త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bill Gates apology | ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రకంపనలు: రష్యన్ మహిళలతో ఎఫైర్స్ నిజమే.. సిబ్బందికి బిల్ గేట్స్ క్షమాపణలు!

వివాదాస్పద వ్యాపారవేత్త జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో సంబంధాల నేపథ్యంలో బిల్ గేట్స్ తన ఫౌండేషన్ సిబ్బందికి క్షమాపణలు చెప్పారు. గతంలో జరిగిన పొరపాట్లు తనను ఇప్పటికీ వెంటాడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

J

International | Published On Feb 25, 2026, 10.30 pm IST

Bill Gates apology | ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రకంపనలు: రష్యన్ మహిళలతో ఎఫైర్స్ నిజమే.. సిబ్బందికి బిల్ గేట్స్ క్షమాపణలు!
Advertisement

Bill Gates apology | త్రినేత్ర.న్యూస్ : ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మరోసారి వార్తల్లో నిలిచారు. అమెరికాలో సంచలనం సృష్టిస్తున్న 'ఎప్‌స్టీన్ ఫైల్స్' (Epstein Files) వ్యవహారంలో గేట్స్ పేరు ప్రముఖంగా వినిపిస్తుండటంతో, ఆయన తన 'బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్' సిబ్బందికి బహిరంగ క్షమాపణలు చెప్పారు. తాజాగా నిర్వహించిన ఒక అంతర్గత సమావేశంలో (Town Hall Meeting) ఆయన తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు సంచలన విషయాలను వెల్లడించారు.

రష్యన్ మహిళలతో ఎఫైర్స్ నిజమే!

ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో పేర్కొన్న విధంగా ఇద్దరు రష్యన్ మహిళలతో తనకు వివాహేతర సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని బిల్ గేట్స్ అంగీకరించారు. అయితే, ఆ మహిళలకు జెఫ్రీ ఎప్‌స్టీన్ బాధితులకు ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం వ్యక్తిగత కారణాలతోనే ఆ సంబంధాలు ఉన్నాయని, ఎప్‌స్టీన్ నేరపూరిత కార్యకలాపాలతో వీరికి ఎటువంటి లింకు లేదని గేట్స్ క్లారిటీ ఇచ్చారు.

ఎప్‌స్టీన్‌తో స్నేహం.. ఒక భారీ తప్పు!

లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో పరిచయం పెంచుకోవడం తన జీవితంలో చేసిన 'పెద్ద తప్పు' అని గేట్స్ పేర్కొన్నారు. "ఎప్‌స్టీన్‌తో సమయం గడపడం, ఫౌండేషన్ అధికారులను ఆయనతో సమావేశాలకు తీసుకువెళ్లడం నేను చేసిన పొరపాటు. నా వల్ల ఇబ్బంది పడ్డ వారందరికీ నేను క్షమాపణలు చెబుతున్నాను" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అక్రమాలకు పాల్పడలేదు..

ఎప్‌స్టీన్ చుట్టూ ఉన్న మహిళలతో తాను ఎప్పుడూ సమయం గడపలేదని గేట్స్ ఉద్యోగులకు వివరించారు. "నేను ఎటువంటి చట్టవిరుద్ధమైన పనులు చేయలేదు, అక్కడ ఏ అక్రమాలు జరగడం కూడా నేను చూడలేదు" అని తనపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. ఎప్‌స్టీన్ ద్వారా ఫౌండేషన్‌కు ఎటువంటి నిధులు అందలేదని, ఆయనను ఉద్యోగంలో కూడా నియమించుకోలేదని సంస్థ ప్రతినిధులు ఇప్పటికే స్పష్టం చేశారు.

ఇండియా 'AI సమ్మిట్' రద్దు

ఈ వివాదం నేపథ్యంలోనే బిల్ గేట్స్ ఇటీవల భారత్‌లో జరిగిన ప్రతిష్టాత్మక 'ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026' నుంచి తప్పుకున్నారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్ వంటి దిగ్గజాలతో కలిసి ఆయన ప్రసంగించాల్సి ఉంది. అయితే, సమ్మిట్ ప్రధాన అజెండా పక్కదారి పట్టకూడదనే ఉద్దేశంతోనే పర్యటనను రద్దు చేసుకున్నట్లు ఫౌండేషన్ వర్గాలు తెలిపాయి.

యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసిన ఫోటోలు, రికార్డులు గేట్స్ ప్రతిష్టను దెబ్బతీశాయి. ఈ క్రమంలోనే ఆయన స్వయంగా స్పందించి తన తప్పులను ఒప్పుకోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Advertisement
Advertisement