త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Benjamin Netanyahu | ఐక్య‌రాజ్య‌స‌మితిలో నెత‌న్యాహు ప్ర‌సంగం.. 90 శాతం సీట్లు ఖాళీ

Benjamin Netanyahu | ఐక్య‌రాజ్య‌స‌మితి (UN) సాధార‌ణ స‌భ‌లో ఇజ్రాయెల్ (Israel) ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకి (Benjamin Netanyahu) ఘోర అవ‌మానం ఎదురైంది. ఐరాస‌లో ప్ర‌సంగించేందుకు ఆయ‌న వేదిక‌పైకి రాగానే పలు దేశాల ప్రతినిధులు నిరసనగా (Protest) తమ సీట్ల నుంచి లేచి బయటకు వెళ్లిపోయారు.

G

International | Published On Sep 25, 2026, 9.19 am IST

Benjamin Netanyahu | ఐక్య‌రాజ్య‌స‌మితిలో నెత‌న్యాహు ప్ర‌సంగం.. 90 శాతం సీట్లు ఖాళీ
Advertisement

Benjamin Netanyahu | త్రినేత్ర న్యూస్‌: ఐక్య‌రాజ్య‌స‌మితి (UN) సాధార‌ణ స‌భ‌లో ఇజ్రాయెల్ (Israel) ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకి (Benjamin Netanyahu) ఘోర అవ‌మానం ఎదురైంది. ఐరాస‌లో ప్ర‌సంగించేందుకు ఆయ‌న వేదిక‌పైకి రాగానే పలు దేశాల ప్రతినిధులు నిరసనగా (Protest) తమ సీట్ల నుంచి లేచి బయటకు వెళ్లిపోయారు. అసెంబ్లీ హాలులో (General Assembly) దాదాపు 90 శాతం సీట్లు ఖాళీగా ద‌ర్శ‌న‌మిచ్చాయి. దీంతో ఆయ‌న తీవ్ర‌స్థాయిలో అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. బయటకు వెళ్లిన వారిని నైతికత లేనివారుగా, వారు పిరికిపందలుగా అభివర్ణించారు. తాను ప్రసంగం ప్రారంభించడానికి ముందు ఒక చిన్న ప్రకటన అంటూ.. ఈ హాల్లో ఇంకా నైతికత లేని పిరికివాళ్లు ఉంటే, దయచేసి ఇప్పుడే బయటకు వెళ్లండి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇంతకంటే దిగ్భ్రాంతికరమైన ద్వంద్వ ప్రమాణాలు మరొకటి ఉండవని మండిపడ్డారు.

అనంత‌రం మాట్ల‌డుతూ.. ప్రపంచంలోని యూదు వ్యతిరేకులు త‌మ‌ ప్రజలను భయపెట్టాలని చూస్తున్నార‌ని, కానీ.. ఆ రోజులు ఎప్పుడో పోయాయ‌న్నారు. ఒకప్పుడు యూదులు నిస్సహాయ బాధితులుగా ఊచకోతకు గురయ్యారని చెప్పారు. నేడు ఆ పరిస్థితి లేదని వెల్ల‌డించారు. త‌మ‌కంటూ ప్రత్యేక దేశం, శక్తివంతమైన సైన్యం ఉన్నాయ‌ని, త‌మ‌ రక్షణ కోసం తాము సిద్ధంగా ఉన్నామ‌ని చెప్పారు.

చేతిలో పేజర్‌తో..

మ‌రోవైపు తన చేతిలో ఓ పేజర్‌ను పైకి చూపిస్తూ.. ‘మేం హెజ్‌బొల్లాను తీవ్రంగా దెబ్బతీశాం. ఆ బీపర్ల (పేజర్లు) విషయం మీకు గుర్తుంది కదా? ఆ పరికరాల గురించి గుర్తుంచుకోండి’ అని హెచ్చరించారు. హెజ్‌బొల్లా (Hezbollah) నాయకులు మరణించారని, ఇజ్రాయెల్ పౌరులనే లక్ష్యంగా చేసుకున్న 1,50,000 బాలిస్టిక్ క్షిపణులు, రాకెట్ల భారీ ఆయుధ సంపత్తి అంతా తుడిచిపెట్టుకుపోయిందన్నారు. గతంలో లెబనాన్‌లో (Lebanon) హెజ్‌బొల్లా దళాలపై తాము నిర్వహించిన సంచలన పేజర్ ఆపరేషన్‌ను గుర్తుచేస్తూ ఆయన ఈ వ్యాఖ్య‌లు చేశారు.

తన ప్రసంగం ఆద్యంతం ఇరాన్‌ను (Iran) లక్ష్యంగా చేసుకున్న‌ నెతన్యాహు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై (Donald Trump) ప్రశంసల వర్షం కురిపించారు. `ఈ అరాచక శక్తులతో పోరులో మాకు ట్రంప్ కంటే గొప్ప భాగస్వామి మరొకరు లేరు. ప్రపంచానికి ముప్పుగా పరిణమించిన ప్రమాదాన్ని ట్రంప్ ధైర్యంగా ఎదుర్కొన్నారు. నాగరికతను రక్షించడానికి మేమిద్దరం కలిసికట్టుగా పోరాడాం` అని చెప్పారు. ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. ఇరాన్ అణు కేంద్రాలపై తాము జరిపిన సైనిక చర్యలను సమర్థించుకున్నారు.

కాగా, ఇరాన్ ప్రతినిధులు తమ ఖాళీ కుర్చీలలో ఒక నిరసన సందేశాన్ని ఉంచారు. ఇరాన్ ప్రముఖ నేత, ఖుద్స్ దళాల మాజీ కమాండర్ ఖాస్సెమ్ సులేమానీ చిత్రాన్ని అక్కడే వదిలి వెళారు. (2020 జనవరిలో అమెరికా డ్రోన్ దాడిలో సులేమానీ మరణించిన విషయం తెలిసిందే).

Advertisement
Advertisement