త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

US Arms | యుద్ధమే బూస్ట్‌..! యూఎస్‌ ఆయుధ పరిశ్రమకు కొత్త ఊపు..!

US Arms | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) వైట్‌హౌస్‌లో ఇటీవల కీలక సమావేశం నిర్వహించారు. అనంతరం అమెరికాలోని అగ్ర రక్షణ కంపెనీలు అధునాతన ఆయుధాల ఉత్పత్తిని భారీగా పెంచేందుకు అంగీకరించాయి. ట్రంప్ పేర్కొన్న ‘ఎక్స్‌క్విజిట్ క్లాస్‌’గా పిలుస్తున్న అత్యాధునిక ఆయుధాల ఉత్పత్తిని నాలుగు రెట్లు పెంచే దిశగా ఈ కంపెనీలు ముందుకు రావడం గమనార్హం.

P

International | Published On Mar 10, 2026, 8.09 pm IST

US Arms | యుద్ధమే బూస్ట్‌..! యూఎస్‌ ఆయుధ పరిశ్రమకు కొత్త ఊపు..!
Advertisement
  • అమెరికా రక్షణ దిగ్గజాల ఆయుధాల ఉత్పత్తికి డిమాండ్‌
  • ఇరాన్‌పై యుద్ధంలో భారీగా వినియోగం
  • ఉత్పత్తిని పెంచేందుకు అమెరికా రక్షణ కంపెనీల నిర్ణయం
  • ఇరాన్ ఉద్రిక్తతలతో అమెరికా డిఫెన్స్ ఇండ‌స్ట్రీకి గిరాకీ
  • అధునాతన మిసైల్స్‌, డ్రోన్ల తయారీకి గ్రీన్‌సిగ్నల్
  • ప్రపంచ ఆయుధ మార్కెట్‌లో బలపడుతున్న యూఎస్‌ కంపెనీలు

US Arms | త్రినేత్ర.న్యూస్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) వైట్‌హౌస్‌లో ఇటీవల కీలక సమావేశం నిర్వహించారు. అనంతరం అమెరికాలోని అగ్ర రక్షణ కంపెనీలు అధునాతన ఆయుధాల ఉత్పత్తిని భారీగా పెంచేందుకు అంగీకరించాయి. ట్రంప్ పేర్కొన్న ‘ఎక్స్‌క్విజిట్ క్లాస్‌’గా పిలుస్తున్న అత్యాధునిక ఆయుధాల ఉత్పత్తిని నాలుగు రెట్లు పెంచే దిశగా ఈ కంపెనీలు ముందుకు రావడం గమనార్హం. శుక్రవారం జరిగిన ఈ సమావేశంలో అమెరికాలోని ప్రముఖ రక్షణ కంపెనీలైన ఆర్‌టీఎక్స్ కార్పొరేషన్ (RTX Corporation), లాక్‌హీడ్ మార్టిన్ (Lockheed Martin), బోయింగ్ (Boeing), నార్త్రప్ గ్రుమ్మన్‌ (Northrop Grumman), బీఏఈ సిస్టమ్స్ (BAE Systems), ఎల్3హారిస్ టెక్నాలజీస్ (L3Harris Technologies)కు చెందిన మిసైల్ సొల్యూషన్స్ విభాగం, అలాగే హనీవెల్ ఏరోస్పేస్ (Honeywell Aerospace) సంస్థల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు పాల్గొన్నారు. ఈ సంస్థల వద్ద ఇప్పటికే బిలియన్ల డాలర్ల విలువైన ఆయుధాల ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి. కొన్ని ఆర్డర్ల విలువ అనేక దేశాల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోలిస్తే కూడా అధికంగా ఉండటం గమనార్హం.

ప్రపంచ సైనిక వ్యయంలో అమెరికాదే అగ్రస్థానం

ప్రస్తుతం ప్రపంచంలోనే సైనిక అవసరాలకు అత్యధికంగా ఖర్చు చేసే దేశం అమెరికానే. 2025 నాటికి అమెరికా సైనిక వ్యయం దాదాపు ఒక ట్రిలియన్ డాలర్లకు చేరింది. ప్రపంచంలోని తదుపరి తొమ్మిది దేశాలు కలిపి చేసే సైనిక వ్యయాన్నికూడా అమెరికా మించిందని స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ (Stockholm International Peace Research Institute – SIPRI) వెల్లడించింది. ట్రంప్ ఈ వ్యయాన్ని 2027 నాటికి 1.5 ట్రిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటీవలి కాలంలో ఇరాన్‌తో జరిగిన యుద్ధంలో అమెరికా ఇప్పటికే బిలియన్ల డాలర్ల విలువైన ఆయుధాలను వినియోగించింది. ఈ పరిణామం రక్షణ రంగ సంస్థలకు యుద్ధాన్ని లాభదాయక వ్యాపారంగా మార్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత వారం అమెరికాలో ప్రధాన ఆయుధ తయారీ సంస్థల షేర్ల ధరలు పెరిగాయి. నార్త్రప్ గ్రుమ్మన్‌ (Northrop Grumman) షేర్లు సుమారు 5 శాతం, ఆర్‌టీఎక్స్ కార్పొరేషన్ (RTX Corporation) షేర్లు 4.5 శాతం, లాక్‌హీడ్ మార్టిన్ (Lockheed Martin) షేర్లు సుమారు 3 శాతం మేర పెరిగాయి.

