Annavaram | సత్యమే దైవం.. అన్నవరంలో సత్యనారాయణుడి వైభవం
Annavaram | ‘సత్యం బ్రూయాత్.. ప్రియం బ్రూయాత్’ అని సనాతన ధర్మం చెబుతుంది. సత్యాన్ని పలకాలి.. అది ఎదుటివారికి ఇంపుగా ఉండాలి. మనసుకు కష్టం కలిగించేలా సత్యాన్ని చెప్పకపోవడమే మంచిదే తప్ప, ఇతరులను మెప్పించేందుకు అసత్యాన్ని ఆశ్రయించకూడదన్నదే ఈ సందేశంలోని అంతరార్థం. సత్యంలోనే దైవత్వం ఉందన్న భావనకు ప్రతిరూపంగా నిలిచే క్షేత్రమే అన్నవరం. ఇక్కడ రత్నగిరిపై కొలువుదీరిన శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి భక్తుల పాలిట కొంగుబంగారంగా వెలుగొందుతున్నారు.
Devotional | Published On Aug 13, 2026, 10.20 am IST
- ఈ నెల 14న స్వామివారి ఆవిర్భావోత్సవం
- ముస్తాబైన రత్నగిరి
- స్వామివారి జయంతికి ప్రత్యేక పూజలు..
- సత్యవ్రతం వెనుక అంతరార్థం తెలుసా?
Annavaram | ‘సత్యం బ్రూయాత్.. ప్రియం బ్రూయాత్’ అని సనాతన ధర్మం చెబుతుంది. సత్యాన్ని పలకాలి.. అది ఎదుటివారికి ఇంపుగా ఉండాలి. మనసుకు కష్టం కలిగించేలా సత్యాన్ని చెప్పకపోవడమే మంచిదే తప్ప, ఇతరులను మెప్పించేందుకు అసత్యాన్ని ఆశ్రయించకూడదన్నదే ఈ సందేశంలోని అంతరార్థం. సత్యంలోనే దైవత్వం ఉందన్న భావనకు ప్రతిరూపంగా నిలిచే క్షేత్రమే అన్నవరం. ఇక్కడ రత్నగిరిపై కొలువుదీరిన శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి భక్తుల పాలిట కొంగుబంగారంగా వెలుగొందుతున్నారు. ఇంట్లో పెళ్లి జరిగినా.. గృహప్రవేశం చేసినా.. ఏదైనా శుభకార్యం తలపెట్టినా సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం తెలుగునాట తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. భక్తి, సత్యనిష్ట, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం వంటి విలువలను ఈ వ్రతం ప్రజల జీవితాల్లోకి తీసుకువస్తుందన్న విశ్వాసం ఉంది.
రత్నగిరిపై వెలసిన సత్యదేవుడు
అన్నవరం క్షేత్రానికి సంబంధించిన పురాణ గాథలో రత్నగిరికి విశిష్ట స్థానం ఉంది. మేరు పర్వతుడు, ఆయన సతీమణి మేనకాదేవి శ్రీమహావిష్ణువును ఆరాధించి ఆయన అనుగ్రహంతో భద్రుడు, రత్నకుడు అనే ఇద్దరు పర్వత పుత్రులను పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి. వారిలో భద్రుడు శ్రీరామచంద్రుని కోసం తపస్సు చేసి భద్రాచలంగా మారగా.. రత్నకుడు విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకుని రత్నగిరిగా అవతరించాడని స్థలపురాణం. ఆ రత్నగిరిపైనే శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి కొలువుదీరారు. తూర్పుగోదావరి ప్రాంతంలోని అన్నవరం గ్రామం ఆ స్వామివారి ఆవిర్భావంతోనే విశిష్ట పుణ్యక్షేత్రంగా మారింది.
స్వప్నంలో ఆదేశం.. పుట్టలో స్వామి దర్శనం
అన్నవరం క్షేత్ర చరిత్ర 1891 సంవత్సరంతో ముడిపడి ఉంది. అప్పట్లో గ్రామానికి చెందిన ఈరంకి ప్రకాశరావుకు, గ్రామాధికారి రాజా ఇనుగంటి వెంకట రామనారాయణకు ఒకే సమయంలో శ్రీమహావిష్ణువు స్వప్నంలో దర్శనమిచ్చినట్లు క్షేత్ర చరిత్ర చెబుతోంది. శ్రావణ శుక్ల విదియ, మఖ నక్షత్రం, గురువారం రోజున రత్నగిరిపై తాను వెలుస్తానని.. శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించి పూజలు నిర్వహించాలని స్వామివారు ఆదేశించినట్లు చెబుతారు. మరుసటి రోజు ఇద్దరూ కలిసి అన్నవరం ప్రాంతానికి వెళ్లి స్వామివారి జాడ కోసం అన్వేషించారు. అంకుడు చెట్టు సమీపంలోని పొదల్లో స్వామివారి పాదాలపై సూర్యకిరణాలు పడుతున్న దృశ్యం వారికి కనిపించినట్లుగా స్థలపురాణం చెబుతున్నది. అక్కడి నుంచి అర్చామూర్తిని తీసుకువచ్చి రత్నగిరిపై ప్రతిష్టించారు. కాకినాడ నుంచి తీసుకువచ్చిన శ్రీమతి పాస్వభూతి మహావైకుంఠ నారాయణ యంత్రాన్ని విష్ణు పంచాయతన విధానంలో ప్రతిష్టించి.. 1891 ఆగస్టు 6న అనంతలక్ష్మీ సత్యవతీ సమేతంగా శ్రీ సత్యనారాయణ స్వామివారిని ప్రతిష్టించినట్లుగా ఆలయ చరిత్ర చెబుతోంది. హరిహరులకు భేదం లేదన్న సందేశాన్నీ ఈ క్షేత్రం చాటుతుంది. సత్యనారాయణ స్వామివారి సమీపంలోనే పరమేశ్వరుడు పూజలందుకుంటారు. రత్నగిరిపై నిత్యకల్యాణం పచ్చతోరణంలా భక్తి సందడి కనిపిస్తుంది.
ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రత్యేక పూజలు
రత్నగిరిపై సత్యదేవుడు తొలిసారిగా అర్చామూర్తిగా దర్శనమిచ్చిన రోజును స్వామివారి జయంతిగా భావిస్తారు. ఈ సందర్భంగా అన్నవరం క్షేత్రంలో ప్రతి ఏటా శ్రావణ శుద్ధ పాడ్యమి నుంచి విదియ వరకు రెండు రోజులపాటు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా తెల్లవారుజామున మూలవిరాట్టుకు పంచామృతాభిషేకం చేస్తారు. ప్రధాన ఆలయంతోపాటు అనివేటి మండపం, నిత్యకల్యాణ మండపాలను వివిధ రకాల పుష్పాలు, ఫలాలతో సుందరంగా అలంకరిస్తారు. ప్రత్యేక పూజలు, మండపారాధన అనంతరం ఉత్సవమూర్తులను వేదికపై ఆశీనులను చేసి వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. క్షేత్ర క్షేమం, భక్తుల ఆయురారోగ్యాలను ఆకాంక్షిస్తూ వేదపండితులు సూర్యనమస్కారాలు, వేదపారాయణాలు, జపాలు, హోమాలు నిర్వహిస్తారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన ఆయుష్య హోమాన్ని కూడా చేపట్టి పూర్ణాహుతితో ముగిస్తారు. తర్వాత స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి పల్లకిపై కొలువుదీరుస్తారు. వేదఘోష, మంగళవాయిద్యాల నడుమ ఆలయ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం భక్తులను ఆకట్టుకునేలా హరికథ, భరతనాట్యం, భక్తి సంగీతం తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
సత్యదేవుడి వ్రతం.. శుభఫలాల నమ్మకం
శ్రీమహావిష్ణువును సత్యస్వరూపుడిగా ఆరాధించే విశిష్ట పద్ధతే సత్యనారాయణ స్వామి వ్రతం. కుటుంబంలో సుఖశాంతులు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని కోరుతూ భక్తులు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం, పెద్దలను గౌరవించడం, సాధుసంతులను పరిహసించకపోవడం వంటి సద్గుణాలను ఈ వ్రత కథలు బోధిస్తాయి. వివాహం, గృహప్రవేశం వంటి శుభకార్యాల్లో సత్యనారాయణ వ్రతం చేయడం ఆనవాయితీ. దశమి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి వంటి తిథుల్లో వ్రతాన్ని ఆచరించవచ్చని సంప్రదాయం. శ్రావణ మాసం, వైశాఖ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, మాఘ పౌర్ణమి వంటి విశేష పర్వదినాల్లో ఈ వ్రతానికి మరింత ప్రాధాన్యం ఉందని భక్తుల విశ్వాసం. ఇంట్లోనే సులభంగా వ్రతాన్ని చేసుకోవచ్చు. అవకాశం లేని వారు ఆలయాల్లోనూ నిర్వహించుకుంటారు. పెళ్లి అనంతరం కొత్త దంపతులతో వ్రతం చేయించడం, గృహప్రవేశ సమయంలో సత్యనారాయణ స్వామిని పూజించడం తెలుగు కుటుంబాల్లో కనిపించే సంప్రదాయాల్లో ఒకటి. ఈ వ్రతం అందరికీ అందుబాటులో ఉండే ఆధ్యాత్మిక సాధనగా భావిస్తారు. స్త్రీలు కూడా ఎలాంటి సంకోచం లేకుండా ఆచరించవచ్చని వ్రత కథలు తెలియజేస్తాయి. నారద మహర్షి ద్వారా ఈ వ్రత మహిమ లోకానికి చేరిందని పురాణ గాథలు చెబుతున్నాయి.
