త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

US Midterm Elections | అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారతీయుల సత్తా.. చ‌రిత్ర సృష్టించిన‌ పియా దాండియా

US Midterm Elections | అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో విడత పాలనకు కీలకమైన 2026 అమెరికా మధ్యంతర ఎన్నికల (US Midterm Elections) పోలింగ్ ముగిసింది. ఫ‌లితాలు కూడా ఒక్కొక్క‌టిగా వెలువ‌డుతున్నాయి. ఆ దేశ చ‌రిత్ర‌లోనే అత్యంత ఖరీదైన ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన అభ్యర్థులు సత్తా చాటుతున్నారు.

G

International | Published On Nov 4, 2026, 10.38 am IST

US Midterm Elections | అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారతీయుల సత్తా.. చ‌రిత్ర సృష్టించిన‌ పియా దాండియా
Advertisement

US Midterm Elections | త్రినేత్ర న్యూస్‌: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో విడత పాలనకు కీలకమైన 2026 అమెరికా మధ్యంతర ఎన్నికల (US Midterm Elections) పోలింగ్ ముగిసింది. ఫ‌లితాలు కూడా ఒక్కొక్క‌టిగా వెలువ‌డుతున్నాయి. ఆ దేశ చ‌రిత్ర‌లోనే అత్యంత ఖరీదైన ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన అభ్యర్థులు సత్తా చాటుతున్నారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఇండియ‌న్ ఆరిజ‌న్ సుహాస్ సుబ్రమణ్యం (Suhas Subramanyam) మరోసారి ప్రతినిధుల సభకు (హౌస్ ఆఫ్ రిప్ర‌జెంటేటివ్స్‌) ఎన్నికయ్యారు. వర్జీనియా రాష్ట్రంలోని 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి రిపబ్లికన్ అభ్యర్థి డేవ్ బెక్‌విత్‌పై ఆయ‌న‌ విజయం సాధించారు. సుహాస్‌కు 61.5 శాతానికిపైగా ఓట్లు రాగా, ప్రత్యర్థికి 36.4 శాతం ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. 2024లో తొలిసారి ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌కు ఎన్నికైన సుహాస్, తాజా విజయంతో తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.

భార‌త సంత‌తికే చెందిన పియా దాండియా (Pia Dandiya) ఫ్లోరిడా నుంచి గెలుపొందారు. ఫ్లోరిడాలోని 22వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి 51.9 శాతం ఓట్లు సాధించి రిపబ్లికన్ అభ్యర్థి కేసీ అస్కర్‌పై (49.1 శాతం) విజ‌యం సాధించారు. దీంతో ఫ్లోరిడా నుంచి అమెరికా దిగువ స‌భ‌కు ఎన్నికైన తొలి భారతీయ-అమెరికన్ మ‌హిళ‌గా చ‌రిత్ర సృష్టించారు. అరుణా మిళ్ల‌రు విజ‌యం సాధించ‌గా, రో ఖన్నా, ప్రమీలా జయపాల్, అమీ బేరా కూడా తిరిగి కాంగ్రెస్‌కు ఎన్నికయ్యేందుకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. ఇక రిప‌బ్లిక‌న్ పార్టీ త‌ర‌పున పోటీచేస్తున్న‌ వివేక్ రామ‌స్వామి (Vivek Ramaswamy) ఓడిపోయారు.


ఒమాబా ప్ర‌భుత్వంలో స‌ల‌హాదారుగా..

40 ఏండ్ల‌ సుహాస్ సుబ్రమణ్యం 1986, సెప్టెంబ‌ర్ 26న‌ టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో భార‌తీయ దంప‌తుల‌కు జన్మించారు. ఆయ‌న కుటుంబ మూలాలు బెంగ‌ళూరు, చెన్నై, సికింద్రాబాద్‌లో ఉన్నాయి. చిన్న‌నాటి నుంచి ప్రజా సమస్యలు, సామాజిక సేవపై ఆస‌క్తి పెంచుకున్నారు. న్యూఓర్లీన్స్‌లోని టులేన్ యూనివ‌ర్సిటీలో చ‌దువుకున్నారు. నార్త్‌వెస్ట‌ర్న్ వ‌ర్సిటీ నుంచి న్యాయ‌శాస్త్రంలో ప‌ట్టా (Law degree) పొందారు. వర్జీనియా జనరల్ అసెంబ్లీలో సభ్యుడిగా, ఆ తర్వాత వర్జీనియా స్టేట్ సెనేటర్‌గా సేవలందించారు.. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రభుత్వంలో టెక్నాలజీ పాలసీ సలహాదారుగా బాధ్యతలు నిర్వహించారు. 2024లో జరిగిన ఎన్నికల్లో వర్జీనియా 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి అమెరికా ప్రతినిధుల సభకు (US House of Representatives) ఎన్నికైన తొలి భారతీయ-అమెరికన్‌గా నిలిచారు.

పాఠ‌శాల‌ నుంచి ప్ర‌తినిధుల స‌భ‌కు..

పామ్ బీచ్ కౌంటీలో పుట్టి పెరిగిన‌ పియా దాండియా.. న్యూయార్క్‌లోని హార్లెమ్‌లో ఉపాధ్యాయురాలిగా కెరీర్ ప్రారంభించారు. అనంత‌రం హైస్కూల్ ప్రిన్సిపల్‌గా పనిచేశారు. 28 ఏండ్ల వ‌య‌స్సులోనే పాఠ‌శాల‌ను స్థాపించి, దానికి వ్య‌వ‌స్థాప‌క ప్రిన్సిప‌ల్‌గా బాధ్య‌తలు చేప‌ట్టారు. దీంతో దేశంలోనే అత్యంత పిన్న వ‌య‌స్కులైన ప్రిన్సిప‌ల్స్‌లో ఒక‌రిగా గుర్తింపు పొందారు. ఆ త‌ర్వాత వైట్‌హౌస్ ఫెలోగా సేవలందించడంతో పాటు యాపిల్ సంస్థలోనూ పనిచేశారు.

వివేక్ రామ‌స్వామికి ఎదురుదెబ్బ..

కేర‌ళ మూలాలు ఉన్న రిప‌బ్లిక‌న్ నేత వివేక్ రామ‌స్వామికి మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల్లో ఎదురుదెబ్బ త‌గిలింది. ఓహియో గ‌వ‌ర్న‌ర్ ఎన్నిక‌ల్లో పోటీచేస్తున్న ఆయ‌న.. డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థి అమీ ఆక్ట‌న్ చేతిలో ఓడిపోయారు.

ట్యాగ్స్:

Indian AmericansIndian OriginPia DandiyaSuhas SubramanyamUS Midterm ElectionsVivek Ramaswamy
Advertisement
Advertisement