US shootings | కాల్పులతో దద్దరిల్లిన అమెరికా
US shootings | మరోసారి అమెరికా కాల్పులతో దద్దరిల్లింది. రెండుచోట్ల కాల్పులు చోటు చేసుకున్నాయి. వర్జీనియా స్టేట్ యూనివర్సిటీలో శనివారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో ఐదుగురు గాయపడ్డారు. మరోవైపు మిషిగన్‌లో చోటుచేసుకున్న కాల్పుల ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
International | Published On Aug 16, 2026, 7.10 am IST
- రెండుచోట్ల కాల్పులు
- ఆరుగురు మృతి
- మరో ఐదుగురికి గాయాలు
- వర్జీనియా స్టేట్ యూనివర్సిటీ, మిషిగన్‌లో ఘటనలు
- కాల్పులకు కారణాలపై స్పష్టత కరువు
US shootings | మరోసారి అమెరికా కాల్పులతో దద్దరిల్లింది. రెండుచోట్ల కాల్పులు చోటు చేసుకున్నాయి. వర్జీనియా స్టేట్ యూనివర్సిటీలో శనివారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో ఐదుగురు గాయపడ్డారు. మరోవైపు మిషిగన్‌లో చోటుచేసుకున్న కాల్పుల ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 16 ఏళ్ల బాలుడు, ఇద్దరు మహిళలు ఉన్నారు. కాల్పులకు తెగబడిన అనుమానిత నిందితుడు కూడా మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. రెండు ఘటనలపైనా దర్యాప్తు కొనసాగుతోంది. కాల్పులకు దారితీసిన కారణాలు మాత్రం ఇంకా వెల్లడికాలేదు.
విశ్వవిద్యాలయంలో కాల్పులు
వర్జీనియా స్టేట్ యూనివర్సిటీలోని క్వాడ్ అనెక్స్ సమీపంలో శనివారం ఉదయం కాల్పులు జరిగాయి. సమాచారం అందుకున్న క్యాంపస్ పోలీసులు, చెస్టర్‌ఫీల్డ్ కౌంటీ అధికారులు అక్కడికి చేరుకుని వసతి గృహాల వెలుపల తుపాకీ గాయాలతో ఉన్న ఐదుగురిని గుర్తించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి తొలుత ప్రాణాపాయంగా ఉండగా.. ఆ తర్వాత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మిగిలిన వారికి ప్రాణాపాయం లేదని వెల్లడించారు. గాయపడిన వారిలో కనీసం ఒకరు యూనివర్సిటీ విద్యార్థి ఉన్నట్లు అధికారులు తెలిపారు. చికిత్స అనంతరం అతడిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఈ ఘటనకు సంబంధించి 19 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది.
లాక్‌డౌన్‌తో కలకలం
కాల్పుల అనంతరం యూనివర్సిటీని పోలీసులు లాక్‌డౌన్ చేశారు. పలువురు అనుమానితులు కాల్పుల్లో పాల్గొని ఉండొచ్చని అధికారులు భావించారు. క్యాంపస్‌లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అయితే విద్యార్థులు, సిబ్బందికి తక్షణ ముప్పు లేదని నిర్ధారించిన తర్వాత లాక్‌డౌన్‌ను ఎత్తివేశారు. తర్వాతి భద్రతా సమాచారం కోసం తమ ఈ-మెయిల్స్‌ను పరిశీలించాలని విద్యార్థులకు సూచించారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి విద్యార్థులు క్యాంపస్‌కు తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం ఆందోళనకు గురిచేసింది. సోమవారం నుంచి తరగతులు ప్రారంభం కావాల్సి ఉంది. వర్జీనియా స్టేట్ యూనివర్సిటీలో సుమారు 5,700 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇది చారిత్రకంగా నల్లజాతీయుల విద్యాసంస్థగా గుర్తింపు పొందింది.
మిషిగన్‌లో ఆరుగురి మృతి
