త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mark Zuckerberg | ఇన్‌స్టాగ్రామ్‌పై ఆరోప‌ణ‌లు.. లాస్ ఏంజిల్స్ కోర్టుకు మెటా సీఈవో జుక‌ర్ బ‌ర్గ్‌..!

Mark Zuckerberg | మెటా సీఈవో మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ బుధ‌వారం లాస్ ఏంజిల్స్ కోర్టులో విచార‌ణకు హాజ‌రుకానున్నారు. మెటా ప్లాట్‌ఫార‌మ్ ఉద్దేశ‌పూర్వ‌కంగా పిల్ల‌ల‌ను దాని టెక్నాల‌జీకి బానిస‌లుగా మారుస్తోంద‌ని, ఫ‌లితంగా మాన‌సిక ఆరోగ్యానికి హాని క‌లిగిస్తుంద‌న్న ఆరోప‌ణ‌లున్నాయి.

P

International | Published On Feb 18, 2026, 5.20 pm IST

Mark Zuckerberg | ఇన్‌స్టాగ్రామ్‌పై ఆరోప‌ణ‌లు.. లాస్ ఏంజిల్స్ కోర్టుకు మెటా సీఈవో జుక‌ర్ బ‌ర్గ్‌..!
Advertisement

Mark Zuckerberg | మెటా సీఈవో మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ బుధ‌వారం లాస్ ఏంజిల్స్ కోర్టులో విచార‌ణకు హాజ‌రుకానున్నారు. మెటా ప్లాట్‌ఫార‌మ్ ఉద్దేశ‌పూర్వ‌కంగా పిల్ల‌ల‌ను దాని టెక్నాల‌జీకి బానిస‌లుగా మారుస్తోంద‌ని, ఫ‌లితంగా మాన‌సిక ఆరోగ్యానికి హాని క‌లిగిస్తుంద‌న్న ఆరోప‌ణ‌లున్నాయి. ఈ క్ర‌మంలో ఆయ‌న జ్యూరీ స‌మ‌క్షంలో సాక్ష్యం ఇవ్వ‌నున్నారు. ఈ కేసును న్యాయ వర్గాలు ‘బెల్‌వెదర్ ట్రయల్’గా అభివర్ణిస్తున్నాయి. అంటే, ఇక్కడ వచ్చే తీర్పు సోషల్ మీడియా సంస్థలపై పెండింగ్‌లో ఉన్న వేలాది కేసులపై ప్రభావం చూపే అవ‌కాశం ఉంది.

ప్రస్తుతం ఈ విచారణలో మెటా ప్లాట్‌ఫామ్‌తో పాటు యూట్యూబ్ సైతం ఇలాంటి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోంది. టిక్‌టాక్‌, స్నాప్ ఇంక్ ఇప్ప‌టికీ రాజీకి వ‌చ్చాయి. 20 ఏళ్ల యువతి ‘కేజీఎమ్’ పేరుతో ఫిర్యాదు చేసింది. చిన్న వయసులో సోషల్ మీడియా వినియోగంతో తనకు వ్యసనం పెరిగి, డిప్రెషన్ తీవ్రతరమై, ఆత్మహత్య ఆలోచనలు వచ్చాయని ఆరోపించింది. అయితే, ఆరోప‌ణ‌ల‌ను మెటా ఖండించింది. కుటుంబ పరిస్థితులే కారణమని, తమ ప్లాట్‌ఫారమ్ వల్ల మానసిక సమస్యలు తలెత్తలేదని స్ప‌ష్టం చేసింది. మెటా తరఫు న్యాయవాది పాల్ ష్మిట్, యువతికి మానసిక సమస్యలు ఉన్నప్పటికీ వాటికి ఇన్‌స్టాగ్రామ్‌ను బాధ్యుడిగా చూడలేమని పేర్కొన్నారు.

ఇటీవల ఆడ‌మ్ ముస్సోరి కోర్టులో హాజ‌రై సోషల్ మీడియా వైద్యపరమైన వ్యసనానికి కారణమవుతుందనే వాదనతో ఏకీభవించలేమని తెలిపారు. ఫిర్యాదుదారుల తరఫు న్యాయవాది మార్క్ లేనియర్, ఇన్‌స్టాగ్రామ్‌లోని ‘కాస్మెటిక్ ఫిల్టర్లు’ వంటి ఫీచర్లపై కఠిన ప్రశ్నలు సంధించారు. ఇదే అంశంపై జుకర్‌బర్గ్‌ను కూడా ప్రశ్నించే అవకాశముంది. అలాగే, ఇన్‌స్టాగ్రామ్ ఆల్గోరిథమ్, ‘ఇన్ఫినిట్ ఫీడ్’, వినియోగదారులను ఎక్కువసేపు ప్లాట్‌ఫారమ్‌లో ఉండేలా చేస్తున్న విధానానికి సంబంధించి ప్ర‌శ్న‌లు సంధించే అవ‌కాశం ఉంది. ఈ విచారణ ఫలితం సోషల్ మీడియా రంగంలో కీలక మార్పులకు దారి తీయొచ్చ‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

Advertisement
Advertisement