ఇరాన్‌పై అమెరికా వినియోగిస్తున్న ఆయుధాలు

అమెరికా సైన్యంలోని యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ (United States Central Command) ప్రకారం ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’లో అమెరికా వాయుసేన, నౌకాదళం, భూసేన, మిస్సైల్ రక్షణ దళాలకు చెందిన 20కుపైగా విభిన్న ఆయుధ వ్యవస్థలను ఉపయోగిస్తోంది. దాదాపు మూడు దశాబ్దాలుగా పెంటగాన్ వినియోగిస్తున్న ప్రధాన దీర్ఘశ్రేణి క్షిపణి టోమాహాక్ క్రూయిజ్ మిస్సైల్‌ (Tomahawk cruise missile). ఈ క్షిపణులు తక్కువ ఎత్తులో భూమికి సమీపంగా ప్రయాణిస్తూ రాడార్‌లను తప్పించుకుని లక్ష్యాలను ఛేదిస్తాయి. అరేబియా సముద్రంలో మోహరించిన అర్లీ బర్క్ క్లాస్ డిస్ట్రాయర్‌ (Arleigh Burke-class destroyer) యుద్ధనౌకల నుంచి వీటిని ప్రయోగిస్తున్నారు. ఒక్కో నౌకలో 90కిపైగా టోమాహాక్ క్షిపణులను మోసుకెళ్లే సామర్థ్యం ఉంది. అదేవిధంగా అమెరికా తొలిసారిగా ఇరాన్‌పై ప్రెసిషన్ స్ట్రైక్ మిస్సైల్‌ (Precision Strike Missile)ను వినియోగించింది. ఎడారి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఎమ్-142 హిమార్స్ రాకెట్ వ్యవస్థ (M142 HIMARS) లాంచర్‌ల నుంచి ఈ దాడులు జరిగాయి. ఈ షార్ట్‌రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ సుమారు 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించగలదు. రక్షణ చర్యల్లో భాగంగా అమెరికా పేట్రియట్ మిస్సైల్ రక్షణ వ్యవస్థ (Patriot missile system), థాడ్ మిస్సైల్ రక్షణ వ్యవస్థ (THAAD missile defense system)లను కూడా మోహరించింది. తక్కువ ఎత్తులో వచ్చే క్రూయిజ్ క్షిపణులను పేట్రియట్ వ్యవస్థలు అడ్డుకుంటే, ఎత్తులో నుంచి వచ్చే బాలిస్టిక్ క్షిపణులను చివరి దశలో థాడ్ వ్యవస్థ అడ్డుకుంటుంది.

డ్రోన్ల వినియోగం

ఇరాన్‌పై దాడుల్లో తక్కువ ఖర్చుతో పనిచేసే కొత్త డ్రోన్ వ్యవస్థను కూడా అమెరికా వినియోగిస్తోంది. స్పెక్ట్రే వర్క్స్ (SpektreWorks) తయారు చేసిన లో కాస్ట్ అన్‌క్రూడ్ కాంబాట్ అటాక్ సిస్టమ్ (Low-Cost Uncrewed Combat Attack System) అనే డ్రోన్‌ను తొలిసారిగా ఉపయోగించారు. దీని ఒక్కో యూనిట్ ధర సుమారు 35 వేల డాలర్లు. ఇరాన్ ఉపయోగిస్తున్న షాహెద్ తరహా డ్రోన్ల నమూనాను ఆధారంగా తీసుకుని దీన్ని రూపొందించారు. అదే సమయంలో అమెరికా ఎమ్‌క్యూ-9 రీపర్ డ్రోన్ (MQ-9 Reaper)లను కూడా వినియోగిస్తోంది. ఒక్కో రీపర్ డ్రోన్ తయారీ ఖర్చు సుమారు 40 మిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. మార్చి 1న ఒక రీపర్ డ్రోన్‌ను కూల్చివేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించింది.

