త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Iran Threatens Attacks on US and Israel Banks | ఇక మా నెక్స్ట్ టార్గెట్ యూఎస్ – ఇజ్రాయెల్ బ్యాంకులే : ఇరాన్ హెచ్చరిక

టెహ్రాన్‌లోని తమ బ్యాంకులపై జరిగిన దాడికి ప్రతీకారంగా పశ్చిమాసియాలోని అమెరికా, ఇజ్రాయెల్ ఆర్థిక కేంద్రాలు, బ్యాంకులపై దాడులు చేస్తామని ఇరాన్ సైన్యం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. గల్ఫ్ అంతటా దాడులు విస్తరిస్తుండటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

J

International | Published On Mar 11, 2026, 3.48 pm IST

Iran Threatens Attacks on US and Israel Banks | ఇక మా నెక్స్ట్ టార్గెట్ యూఎస్ – ఇజ్రాయెల్ బ్యాంకులే : ఇరాన్ హెచ్చరిక
Advertisement

అమెరికా, ఇజ్రాయెల్ బ్యాంకులే లక్ష్యంగా ఇరాన్ తీవ్ర హెచ్చరికలు
గల్ఫ్‌లో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం

Iran Threatens Attacks on US and Israel Banks | పశ్చిమాసియాలో (West Asia) ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. చమురు స్థావరాల తర్వాత, ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు చెందిన ఆర్థిక, బ్యాంకింగ్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తామని ఇరాన్ మిలటరీ కమాండ్ సంచలన ప్రకటన చేసింది. టెహ్రాన్‌లోని ఒక ఇరాన్ బ్యాంకింగ్ సెంటర్‌పై జరిగిన దాడికి ప్రతీకారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది.

Iran Threatens Attacks on US and Israel Banks | "శత్రువులే మాకు స్వేచ్ఛనిచ్చారు"

ఇరాన్ సైన్యానికి చెందిన 'ఖతమ్ అల్-అన్బియా ప్రధాన కార్యాలయం' (Khatam al-Anbiya Headquarters) ఈ దాడుల లక్ష్యాలను ప్రకటిస్తూ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. "అమెరికా, జియోనిస్ట్ (ఇజ్రాయెల్) పాలనకు చెందిన ఆర్థిక కేంద్రాలు, బ్యాంకులపై దాడులు చేసేందుకు శత్రువులే మాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు" అని కమాండ్ ప్రతినిధి పేర్కొన్నారు. పశ్చిమాసియా ప్రాంతంలోని ప్రజలు ఆయా బ్యాంకులకు కనీసం 1000 మీటర్ల దూరంలో ఉండాలని ఇరాన్ తీవ్రంగా హెచ్చరించింది.

నిన్న రాత్రి టెహ్రాన్‌లోని ఒక బ్యాంకుపై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు జరిపిన వైమానిక దాడుల్లో పలువురు బ్యాంక్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ మీడియా నివేదించింది. దీనికి బదులు తీర్చుకునేందుకే ఈ కొత్త దాడుల వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు తెలిపింది.

ఆర్థిక కేంద్రాల్లో ఆందోళన

ఇరాన్ తాజా హెచ్చరికలతో గల్ఫ్ దేశాలలోని ప్రాంతీయ ఆర్థిక కేంద్రాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ముఖ్యంగా అంతర్జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు నిలయంగా ఉన్న యూఏఈ (UAE) లోని దుబాయ్, అలాగే సౌదీ అరేబియా, బహ్రెయిన్‌లలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం నెలకొంది.

దుబాయ్ ఎయిర్‌పోర్ట్ లక్ష్యంగా ఇరాన్ దాడులు

పర్షియన్ గల్ఫ్ (Persian Gulf) అంతటా ఇరాన్ తన సైనిక చర్యలను విస్తృతం చేసింది. ప్రపంచంలోని అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఇరాన్ డ్రోన్లు దాడులు చేశాయి. ఈ ఘటనలో నలుగురు గాయపడినప్పటికీ, విమాన రాకపోకలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

అదేవిధంగా గల్ఫ్‌లో వాణిజ్య నౌకలను కూడా ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. ఒమన్ తీరంలోని హార్ముజ్ జలసంధిలో (Strait of Hormuz) ప్రయాణిస్తున్న ఒక కంటైనర్ షిప్‌పై దాడి చేయడంతో మంటలు చెలరేగాయి. దీంతో సిబ్బంది ప్రాణభయంతో నౌకను వదిలి వెళ్లాల్సి వచ్చిందని బ్రిటిష్ మిలటరీ తెలిపింది. యూఏఈకి సమీపంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.

అప్రమత్తమైన గల్ఫ్ దేశాలు

ఇరాన్ డ్రోన్లు, క్షిపణుల దాడులతో పలు గల్ఫ్ దేశాలు తమ గగనతల రక్షణ వ్యవస్థలను (Air Defences) అప్రమత్తం చేశాయి. తమ దేశంలోకి ప్రవేశించిన 8 ఇరాన్ డ్రోన్‌లను కూల్చివేసినట్లు కువైట్ ప్రకటించింది. మరోవైపు, షాయ్బా చమురు క్షేత్రం (Shaybah oil field) వైపు దూసుకొస్తున్న డ్రోన్లను, అలాగే ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకున్నట్లు సౌదీ అరేబియా తెలిపింది.

తాజా దాడుల కారణంగా హార్ముజ్ జలసంధి గుండా కార్గో ట్రాఫిక్ దాదాపుగా నిలిచిపోయింది. ప్రపంచ చమురు ఎగుమతుల్లో ఐదో వంతు ఇక్కడి నుంచే జరుగుతాయి. ఇరాన్ వరుస దాడులతో వాషింగ్టన్, ఇజ్రాయెల్‌లపై ప్రపంచ ఆర్థిక ఒత్తిడి పెంచి, వారి దాడులను ఆపేలా చేయడమే ఇరాన్ ప్రధాన లక్ష్యమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement
Advertisement