త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Prince Sultan Air Base attack | సౌదీ ఎయిర్‌బేస్‌పై ఇరాన్ భీకర దాడి.. అమెరికా ‘అవాక్స్’ (AWACS) విమానం ధ్వంసం

ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్ (Prince Sultan Air Base) లక్ష్యంగా ఇరాన్ దాడులకు పాల్పడింది. ఇక్కడ ధ్వంసమైన అవాక్స్ విమానంతో పాటు ఇతర అమెరికా సైనిక ఆస్తులు కూడా దెబ్బతిన్నట్లు సమాచారం.

J

International | Published On Mar 29, 2026, 7.43 pm IST

Prince Sultan Air Base attack | సౌదీ ఎయిర్‌బేస్‌పై ఇరాన్ భీకర దాడి.. అమెరికా ‘అవాక్స్’ (AWACS) విమానం ధ్వంసం

సంక్షిప్త సారాంశం

సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్‌పై ఇరాన్ సృష్టించిన విధ్వంసంలో అమెరికాకు చెందిన అత్యంత కీలకమైన E-3 AWACS కమాండ్ అండ్ కంట్రోల్ విమానం ధ్వంసమైంది. బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో చేసిన ఈ దాడిలో కనీసం 10 మంది అమెరికన్ సైనికులు గాయపడ్డారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై యుద్ధం ప్రకటించిన నాటి నుంచి మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి.

Advertisement

Prince Sultan Air Base attack | మధ్యప్రాచ్యంలో Middle East యుద్ధ మేఘాలు మరింత కమ్ముకుంటున్నాయి. సౌదీ అరేబియాలోని ఒక అమెరికన్ ఎయిర్‌బేస్‌పై ప్రతీకార దాడులకు దిగినట్లు ఇరాన్  ప్రకటించింది. ఈ క్షిపణి, డ్రోన్ల దాడిలో అమెరికాకు చెందిన అత్యంత కీలకమైన E-3 AWACS అవాక్స్ కమాండ్ అండ్ కంట్రోల్ విమానం భారీగా దెబ్బతిన్నట్లు తెలిపింది. ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్ (Prince Sultan Air Base) లక్ష్యంగా ఇరాన్ ఈ దాడులకు పాల్పడింది. ఇక్కడ ధ్వంసమైన అవాక్స్ విమానంతో పాటు ఇతర అమెరికా సైనిక ఆస్తులు కూడా దెబ్బతిన్నట్లు సమాచారం.

విమానం ఛిద్రం: ఇరాన్‌కు చెందిన ప్రెస్ టీవీ (Press TV) విడుదల చేసిన తాజా చిత్రాల్లో, అవాక్స్ విమానం మధ్యభాగం పూర్తిగా ఛిద్రమైపోగా.. కేవలం తల, తోక భాగాలు మాత్రమే మిగిలి ఉన్నట్లు కనిపిస్తోంది.

భారీ ఆయుధాల వినియోగం: ఈ దాడిలో 6 బాలిస్టిక్ క్షిపణులు, 29 డ్రోన్లను ఇరాన్ ప్రయోగించింది.

సైనికులకు గాయాలు: ఈ దాడిలో కనీసం 10 మంది యూఎస్ (US) సిబ్బంది గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అసోసియేటెడ్ ప్రెస్ (AP) నివేదించింది.

మరింత నష్టం: దాడిలో పలు రీఫ్యూయలింగ్ విమానాలు కూడా దెబ్బతిన్నాయని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. అయితే, యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఈ ఘటనపై ఇంకా అధికారికంగా స్పందించలేదు.

దీంతో పాటు ఒక యూఎస్ MQ-9 డ్రోన్‌ను కూల్చివేశామని, ఒక F-16 జెట్‌ను కూడా దెబ్బతీశామని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) లాంగ్-రేంజ్, మీడియం-రేంజ్ క్షిపణుల ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ ప్రయోజనాలే లక్ష్యంగా ఈ దాడులకు పాల్పడినట్లు ప్రెస్ టీవీ తెలిపింది.

రెండో నెలలోకి ప్రవేశించిన యుద్ధం

ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఎలాంటి కవ్వింపు లేకుండా యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి ఈ ఎయిర్‌బేస్‌పై పదేపదే దాడులు జరుగుతున్నాయి. ఈ యుద్ధంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ, భద్రతా విభాగాధిపతి అలీ లారీజానీ వంటి అగ్రశ్రేణి నాయకులను అమెరికా-ఇజ్రాయెల్ కూటమి హతమార్చింది. అయితే, ఈ కూటమి ప్రయోగించిన క్షిపణులు మినాబ్‌లోని ఒక బాలికల పాఠశాలపై పడటంతో సుమారు 180 మంది విద్యార్థినులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలతో రగిలిపోతున్న ఇరాన్.. గల్ఫ్ దేశాల్లోని యూఎస్ ఎయిర్‌బేస్‌లపై ప్రతీకార దాడులను ముమ్మరం చేసింది.

సౌదీ దాటి విస్తరిస్తున్న ఉద్రిక్తతలు

ఈ యుద్ధం ఇప్పుడు సౌదీ అరేబియా సరిహద్దులను దాటింది. యెమెన్‌లోని హౌతీ (Houthi) తిరుగుబాటుదారులు శనివారం ఇజ్రాయెల్‌పై క్షిపణులు ప్రయోగించినట్లు సమాచారం. ఇరాన్‌లోని విద్యాసంస్థలపై జరిగిన దాడులకు ప్రతిస్పందనగా.. ఇజ్రాయెల్, అమెరికా విశ్వవిద్యాలయాలపై ప్రతీకార దాడులు చేస్తామని టెహ్రాన్ హెచ్చరించింది.

మరోవైపు, పౌర మౌలిక సదుపాయాలపై దాడులు కూడా కొనసాగుతున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఆదివారం ఉదయం భారీ పేలుళ్లు సంభవించాయి. షాఫ్ట్ నగరం సమీపంలోని నివాస ప్రాంతంలో జరిగిన ఈ పేలుళ్లలో ఇద్దరు మరణించగా, ఐదుగురు గాయపడినట్లు మెహర్ న్యూస్ ఏజెన్సీ (Mehr News Agency) తెలిపింది. శనివారం జరిగిన దాడుల్లో బుషెహర్ ప్రావిన్స్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించగా, ఖుజెస్తాన్ ప్రావిన్స్‌లోని ఓ వాటర్ ఫెసిలిటీ ధ్వంసమైంది.

దీనికి దీటుగా ఇరాన్ సైన్యం కూడా ప్రతిదాడులకు దిగింది. హైఫాలోని మిలిటరీ ఏరోస్పేస్ కాంప్లెక్స్‌లో ఇజ్రాయెల్ డిఫెన్స్ కంపెనీ 'ఎల్టా' (Elta) నిర్వహిస్తున్న ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్, రాడార్ సెంటర్‌తో పాటు బెన్ గురియన్ విమానాశ్రయంలోని ఇంధన నిల్వ కేంద్రంపై తాము దాడులు చేసినట్లు ఇరాన్ ఆర్మీ ప్రకటించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement