త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tarique Rahman | 17 ఏళ్ల తర్వాత స్వదేశానికి తారిఖ్ రెహమాన్.. ఢాకాలో లక్షలాది మందితో భారీ ర్యాలీ

వచ్చే 2026 ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా, తారిఖ్ రెహమాన్ రాకతో బంగ్లాదేశ్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. 17 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన ఆయన, ప్రజల నమ్మకాన్ని ఎలా గెలుచుకుంటారా?

J

International | Published On Dec 25, 2025, 6.56 pm IST

Tarique Rahman | 17 ఏళ్ల తర్వాత స్వదేశానికి తారిఖ్ రెహమాన్.. ఢాకాలో లక్షలాది మందితో భారీ ర్యాలీ
Advertisement

Tarique Rahman | బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(BNP) తాత్కాలిక అధ్యక్షుడు తారిఖ్ రెహమాన్ 17 ఏళ్ల తర్వాత స్వదేశం బంగ్లాదేశ్‌కి చేరుకున్నారు. ఈయన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలేదా జియా కొడుకు. సుమారు రెండు దశాబ్దాల తర్వాత తన మాతృభూమికి తారిఖ్ తిరిగి రావడంతో ఆయన మద్దతుదారులు లక్షలాది మంది ఢాకాలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన భారీ బహిరంగ సభలో తారిఖ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ భవిష్యత్తు కోసం తన దగ్గర స్పష్టమైన ప్రణాళిక ఉందని ప్రకటించారు.

మార్టిన్ లూథర్ కింగ్ స్ఫూర్తితో..

అమెరికాకి చెందిన పౌరహక్కుల నేత మార్టిన్ లూథర్ కింగ్ ఫేమస్ స్పీచ్ అయిన ఐ హావ్ ఏ డ్రీమ్ ( నాకు ఒక కల ఉంది)ని గుర్తు చేస్తూ ఐ హావ్ ఏ ప్లాన్ ( నా దగ్గర ఒక ప్లాన్ ఉంది) అంటూ తారిఖ్ రెహమాన్ స్పష్టం చేశారు. బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య హక్కులను పునరుద్ధరించడమే తన లక్ష్యమని తెలిపారు. తన ప్లాన్ విజయం కావాలంటే ప్రజలంతా సమిష్టిగా వచ్చి మద్దతు ప్రకటించాలన్నారు.

అమరుల ఆశయాలకు అనుగుణంగా

బంగ్లాదేశ్ చరిత్రలోని 1971 నాటి విముక్తి పోరాటాన్ని, 2024 నాటి పరిస్థితుల్లో ప్రధానిగా ఉన్న షేక్ హసీనాపై ప్రజలు ఎలా తిరగబడ్డారో, ఎలా నిరసన తెలిపారో.. ఆ రాజకీయ మార్పులను గుర్తు చేస్తూ.. 1971, 2024 లో దేశ భవిష్యత్తు కోసం అమరులు అయిన వాళ్ల ఆశయాలకు అనుగుణంగా దేశాన్ని నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు.

Tarique Rahman Returns to Bangladesh After 17 Years

ఇది అందరి దేశం

ఇది అందరి దేశం. ముస్లింలు, హిందువులు, బౌద్ధులు, క్రిస్టియన్లు.. ఈ నేల అందరిదీ. సురక్షితమైన బంగ్లాదేశ్‌ని మనం నిర్మించాలి. ఈ దేశంలో ప్రతి మహిళ, పురుషుడు, పిల్లలు ఇంటి నుండి క్షేమంగా బయటికి వెళ్లి, తిరిగి సురక్షితంగా వచ్చేలా ఉండాలి అని పేర్కొన్నారు. దేశంలో శాంతి, క్రమశిక్షణను పునరుద్ధరించడమే తమ పార్టీ తక్షణ కర్తవ్యమన్నారు.

ఉస్మాన్ హాదీ మృతికి నివాళులు

ఇటీవల గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హతమైన యాంటీ-ఇండియా కార్యకర్త ఉస్మాన్ హాదీ మృతికి తారిఖ్ ఈసందర్భంగా నివాళులర్పించారు. హాదీ బంగ్లాదేశ్‌ని ప్రజాస్వామ్య దేశంగా ఉండాలని కలలు కన్నాడు. దేశ ప్రజలు తమ ఆర్థిక హక్కులను తిరిగి పొందాలని ఆశించారన్నారు.

బంగ్లాదేశ్ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందని.. వాళ్లు తీసుకునే నిర్ణయాలే దేశాన్ని నడిపిస్తాయని స్పష్టం చేశారు. అందుకే ఇది తమ బాధ్యతగా భావించి యువత ముందుకు రావాలన్నారు.

తల్లి క్షేమం కోసం ప్రార్థించండి

మరోవైపు రెహమాన్ తల్లి ఖలెదా జియా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తన ఆరోగ్యం బాగుపడాలని అందరూ ప్రార్థించాలని కోరారు.

మైనారిటీలపై పెరుగుతున్న దాడులు

బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై ఈమధ్య దాడులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మమ్మన్‌సింగ్‌లో దీపు చంద్ర దాస్ అనే హిందూ యువకుడిని గుంపుగా చేరి హత్య చేసిన ఘటన రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత దెబ్బతీసింది. ఈ ఘటనలపై స్పందించిన భారత్.. మైనారిటీల రక్షణ బాధ్యతను బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.

ఫిబ్రవరి 2026 లో ఎన్నికలు

వచ్చే 2026 ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా, తారిఖ్ రెహమాన్ రాకతో బంగ్లాదేశ్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. 17 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన ఆయన, ప్రజల నమ్మకాన్ని ఎలా గెలుచుకుంటారా? దేశంలోని ప్రస్తుత రాజకీయ అస్థిరతను ఎలా చక్కదిద్దుతారు? అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.


Advertisement

తాజావార్తలు

Advertisement