ఐదు కథల్లో.. సత్యానికి పెద్దపీట
సత్యనారాయణ స్వామి వ్రతంలో కథా శ్రవణానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. పూజా కార్యక్రమాల్లో భాగంగా ముందుగా పీటపై బియ్యం పోసి స్వామివారి చిత్రపటాన్ని ప్రతిష్ఠిస్తారు. దీపారాధన అనంతరం పసుపు గణపతిని పూజించి, అష్టదిక్పాలకులు, నవగ్రహాలను ఆరాధిస్తారు. అనంతరం సత్యనారాయణ స్వామికి అష్టోత్తర శతనామ పూజ నిర్వహించి వ్రత కథలను శ్రద్ధగా వింటారు. వ్రతంలో మొత్తం ఐదు కథలు ఉంటాయి. ప్రతి కథ వెనుక ఒక ఆధ్యాత్మిక సందేశం దాగి ఉంటుంది. ముఖ్యంగా భగవంతుడికి ఇచ్చిన మాటను సైతం తప్పకూడదన్న భావనను కథలు బలంగా చాటుతాయి. మాట తప్పినప్పుడు ఎదురయ్యే పరిణామాలను వివరిస్తూ సత్యం, భక్తి, నియమం, దైవ విశ్వాసం వంటి విలువలను బోధిస్తాయి. అందుకే వ్రతం చేసుకోవడం ఎంత ముఖ్యమో.. కథలను పూర్తిగా శ్రద్ధగా వినడం కూడా అంతే ముఖ్యమని పెద్దలు చెబుతారు. కథా శ్రవణం అనంతరం అక్షతలను శిరస్సున ధరించి, స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించడం వ్రత విధానంలో భాగం.
ప్రసాదానికీ ప్రత్యేకత..
సత్యనారాయణ స్వామి వ్రతంలో ప్రసాదానికి కూడా విశిష్ట స్థానం ఉంది. రవ్వ, పంచదార తదితర పదార్థాలతో తయారు చేసే ఈ ప్రసాదం రుచికి మాత్రమే కాదు.. ఆధ్యాత్మిక విశ్వాసానికి కూడా ప్రతీకగా భావిస్తారు. వ్రతాన్ని పూర్తిగా ఆచరించకుండా ప్రసాదాన్ని తీసుకోవడం, ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అనర్థాలు సంభవిస్తాయని వ్రత కథలు హెచ్చరిస్తాయి. అందుకే సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని భక్తిశ్రద్ధలతో స్వీకరించడం సంప్రదాయంగా మారింది. సత్యనారాయణ స్వామి వ్రతం కేవలం ఒక పూజా కార్యక్రమం మాత్రమే కాదు. సత్యాన్ని జీవిత విధానంగా మార్చుకోవాలన్న సందేశాన్ని అందించే ఆధ్యాత్మిక మార్గం. కష్టాల్లో దైవాన్ని ఆశ్రయించడం, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం, ఇతరులను గౌరవించడం, ప్రసాదాన్ని భక్తితో స్వీకరించడం.. ఇలా ప్రతి అంశం వెనుక ఒక జీవన విలువ కనిపిస్తుంది. అందుకే అన్నవరం రత్నగిరిపై వెలసిన సత్యదేవుడి ఆవిర్భావోత్సవం భక్తులకు ఓ పర్వదినం. ఆగస్టు 14న జరగనున్న ప్రత్యేక ఉత్సవాల వేళ రత్నగిరి భక్తజన సందోహంతో కళకళలాడనుంది. సత్యమే దైవమనే సందేశాన్ని మరోసారి చాటుతూ.. సత్యనారాయణ స్వామి సన్నిధి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచనుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Anupama Parameswaran | అతడో అపరిచితుడు - సెట్స్‌లో ఏడ్చిన రోజులు ఉన్నాయి - మాజీ ప్రియుడిపై అనుపమ ఆరోపణలు
- ●Tejas Express | మారిన తేజస్ ఎక్స్‌ప్రెస్ పేరు.. ఇకపై ఏమని పిలుస్తారంటే?
- ●Srinivas Rao | కేసీఆర్ బావమరిది శ్రీనివాస్‌రావు కన్నుమూత
- ●Government Teachers | డుమ్మా కొడితే ఉద్యోగం ఊడినట్టే.. ఉపాధ్యాయులకు సర్కార్ వార్నింగ్
- ●Kondagattu | కొండగట్టు అంజన్న హుండీలో డమ్మీ నోట్ల కట్టలు
- ●NTPC | ఎన్టీపీసీలో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల జీతం..

Anupama Parameswaran | అతడో అపరిచితుడు - సెట్స్‌లో ఏడ్చిన రోజులు ఉన్నాయి - మాజీ ప్రియుడిపై అనుపమ ఆరోపణలు

Tejas Express | మారిన తేజస్ ఎక్స్‌ప్రెస్ పేరు.. ఇకపై ఏమని పిలుస్తారంటే?

Srinivas Rao | కేసీఆర్ బావమరిది శ్రీనివాస్‌రావు కన్నుమూత

Government Teachers | డుమ్మా కొడితే ఉద్యోగం ఊడినట్టే.. ఉపాధ్యాయులకు సర్కార్ వార్నింగ్






