త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pete Hegseth | ఇరాన్‌తో యుద్ధాన్ని మేము మొదలుపెట్టలేదు, కానీ ముగిస్తాం : అమెరికా వార్నింగ్

అణ్వాయుధాల తయారీ కోసం ఇరాన్ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతోందని అమెరికా ఆరోపించింది. దౌత్యపరంగా సమస్యను పరిష్కరించుకునేందుకు ట్రంప్, సీనియర్ అధికారులు స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్ తీవ్రంగా ప్రయత్నించారని, కానీ ఇరాన్ ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేసిందని హెగ్‌సెత్ విమర్శించారు.

J

International | Published On Mar 2, 2026, 7.51 pm IST

Pete Hegseth | ఇరాన్‌తో యుద్ధాన్ని మేము మొదలుపెట్టలేదు, కానీ ముగిస్తాం : అమెరికా వార్నింగ్
Advertisement

Pete Hegseth | అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. పెంటగాన్‌లో జరిగిన మీడియా సమావేశంలో అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్‌సెత్ ఇరాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సంఘర్షణను అమెరికా ప్రారంభించలేదని, అయితే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో తాము దీనిని కచ్చితంగా ముగిస్తామని ఆయన స్పష్టం చేశారు. తమ సైనిక ఆపరేషన్ ఉద్దేశం ఇరాన్‌లో పాలనను మార్చడం కానప్పటికీ.. "అక్కడి పాలన ఇప్పటికే మారిపోయింది" అని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.

ఆపరేషన్ 'ఎపిక్ ఫ్యూరీ' లక్ష్యాలు ఇవే

ఇరాన్ తన సైనిక సామర్థ్యాన్ని పెంచుకోకుండా చేయడమే అమెరికా ప్రధాన లక్ష్యమని హెగ్‌సెత్ తెలిపారు. "ఇరాన్ క్షిపణులను, నౌకాదళాన్ని ధ్వంసం చేయడం, అలాగే ఆ దేశం అణ్వాయుధాలు సాధించకుండా అడ్డుకోవడమే మా మిషన్" అని ఆయన వివరించారు. ఈ ఆపరేషన్‌కు 'ఎపిక్ ఫ్యూరీ' అని నామకరణం చేశారు.

జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ డాన్ కైన్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 27న అధ్యక్షుడు ట్రంప్ ఈ ఆపరేషన్‌కు తుది ఆమోదం తెలిపారని, "వెనక్కి తగ్గేది లేదు" అనే స్పష్టమైన ఆదేశాలతో ఈ దాడి మొదలైందని వెల్లడించారు.

ఇది మరో ఇరాక్ కాదు.. ఇదొక అంతులేని యుద్ధం కాదు

గతంలో పశ్చిమాసియాలో అమెరికా చేసిన యుద్ధాలతో ప్రస్తుత ఆపరేషన్‌ను పోల్చవద్దని హెగ్‌సెత్ కోరారు. "ఇది ఇరాక్ కాదు.. ఇదొక అంతులేని యుద్ధం కాదు. దీనికి ఎంత ఖర్చవుతుందో అధ్యక్షుడు ట్రంప్‌కు బాగా తెలుసు" అని పేర్కొన్నారు. ఇరాన్ సైనిక, భద్రతా స్థావరాలపై అత్యంత కచ్చితత్వంతో దాడులు చేస్తున్నామని తెలిపారు. ఈ యుద్ధంలో ప్రాణనష్టం తప్పదని అంగీకరించిన ఆయన, ఇరాన్ తొలి దాడుల్లో గాయపడిన నలుగురు అమెరికా సైనికులు మరణించారని ధృవీకరించారు.

దౌత్యపరమైన అవకాశాలను ఇరాన్ వదులుకుంది

అణ్వాయుధాల తయారీ కోసం ఇరాన్ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతోందని అమెరికా ఆరోపించింది. దౌత్యపరంగా సమస్యను పరిష్కరించుకునేందుకు ట్రంప్, సీనియర్ అధికారులు స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్ తీవ్రంగా ప్రయత్నించారని, కానీ ఇరాన్ ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేసిందని హెగ్‌సెత్ విమర్శించారు. అణ్వాయుధ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని జూన్‌లో జరిగిన ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం సమయంలోనే హెచ్చరించినట్లు ఆయన గుర్తుచేశారు.

Advertisement
Advertisement