వైమానిక దాడులు

ఇరాన్‌లోని బాలిస్టిక్ మిసైల్ కేంద్రాలు, భూగర్భ బంకర్లపై దాడులకు అమెరికా పలు అధునాతన యుద్ధవిమానాలను వినియోగిస్తోంది. ఇందులో బీ-1బీ లాన్సర్ బాంబర్ (B-1B Lancer), బీ-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ (B-2 Spirit stealth bomber), ఎఫ్-15 ఈగిల్ ఫైటర్ జెట్ (F-15 Eagle), ఎఫ్-22 రాప్టర్ (F-22 Raptor), ఎఫ్-35 లైట్నింగ్-2 (F-35 Lightning II) వంటి యుద్ధవిమానాలు ఉన్నాయి. ఇవి సుమారు 900 కిలోల బరువున్న బాంబులను ప్రయోగించి ఇరాన్ ఆయుధ నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి.

నిఘా వ్యవస్థ..

అరేబియా సముద్రంలో మోహరించిన యుఎస్‌స్ అబ్రహాం లింకన్ (USS Abraham Lincoln) యుద్ధనౌకపై ఈఏ-18జీ గ్రౌలర్ (EA-18G Growler) ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ విమానాలు కనిపించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఇవి శత్రుదేశ రాడార్, కమ్యూనికేషన్ వ్యవస్థలు, మిస్సైల్స్‌ గైడెడ్‌ వ్యవస్థలను అడ్డుకునేందుకు ఉపయోగిస్తుంటారు. అదేవిధంగా పీ-8ఏ పోసైడన్ (P-8A Poseidon) నిఘా విమానాలు సముద్రం, భూభాగాల్లో నిఘా కార్యకలాపాల్లో నిమగ్నమయ్యాయి. హోర్ముజ్ జలసంధి చుట్టూ ఈ విమానాలు గస్తీ కాస్తున్నట్లు ఫ్లైట్ ట్రాకింగ్ సమాచారం సూచిస్తోంది. గత నెలలో అమెరికా వాయుసేన ఈ-3 సెంట్రీ అవాక్స్ (E-3 Sentry AWACS) రాడార్ విమానాలను మిడల్‌ ఈస్ట్‌కు పంపింది. యుద్ధరంగ పరిస్థితులపై తక్షణ సమాచారాన్ని అందించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే ఆర్‌సీ-135 రెకాన్నైస్సన్స్ ఎయిర్‌ క్రాఫ్ట్‌ (RC-135 reconnaissance aircraft)తో ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఎయిర్‌బేస్‌ల నుంచి ఇరాన్ మిస్సైల్‌, రాడార్ వ్యవస్థలు, కమ్యూనికేషన్ కార్యకలాపాలపై నిఘా వేస్తోంది. అమెరికా నేవీకి చెందిన యుఎస్‌ అబ్రహాం లింకన్, యుఎస్‌ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ (USS Gerald R. Ford) యుద్ధనౌకలు వరుసగా అరేబియా సముద్రం, మధ్యధరా సముద్ర ప్రాంతాల్లో మోహరించాయి. వీటితో పాటు అర్లీ బర్డ్‌ క్లాస్‌ డిస్ట్రాయర్లతో దాడులు చేయడంతో పాటు మిస్సైల్స్‌ డిఫెన్స్‌ కోసం ఉపయోగిస్తోంది.

ప్రపంచ రక్షణ పరిశ్రమలో అమెరికా ఆధిపత్యం..

స్టాక్‌హోం పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నివేదిక ప్రకారం.. 2024లో ప్రపంచంలోని టాప్ 100 రక్షణ సంస్థలు కలిపి 679 బిలియన్ డాలర్లకుపైగా ఆదాయం ఆర్జించాయి. ఇందులో అమెరికన్‌ సంస్థల ఆదాయమే దాదాపు 334 బిలియన్ డాలర్లు ఉండటం గమనార్హం. ఆ తర్వాతి స్థానాల్లో చైనా (88 బిలియన్ డాలర్లు), యునైటెడ్ కింగ్‌డమ్ (52 బిలియన్ డాలర్లు), రష్యా (31 బిలియన్ డాలర్లు), ఫ్రాన్స్ (26 బిలియన్ డాలర్లు) ఉన్నాయి. యూరప్‌కు చెందిన ప్రముఖ సంస్థలైన బీఏఈ సిస్టమ్స్ (BAE Systems), (లియోనార్డో (Leonardo S.p.A.), ఎయిర్‌బస్ (Airbus), థేలెస్ గ్రూప్ (Thales Group), రైన్‌మెటాల్ (Rheinmetall) వంటి సంస్థలు టాప్ 20 జాబితాలో ఉన్నాయి. ముఖ్యంగా రష్యా–ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఈ సంస్థల వ్యాపారం మరింత పెరిగినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

