త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Donald Trump | 48 మంది ఇరానీ నాయ‌కులు హ‌తం.. 9 నౌక‌ల‌ను ధ్వంసం చేశాం.. ట్రంప్‌..

Donald Trump | అమెరికా సైన్యం ఇరాన్‌కు చెందిన 9 నౌకాదళ నౌకలను ముంచేసిందని, అలాగే ఇరాన్ నేవీ ప్రధాన కార్యాలయాన్ని భారీగా ధ్వంసం చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేర‌కు ట్రూత్ సోష‌ల్‌లో పోస్టు పెట్టారు. ఇరాన్‌కు చెందిన తొమ్మిది నౌకలను మేము ధ్వంసం చేసి ముంచేశాం.

S

International | Published On Mar 2, 2026, 7.14 am IST

Donald Trump | 48 మంది ఇరానీ నాయ‌కులు హ‌తం.. 9 నౌక‌ల‌ను ధ్వంసం చేశాం.. ట్రంప్‌..
Advertisement

Donald Trump | అమెరికా సైన్యం ఇరాన్‌కు చెందిన 9 నౌకాదళ నౌకలను ముంచేసిందని, అలాగే ఇరాన్ నేవీ ప్రధాన కార్యాలయాన్ని భారీగా ధ్వంసం చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేర‌కు ట్రూత్ సోష‌ల్‌లో పోస్టు పెట్టారు. ఇరాన్‌కు చెందిన తొమ్మిది నౌకలను మేము ధ్వంసం చేసి ముంచేశాం. వాటిలో కొన్ని పెద్దవి, కీలకమైనవే. మిగతావాటినీ లక్ష్యంగా చేసుకుంటున్నాం. అవి కూడా త్వరలోనే సముద్ర అడుగుకు చేరతాయి. మరో దాడిలో వారి నౌకాదళ ప్రధాన కార్యాలయాన్ని భారీగా ధ్వంసం చేశాం. అంతకుమించి వారి నేవీ బాగానే ఉంది.. అని అన్నారు.

48 మంది ఇరానీ నాయ‌కులు హ‌తం: ట్రంప్‌

సైనిక నష్టాలతో పాటు, అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో కనీసం 48 మంది ఇరానీ నాయకులు హతమయ్యారని ట్రంప్ తెలిపారు. ఈ ఆపరేషన్ అత్యంత సానుకూలంగా సాగుతోందని ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. శనివారం ప్రారంభమైన ఈ యుద్ధం లక్ష్యం ఇస్లామిక్ రిపబ్లిక్ నాయకత్వాన్ని తొలగించడం, దాని సైనిక శక్తిని నిర్వీర్యం చేయడమేనని ఆయన అన్నారు. కాగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖ‌మేనీ మరణాన్ని ఇరాన్ అధికారికంగా ధ్రువీకరించిన విష‌యం తెలిసిందే. సీఎన్‌బీసీకి ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. మనం కేవలం మనకోసమే కాదు, ప్రపంచం కోసం కూడా పని చేస్తున్నాం. అన్నీ షెడ్యూల్ కంటే ముందుగానే జరుగుతున్నాయి. పరిస్థితులు అత్యంత సానుకూల దిశలో వెళ్తున్నాయి.. అని పేర్కొన్నారు.

ముగ్గురు అమెరిక‌న్ సైనికులు మృతి..

అయితే ట్రంప్‌ ప్రకటనల అనంతరం అమెరికా సెంట్రల్ కమాండ్ తొలిసారిగా తమ వైపు కూడా నష్టాలు జరిగినట్టు ప్రకటించింది. ముగ్గురు సైనికులు మరణించగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరికి స్వల్ప గాయాలు అయ్యాయని తెలిపింది. గల్ఫ్ ఆఫ్ ఒమాన్‌లో డాక్ వద్ద నిలిచిన ఇరాన్ యుద్ధ నౌకను ముంచేశామని కూడా వెల్లడించింది. ఇరాన్ రెండో రోజూ దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిలో మూడు నౌకలు దాడికి గురైనట్టు సముద్ర భద్రతా సంస్థలు తెలిపాయి.

నౌక‌ల‌పై క్షిప‌ణి దాడులు..

బ్రిటిష్ సముద్ర భద్రతా సంస్థ UKMTO ప్రకారం.. ఒమాన్ తీరానికి సమీపంలో ఒక నౌక నీటి మట్టానికి పైభాగంలో తెలియని క్షిపణి తాకింది. ఇంజిన్ గది అగ్నికి ఆహుతైనప్పటికీ మంటలు అదుపులోకి వచ్చాయి. మరో నౌకపై కూడా క్షిపణి దాడి జరిగి మంటలు చెలరేగాయి. మంటలు ఆర్పివేసి ప్రయాణం కొనసాగించనుంది. యూఏఈ నగరం షార్జా పశ్చిమాన 35 నాటికల్ మైళ్ల దూరంలో మరో క్షిపణి నౌకకు సమీపంలో పేలిందని తెలిపింది. సిబ్బంది సురక్షితంగా ఉన్నారని వెల్లడించింది. వాంగార్డ్ టెక్ అనే ప్రైవేట్ సముద్ర భద్రతా సంస్థ ప్రకారం రెండో నౌక యూఏఈలోని మీనా సక‌ర్‌కు వాయవ్య దిశగా 17 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న ట్యాంకర్ అని తెలిపింది. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ప్రకారం హోర్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న ఒక ఆయిల్ ట్యాంకర్ దాడి అనంతరం మునిగిపోతోందని తెలిపింది.

కాగా గల్ఫ్ ప్రాంతంపై ఇరాన్‌ కొనసాగిస్తున్న భారీ స్థాయి బాంబుదాడులు మధ్యప్రాచ్యంలో విస్తృత యుద్ధానికి దారి తీసే ప్రమాదంపై ఆందోళనలను మ‌రింత‌ పెంచాయి. యూఏఈ రాజధాని అబుదాబిలోని విదేశీ రాయబార కార్యాలయాలు ఉన్న భవన సముదాయాన్ని కూడా ఇరాన్ లక్ష్యంగా చేసుకుందని సమాచారం. ఇందులో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం కూడా ఉందని తెలుస్తోంది. ప్రాంతీయ శాంతి, చమురు సరఫరాలు, అంతర్జాతీయ భద్రతపై ఈ పరిణామాలు తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement
Advertisement