త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Meta | మెటా సంస్థ‌కు షాకిచ్చిన న్యూమెక్సికో జ్యూరీ.. భారీగా న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని ఆదేశం..

Meta | సోషల్ మీడియా దిగ్గజం మెటా చిన్నారుల‌ను ప్రమాదాలకు గురిచేసిందని న్యూమెక్సికో జ్యూరీ తీర్పు వెలువరించింది. తన ప్లాట్‌ఫామ్‌లలో పిల్లలను మోసగాళ్లు, సైబ‌ర్ నేర‌స్తుల‌ బారిన పడేలా చేసిందని జ్యూరీ తేల్చింది. ఆరు వారాల పాటు సాగిన విచారణ అనంతరం దాదాపు ఒక రోజు చర్చించిన తరువాత ఈ తీర్పు వెలువడింది.

S

International | Published On Mar 25, 2026, 3.12 pm IST

Meta | మెటా సంస్థ‌కు షాకిచ్చిన న్యూమెక్సికో జ్యూరీ.. భారీగా న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని ఆదేశం..
Advertisement

Meta | సోషల్ మీడియా దిగ్గజం మెటా చిన్నారుల‌ను ప్రమాదాలకు గురిచేసిందని న్యూమెక్సికో జ్యూరీ తీర్పు వెలువరించింది. తన ప్లాట్‌ఫామ్‌లలో పిల్లలను మోసగాళ్లు, సైబ‌ర్ నేర‌స్తుల‌ బారిన పడేలా చేసిందని జ్యూరీ తేల్చింది. ఆరు వారాల పాటు సాగిన విచారణ అనంతరం దాదాపు ఒక రోజు చర్చించిన తరువాత ఈ తీర్పు వెలువడింది. ఈ కేసులో మైనర్లను లైంగిక దాడులు, ఆన్‌లైన్ ప్రలోభాలు, మానవ అక్రమ రవాణా నుంచి రక్షించడంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల మాతృ సంస్థ మెటా విఫలమైందని రాష్ట్రం ఆరోపించింది.

375 మిలియ‌న్ డాల‌ర్ల‌ను చెల్లించండి..

ఈ కేసులో రాష్ట్రం గరిష్టంగా 2.2 బిలియన్ డాలర్ల నష్టపరిహారం కోరగా, జ్యూరీ మాత్రం 375 మిలియన్ డాలర్ల పరిహారాన్ని నిర్ణయించింది. శాంటా ఫే కోర్టులో ఈ కేసు విచారణ జ‌ర‌గ్గా, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, బాలల భద్రతకు సంబంధించిన అంశంపై జ్యూరీ తీర్పు వెలువడిన తొలి కేసులలో ఒకటిగా ఇది నిలిచింది. పిల్లల భద్రత క‌న్నా డ‌బ్బు సంపాదించేందుకే ప్రాధాన్య‌త‌ను ఇచ్చిన మెటా త‌న‌ నిర్ణయానికి మూల్యం చెల్లించాల్సిందేన‌ని, ప్రతి చిన్నారి కుటుంబానికి ఈ తీర్పు చారిత్రాత్మక విజయం అని న్యూమెక్సికో అటార్నీ జనరల్ రౌల్ టొర్రెజ్ తెలిపారు. మెటా అధికారులు తమ ఉత్పత్తులు పిల్లలకు హాని క‌లిగిస్తున్నాయని తెలిసినా, తమ సిబ్బంది హెచ్చరికలను పట్టించుకోకుండా ప్రజలను తప్పుదోవ‌ పట్టించేలా సమాచారం ఇచ్చారు.. అని ఆయన ఆరోపించారు.

తీర్పును స‌వాలు చేయ‌నున్న మెటా..

ఇక మెటా సంస్థ ఈ తీర్పును సవాలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ తీర్పుతో తాము ఏకీభవించబోమ‌ని, తాము అప్పీల్ చేస్తామ‌ని కంపెనీ ప్రతినిధి తెలిపారు. త‌మ‌ ప్లాట్‌ఫామ్‌లలో వినియోగదారుల భద్రత కోసం తాము కృషి చేస్తున్నామ‌ని, హానికర కంటెంట్ లేదా వ్యక్తులను గుర్తించి తొలగించడం లేదా బ్లాక్ చేయ‌డం సవాళ్లతో కూడుకున్నదని తాము స్పష్టంగా చెబుతున్నామ‌ని పేర్కొన్నారు. ఈ విచారణలో 40 మంది సాక్షులు వాంగ్మూలాలు ఇచ్చారు. వీరిలో కంపెనీ మాజీ ఉద్యోగులు, విజిల్ బ్లోవర్లు కూడా ఉన్నారు. వందలాది పత్రాలు, నివేదికలు, ఈ-మెయిల్స్‌ను జ్యూరీ పరిశీలించింది. 2023లో మెటాతోపాటు సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌పై అటార్నీ జనరల్ టొర్రెజ్ ఈ కేసును నమోదు చేశారు. పిల్లలను ఆన్‌లైన్ ప్రమాదాల నుంచి రక్షించడంలో విఫలమయ్యారని ఆరోపించారు.

పిల్ల‌ల భ‌ద్ర‌త‌పై త‌ప్పుదోవ ప‌ట్టించారు..

చివరిసారిగా వినిపించిన‌ వాదనల సందర్భంగా ప్రాసిక్యూషన్ న్యాయవాది లిండా సింగర్ మాట్లాడుతూ మెటా అల్గారిథమ్‌లు పెద్దలను టీనేజ్ వినియోగదారుల కంటెంట్ వైపు మళ్లించాయని, యువతకు పొంచి ఉన్న ప్రమాదాల గురించి సంస్థకు అంతర్గతంగా తెలిసినా దాన్ని దాచి పెట్టార‌ని, ప‌ట్టించుకోలేద‌ని జ్యూరీకి వివరించారు. పిల్లల భద్రతపై వినియోగదారులను తప్పుదోవ‌ పట్టించడం ద్వారా మెటా రాష్ట్రంలోని వ్యాపార పద్ధతుల చట్టాన్ని ఉల్లంఘించిందని జ్యూరీ తేల్చింది. ఈ కేసులో రెండో దశ విచారణ మే 4 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో మెటా పై అదనపు జరిమానాలు విధించడం, అలాగే ప్లాట్‌ఫామ్‌లలో మార్పులు చేయాలని రాష్ట్రం చేసిన అభ్యర్థనపై న్యాయమూర్తి విచారణ చేపట్టనున్నారు.

ఇత‌ర కేసుల‌పై ప్ర‌భావం చూపే అవ‌కాశం..

కాగా కాలిఫోర్నియాలో మెటా, యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌లు పిల్లలకు కలిగించే హానిపై బాధ్యత వ‌హించాలా, లేదా అనే అంశంపై మరో జ్యూరీ విచారణ కొనసాగిస్తోంది. ముఖ్యంగా ఈ ప్లాట్‌ఫామ్‌లు పిల్లలను అలవాటు పడేలా చేస్తున్నాయా అన్న దానిపై విచారణ జ‌రుపుతున్నారు. ఇక ఈ కేసును అమెరికా వ్యాప్తంగా సోషల్ మీడియా సంస్థలపై ఉన్న వేలాది కేసులపై ప్రభావం చూపే సూచనలు ఉన్న కీలక కేసుగా భావిస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement