ఇప్పుడంతా కాంక్రీట్ జంగల్. ఎక్కడ చూసినా నగరాలు చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి. పల్లెలు అంతరించిపోతున్నాయి. ఇలా నగరాలు విస్తరించడం ఒకరకంగా అభివృద్ధికి మూలం అని అంతా అనుకుంటున్నాం కానీ.. నగరాల విస్తరణ చూస్తుంటే భవిష్యత్తులో ఇది తీవ్ర నీటి సంక్షోభానికి దారి తీస్తుందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. ఇప్పుడు ఆ అధ్యయనంలో ఉన్న అంశాలు ప్రపంచ మానవాళిని ఆందోళన కలిగిస్తోంది. అధ్యయనం ఏం చెప్తోంది? వియన్నాలోని కాంప్లెక్సిటీ సైన్స్ హబ్ అనే సంస్థ, వరల్డ్ బ్యాంకు కలిసి సంయుక్తంగా ఈ సర్వేను నిర్వహించాయి. ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా ఖండాల్లో ఉన్న 100 కు పైగా నగరాల్లో కొన్ని కోట్ల బిల్డింగ్స్, కొన్ని లక్షల ఇండ్ల డేటాను సేకరించి, విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు. నగరాలు విస్తరిస్తే.. నీరు, పారిశుద్ధ్య నిర్వహణపై ఎలాంటి ప్రభావం పడుతుంది అనే దానిపై ఈ అధ్యయనంలో దృష్టి సారించారు. ఈ అధ్యయనంలో భాగంగా 2050 నాటికి నగరాల అభివృద్ధికి సంబంధించి మూడు నమూనాలను తయారు చేశారు. అందులో కాంపాక్ట్ అంటే ఇప్పటికే ఉన్న నగర ప్రాంతాల్లో జనసాంద్రతను పెంచడం, పర్సిస్టెంట్ అంటే ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాణ పద్ధతులనే అవలంబించడం, హారిజాంటల్ అంటే ఇప్పటికే ఉన్న నగరాలను కొత్త ఏరియాలకు విస్తరించడం. కానీ.. ఇక్కడే పెద్ద చిక్కు వచ్చి పడింది. నగరాలు కొత్త ప్రాంతాల్లో విస్తరిస్తూ పోతే 2050 నాటికి 20 కోట్లకు పైగా ప్రజలు మంచి నీటిని అందుకోలేరు. కాంపాక్ట్ నగరాలతో పోల్చితే హారిజాంటల్ నగరాల్లో నీటి బిల్లులు తడిసి మోపెడు అవుతాయి. అలాగే.. నగరం మధ్యలో ఉన్నవారి కంటే నగరం శివార్లలో నివసించే వారికి మౌలిక వసతులు అందవు. వీటితో పాటు 2050 వరకు ఆఫ్రికాలో పట్టణ జనాభా విపరీతంగా పెరగనుంది. ఆ తర్వాత స్థానంలో ఆసియా ఉండనుంది. దీనికి పరిష్కారం ఏంటి? నగరాల విస్తరణ అనేది ప్రణాళిక బద్దంగా ఉంటే 2050 వరకు రాబోయే నీటి ఎద్దడిని తట్టుకొని నిలబడవచ్చు. కొత్తగా మౌలిక సదుపాయాల మీద కాకుండా.. ప్లానింగ్ తో మంచి నీటిని అందించవచ్చని అధ్యయనం చెబుతోంది. నగరాలను అనవసరంగా విస్తరించడం కాకుండా, జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలనే అభివృద్ధి చేస్తే కొత్త ప్రాంతాల్లో నగరాలు విస్తరించకుండా ఉంటుంది. దాని వల్ల పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని ఈ అధ్యయనం చేసిన పరిశోధకులు అభిప్రాయపడ్డారు.