మిషిగన్‌లోని మిస్సాకీ కౌంటీ పరిసరాల్లో వరుస కాల్పులు చోటుచేసుకున్నాయి. ఓ ఇంట్లో 16 ఏళ్ల బాలుడు, 45 ఏళ్ల వ్యక్తి, 40 ఏళ్ల మహిళ మృతదేహాలను పోలీసులు గుర్తించారు. అదే ప్రాంతంలో 13 ఏళ్ల బాలిక తీవ్ర గాయాలతో కనిపించింది. ఆమె ప్రాణాలతో బయటపడినప్పటికీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో చోట 53 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అనంతరం అడవుల్లో 29 ఏళ్ల మహిళతో పాటు అనుమానిత షూటర్ చాడ్ హిక్మన్ మృతదేహాన్ని గుర్తించారు. మృతులందరూ తుపాకీ గాయాల కారణంగానే మరణించినట్లు పోలీసులు తెలిపారు.
భారీ గాలింపు చర్యలు..
మొదట కాల్పుల అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. దీంతో మిస్సాకీ కౌంటీ పరిసరాల్లో భారీ గాలింపు చేపట్టారు. పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన అనంతరం అడవుల్లో హిక్మన్ మృతదేహాన్ని గుర్తించారు. అతడితో పాటు ఓ మహిళ మృతదేహం కూడా అక్కడ లభ్యమైంది. మృతుల వయసు, లింగ వివరాలను పోలీసులు వెల్లడించినప్పటికీ.. వారికీ అనుమానితుడికీ మధ్య ఉన్న సంబంధంపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. హిక్మన్ 2024లో బాలలపై వేధింపుల కేసులో దోషిగా తేలి ఏడాది జైలు శిక్ష అనుభవించినట్లు అధికారులు తెలిపారు.
భద్రతపై మరోసారి ఆందోళన
ఒకవైపు విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు యూనివర్సిటీ క్యాంపస్‌లో కాల్పులు జరగడం.. మరోవైపు మిషిగన్‌లో ఒకే ప్రాంతంలో వరుస కాల్పులు చోటుచేసుకోవడం అమెరికా సమాజంలో భద్రతపై ఆందోళనలను పెంచింది. రెండు ఘటనల్లోనూ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే కాల్పులకు అసలు కారణం ఏమిటన్నది ఇప్పటివరకు స్పష్టంకాలేదు. వర్జీనియా ఘటనపై ఆ రాష్ట్ర గవర్నర్‌తో పాటు సెనేటర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, యూనివర్సిటీ సమాజం ఆందోళనలను అర్థం చేసుకుంటున్నామని.. విద్యార్థుల భద్రత, సంక్షేమమే తమకు అత్యంత ప్రాధాన్యమని వర్సిటీ యాజమాన్యం పేర్కొంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Balapur Ganesh | పూరీ జగన్నాథస్వామి ఆలయ నమూనాలో బాలాపూర్ గణేశుడి మండపం
- ●Horoscope | ఆగస్టు 16 రాశి ఫలాలు.. ఈ రాశివారు సృజనాత్మక పనుల్లో విజయం సాధిస్తారు!
- ●Gold Limit in India | ఇంట్లో ఎంత బంగారం పెట్టుకోవచ్చు? పత్రాలు లేకుండా లిమిట్ దాటితే సీజ్ చేస్తారా?
- ●Gen Z Job Rejection | కోటి రూపాయల ప్యాకేజీని వదులుకున్న 25 ఏళ్ల కుర్రాడు.. కారణం తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు
- ●Life After Death | చనిపోయి బతికిన మహిళ.. ప్రాణాలు పోయిన ఆ రెండు నిమిషాలు ఆమె ఏం చూసిందో తెలుసా?
- ●Golgappa Incident | పానిపూరి తింటూ లాకైన దవడ.. నోరు తెరిచినట్లే ఉండిపోయిన మహిళ.. ఆసుపత్రికి పరుగులు

Balapur Ganesh | పూరీ జగన్నాథస్వామి ఆలయ నమూనాలో బాలాపూర్ గణేశుడి మండపం

Horoscope | ఆగస్టు 16 రాశి ఫలాలు.. ఈ రాశివారు సృజనాత్మక పనుల్లో విజయం సాధిస్తారు!

Gold Limit in India | ఇంట్లో ఎంత బంగారం పెట్టుకోవచ్చు? పత్రాలు లేకుండా లిమిట్ దాటితే సీజ్ చేస్తారా?

Gen Z Job Rejection | కోటి రూపాయల ప్యాకేజీని వదులుకున్న 25 ఏళ్ల కుర్రాడు.. కారణం తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు






