రకటించిన కొత్త వాణిజ్య ఒప్పందం ప్రకారం, భారత ఉత్పత్తులపై ఉన్న రెసిప్రొకల్ టారిఫ్‌ను 25 శాతం నుంచి 18 శాతానికి తక్షణమే తగ్గించనున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా స్పందించిన ప్రధాని మోదీ, ట్రంప్‌తో జరిగిన సంభాషణను అద్భుతమైనదిగా అభివర్ణించారు.

140 కోట్ల మంది త‌ర‌ఫున ట్రంప్‌కు ధ‌న్య‌వాదాలు: మోదీ

మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై టారిఫ్ 18 శాతానికి తగ్గడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ గొప్ప ప్రకటనకు భారతదేశంలోని 140 కోట్ల మంది తరఫున అధ్యక్షుడు ట్రంప్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు, అని మోదీ పేర్కొన్నారు. భారత్-అమెరికా మధ్య మరింత సన్నిహిత సహకారం కొత్త అవకాశాలకు దారి తీస్తుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు, పెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిసి పనిచేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. పరస్పర లాభదాయకమైన సహకారానికి విస్తృత అవకాశాలు ఏర్ప‌డుతాయి, అని ఆయన అన్నారు. భారత్-అమెరికా ఆర్థిక భాగస్వామ్యం భవిష్యత్తులో మరింత బలపడుతుందన్న ఆశావహ దృక్పథాన్ని వ్యక్తం చేశారు.

ట్రంప్ శాంతి మంత్రానికి భార‌త్ పూర్తి మ‌ద్ద‌తు..

అంతేకాకుండా అంతర్జాతీయ స్థాయిలో ట్రంప్ నాయకత్వాన్ని మోదీ ప్రశంసించారు. ప్రపంచ శాంతి, స్థిరత్వం, సమృద్ధికి అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వం కీలకం. శాంతి కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతు ఇస్తుంది, అని తెలిపారు. ఇరు దేశాల భాగస్వామ్యాన్ని అద్భుత‌ స్థాయికి తీసుకెళ్లేందుకు ట్రంప్‌తో సన్నిహితంగా పనిచేయాలని ఎదురుచూస్తున్నట్లు మోదీ వెల్లడించారు. ఇదివరకు ట్రంప్ కూడా ఈ ఫోన్ సంభాషణను స్నేహపూర్వకమని పేర్కొంటూ, టారిఫ్ తగ్గింపును విస్తృత వాణిజ్య ఒప్పందంలో భాగంగా వివరించారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ టారిఫ్‌లు, నాన్-టారిఫ్ ఆంక్షలను తగ్గించడంతో పాటు, ఇంధనం, వ్యవసాయం, సాంకేతిక రంగాల్లో అమెరికా నుంచి కొనుగోళ్లను గణనీయంగా పెంచుతుందని ట్రంప్ తెలిపారు.

25 శాతం అద‌న‌పు టారిఫ్ ప్ర‌శ్నార్థ‌క‌మే..?

కాగా ఈ తాజా ఒప్పందంతో భారత్-అమెరికా వాణిజ్య సంబంధాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటాయ‌ని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరు దేశాల నేతలు బహిరంగంగా సన్నిహిత ఆర్థిక, వ్యూహాత్మక సహకారానికి మద్దతు తెలపడంతో, న్యూఢిల్లీ-వాషింగ్టన్ సంబంధాలు మరో కొత్త దశలోకి అడుగుపెడుతున్నాయని రాజకీయ, ఆర్థిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ప్ర‌ధాన టారిఫ్‌ను 25 నుంచి 18 శాతానికి త‌గ్గించారు. కానీ ర‌ష్యా నుంచి చ‌మురు కొనుగోలు చేస్తున్న కార‌ణంగా విధిస్తున్న 25 శాతం అద‌న‌పు టారిఫ్‌ను తొల‌గించే విష‌య‌మై ఇంకా స్ప‌ష్టత రావ‌ల్సి ఉంది. ర‌ష్యా నుంచి చ‌మురు కొనుగోళ్ల‌ను నిలిపివేస్తామ‌ని భార‌త్ తెలిపింద‌ని ట్రంప్ అన్నారు. ఈ క్ర‌మంలో భార‌త్ నిజంగానే ఆ ప‌నిచేస్తుందా, ఒక వేళ చేస్తే ట్రంప్ ఆ అద‌న‌పు 25 శాతం టారిఫ్‌ను తొల‌గిస్తారా.. అన్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

Advertisement
Advertisement