అమెరికాలో అగ్ర రక్షణ సంస్థలు

సిప్రి నివేదిక ప్రకారం ప్రపంచ టాప్ 100 రక్షణ సంస్థల జాబితాలో అమెరికాకు చెందిన 39 కంపెనీలు ఉన్నాయి. చైనాకు చెందిన సంస్థలు ఎనిమిది మాత్రమే ఉన్నాయి. అమెరికాలో ఐదు టాప్‌ రక్షణరంగ సంస్థల్లో లాక్‌హీడ్ మార్టిన్ (Lockheed Martin) 1995లో మార్టిన్ మారియెట్టాతో విలీనమై ఏర్పడింది. 2024లో ఈ సంస్థ ఆదాయం 68.4 బిలియన్ డాలర్లు. ఆర్‌టీఎక్స్ కార్పొరేషన్ (RTX Corporation) 2020లో రేథియాన్-యునైటెడ్ టెక్నాలజీస్ విలీనంతో ఏర్పాటు జరిగింది. 2024లో రక్షణ రంగం నుంచి 43.6 బిలియన్ డాలర్ల ఆదాయం కంపెనీకి సమకూరింది. నార్త్రప్ గ్రుమ్మన్‌ (Northrop Grumman) 1994లో ఏర్పాటైంది. ఈ కంపెనీ బీ-21 రైడర్ వంటి స్టెల్త్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీ, స్పేస్‌ సిస్టమ్స్‌, యూఎస్‌ ఎయిర్‌ ఫోర్స్‌, ప్రభుత్వం కోసం అణు అధునికీకరణ కార్యక్రమాలతో ఆదాయం వస్తుంది. 2024లో కంపెనీ ఆదాయంలో 37.9 బిలియన్‌ డాలర్లు రక్షణ రంగం నుంచే సంపాదించింది. జెనరల్ డైనమిక్స్ (General Dynamics) అణు సబ్‌మెరైన్స్‌, ట్యాంకులు, సైనిక వాహనాల తయారీకి ప్రసిద్ధి. 2024లో 33.6 బిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది. బోయింగ్ (Boeing) కంపెనీ వాణిజ్య విమానాలతో పాటు రక్షణ వ్యవస్థలను కూడా తయారు చేస్తుంది. 2024లో రక్షణ రంగం నుంచి 30.6 బిలియన్ డాలర్లు సంపాదించింది.

ఇజ్రాయెల్ రక్షణ సంస్థలు

టాప్ 100 జాబితాలో ఇజ్రాయెల్‌కు చెందిన మూడు సంస్థలు ఉన్నాయి. ఇందులో ఎల్బిట్ సిస్టమ్స్ (Elbit Systems), ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (Israel Aerospace Industries), రఫెల్ అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ సిస్టమ్స్ (Rafael) ఉన్నాయి. ఐరన్ డోమ్ మిస్సైల్‌ రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసిన సంస్థగా రఫెల్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. సిప్రి గణాంకాల ప్రకారం 2024లో ప్రపంచ రక్షణ వ్యయం 9.4 శాతం పెరిగి 2.7 ట్రిలియన్ డాలర్లకు చేరింది. నాటో దేశాలు తమ వార్షిక రక్షణ వ్యయాన్ని 2035 నాటికి జీడీపీలో 2 శాతం నుంచి 5 శాతానికి పెంచాలని నిర్ణయించాయి. ఉక్రెయిన్, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధాల కారణంగా భారీగా ఆయుధ నిల్వలను ఉపయోగిస్తున్నారు. తగ్గిపోయిన ఆయుధ నిల్వలను భర్తీ చేసేందుకు ప్రపంచ ఆయుధ తయారీ కంపెనీలు బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెడుతున్నాయి. పెరుగుతున్న డిమాండ్ కారణంగా రక్షణ రంగ సంస్థల షేర్ల ధరలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. 2023 మార్చి నుంచి 2026 మార్చి వరకు అమెరికా రక్షణ సంస్థల షేర్ల ధరలను పరిశీలిస్తే ఆర్‌టీఎక్స్ కార్పొరేషన్ షేర్లు 110 శాతం పెరిగాయి. నార్త్రప్ గ్రుమ్మన్‌ షేర్లు 60 శాతం, జనరల్ డైనమిక్స్ షేర్లు 57 శాతం, లాక్‌హీడ్ మార్టిన్ షేర్లు 37 శాతం, బోయింగ్ షేర్లు 5 శాతం మేర పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

Advertisement
Advertisement