త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tarique Rahman | 17న బంగ్లా ప్ర‌ధానిగా తారిఖ్ రెహ్మాన్‌ ప్రమాణస్వీకారం.. మోదీకీ ఆహ్వానం!

G

International | Published On Feb 15, 2026, 7.48 am IST

Tarique Rahman | 17న బంగ్లా ప్ర‌ధానిగా తారిఖ్ రెహ్మాన్‌ ప్రమాణస్వీకారం.. మోదీకీ ఆహ్వానం!
Advertisement

Tarique Rahman | దాదాపు రెండేండ్ల అనిశ్చితి తర్వాత బంగ్లాదేశ్‌లో (Bangladesh) ప్రజాస్వామ్య ప్రభుత్వం కొలువుదీరబోతోంది. ఇటీవ‌ల జ‌రిగిన 13వ జాతీయ పార్లమెంట్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో ఆ పార్టీ చీఫ్ తారిఖ్ రెహ్మాన్‌ (Tarique Rahman) బంగ్లా ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌బోతున్నారు. ఈ నెల 17న (మంగ‌ళ‌వారం) ఆయ‌న ప్ర‌మాణ స్వీకారం చేస్తున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి భారత్‌తో సహా దక్షిణాసియా దేశాధినేతల్ని ఆహ్వానించారు. ఆహ్వానితుల్లో ప్రధాని మోదీ (PM Modi) ముఖ్య‌నేత‌గా ఉన్న‌ట్లు తెలుస్తున్న‌ది. యూనస్ పాలనతో భారత్ బంగ్లాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో పొరుగుదేశంతో స్నేహసంబంధాలను పున‌రుద్ధ‌రించుకోవాల‌ని చూస్తున్న ప్ర‌ధాని.. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. అదేకనుక జ‌రిగితే ఇరుదేశాల మ‌ధ్య దౌత్య‌ప‌రంగా కీల‌క ముంద‌డుగుగా నిపుణులు భావిస్తున్నారు.

కాగా, సాధారణంగా బంగ్లాదేశ్ అధ్యక్ష భవనం బంగభవన్‌లోని దర్బార్ హాలులో కొత్త ప్రధాని, మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేస్తారు. అయితే దానికి భిన్నంగా ఈసారి ప్రమాణస్వీకార కార్య‌క్ర‌మం జాతీయ సంసద్ భవన్‌లో ఉన్న‌ సౌత్ ప్లాజాలో జరుగుతున్న‌ది. విదేశాల నుంచి అతిథులు వస్తుండటంతో వేదిక‌ను మార్చిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఏయే దేశాధినేతలు వ‌స్తున్నార‌నే విష‌యంపై ఆదివారం స్ప‌ష్ట‌త రానుంద‌ని చెప్పారు.

మ‌రోవైపు ఎన్నిక‌ల్లో బీఎన్‌పీ విజ‌యం సాధించిన అనంత‌రం ప్ర‌ధాని మోదీ.. తారిఖ్‌తో నేరుగా ఫోన్‌లో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ విష‌యాన్ని ప్ర‌ధాని ఎక్స్ వేదిక‌గా పోస్టు చేశారు. అక్కడి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో తమ సహకారం ఉంటుందని రహ్మాన్‌కు తెలియచేసి, శుభాకాంక్షలు అందచేసినట్లు మోదీ పేర్కొన్నారు. ఈ ప‌రిణామాల వేళ‌.. గ‌త కొన్ని రోజులుగా దెబ్బ‌తిన్న బంగ్లా-భార‌త్ మ‌ధ్య సంబంధాలు మ‌ళ్లీ బ‌ల‌ప‌డే సూచ‌న‌లు క‌నిపిస్తున్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి.

బంగ్లా పీఠంపై డార్క్ ప్రిన్స్‌..

తారిఖ్ రెహ్మాన్‌.. బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు. సుమారు 17 ఏండ్ల‌పాటు లండన్ నుంచి పార్టీ వ్యవహారాలు పర్యవేక్షించారు. ఖ‌లీదా జియా అనారోగ్యంతో ఉండ‌టంతో.. అజ్ఞాతవాసాన్ని వీడిన ఆయ‌న‌ గ‌తేడాది డిసెంబ‌ర్‌లో ఢాకాలో అడుగుపెట్టారు. అదే నెల 30న ఆయ‌న త‌ల్లి ఖ‌లీదా జియా క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల‌ జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఈ బంగ్లా నేష‌న‌ల్ పార్టీ తిరుగులేని విజ‌యం సాధించింది. మొత్తం 299 స్థానాల‌కు ఎన్నిక‌ల జ‌రుగ‌గా 212 చోట్ల బీఎన్‌పీ (BNP) జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. మూడింట రెండువంతుల మెజారిటీని దక్కించుకుంది. దీంతో రెహ్మాన్ నేతృత్వంలో ప్ర‌భుత్వం ఏర్పాటు కానుంది. ఒక‌ప్పుడు తారిఖ్‌ను ప్ర‌తిప‌క్షాలు డార్క్ ప్రిన్స్‌గా విమ‌ర్శించేవారు.

Advertisement
Advertisement