త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indians Shot Dead in Italy | ఇటలీలో దారుణం: గురుద్వారా బయట ఇద్దరు భారతీయుల కాల్చివేత.. పక్కా ప్లాన్ ప్రకారమే హత్య!

ఇటలీలోని బెర్గామో ప్రావిన్స్‌లో గల ఓ గురుద్వారా వెలుపల ఇద్దరు భారతీయులు దారుణ హత్యకు గురయ్యారు. వైశాఖి వేడుకల్లో పాల్గొని వస్తుండగా దుండగుడు వారిపై పది రౌండ్ల కాల్పులు జరిపి పరారయ్యాడు. పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

J

International | Published On Apr 19, 2026, 4.33 pm IST

Indians Shot Dead in Italy | ఇటలీలో దారుణం: గురుద్వారా బయట ఇద్దరు భారతీయుల కాల్చివేత.. పక్కా ప్లాన్ ప్రకారమే హత్య!
Advertisement

Indians Shot Dead in Italy | త్రినేత్ర.న్యూస్ : ఇటలీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బెర్గామో (Bergamo) ప్రావిన్స్‌లోని కోవో (Covo) పట్టణంలో గల ఓ గురుద్వారా బయట ఇద్దరు భారతీయులను గుర్తుతెలియని దుండగుడు తుపాకీతో కాల్చి చంపాడు. వైశాఖి (Vaisakhi) పండుగ వేడుకల కోసం వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

అసలేం జరిగిందంటే

స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఏప్రిల్ 17 (శుక్రవారం) అర్ధరాత్రికి కొద్ది నిమిషాల ముందు కోవో ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న 'గురుద్వారా మాతా సాహిబ్ కౌర్ జీ' ఎదురుగా ఉన్న స్క్వేర్‌లో ఈ కాల్పులు జరిగాయి. మృతులను కోవోలో నివాసం ఉంటున్న రాగిందర్ సింగ్ (48), ఆగ్నాడెల్లోకు చెందిన గుర్మిత్ సింగ్ (48) గా అధికారులు గుర్తించారు.

వీరిద్దరూ గురుద్వారాలో ప్రార్థనలు ముగించుకుని బయటకు రాగానే, దుండగుడు వారిని సమీపించి అత్యంత దగ్గరి నుంచి కాల్పులు జరిపాడు. అనంతరం కారులో అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనా స్థలంలో దాదాపు 10 బుల్లెట్ కేసింగ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కాల్పుల్లో మరో వ్యక్తికి కూడా స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది.

ఆకస్మిక గొడవ కాదు.. పక్కా ప్రణాళికే!

ఇది క్షణికావేశంలో జరిగిన గొడవ కాదని, ముందుగా వేసుకున్న "పక్కా ప్రణాళికతో చేసిన హత్య" (Coldly planned execution) అని ఇటాలియన్ పోలీసులు భావిస్తున్నారు. లా సిసిలియా (La Sicilia) పత్రిక కథనం ప్రకారం.. కాల్పులు జరిపిన వ్యక్తి కూడా భారత సంతతికి చెందినవాడేనని, అతను అదే గురుద్వారాకు తరచుగా వచ్చేవాడని ఓ ప్రత్యక్ష సాక్షి పోలీసులకు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ, నిందితుడి కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. హత్యకు గల కారణాలను విశ్లేషించే పనిలో పడ్డారు.

దిగ్భ్రాంతిలో భారతీయ కమ్యూనిటీ..

శనివారం నాడు స్థానిక సంస్థల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున వైశాఖి వేడుకలు జరగాల్సిన తరుణంలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకోవడం స్థానిక భారతీయ కమ్యూనిటీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై కోవో మేయర్ ఆండ్రియా కాపెల్లెట్టి స్పందిస్తూ.. "గత 15 ఏళ్లుగా ఇక్కడి సిక్కు కమ్యూనిటీ ఎలాంటి గొడవలకు తావులేకుండా మాతో కలిసిపోయి ఎంతో ప్రశాంతంగా జీవిస్తోంది. ఇలాంటి దారుణం జరగడం బాధాకరం" అని విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు దర్యాప్తు వేగవంతం చేశారు.

Advertisement
Advertisement