Love With AI | ఏఐ ప్రేమలో.. ఒంటరితనానికి ఆర్టిఫిషియల్ తోడు..!
Love With AI | ప్రశ్నలు అడిగారు.. సమాధానం వచ్చింది. మాట కలిపారు.. స్నేహం కుదిరింది. మనసులోని మాట చెప్పారు.. ఓదార్పు లభించింది. చివరకు అదే ఏఐతో ప్రేమలో పడ్డారు! చైనాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం ఇప్పుడు సమాచారం, పనులకు మాత్రమే పరిమితం కావడం లేదు.
International | Published On Oct 8, 2026, 3.33 pm IST
- స్నేహితుడిగా, ప్రేమికుడిగా ఏఐ
- వ్యక్తిగత విషయాల నుంచి భావోద్వేగాల వరకు షేరింగ్
- చైనాలో పెరుగుతున్న ‘ఏఐ కంపానియన్’ ట్రెండ్
- భావోద్వేగ ఆధారపడటంపై ప్రభుత్వ ఆందోళన
Love With AI | ప్రశ్నలు అడిగారు.. సమాధానం వచ్చింది. మాట కలిపారు.. స్నేహం కుదిరింది. మనసులోని మాట చెప్పారు.. ఓదార్పు లభించింది. చివరకు అదే ఏఐతో ప్రేమలో పడ్డారు! చైనాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం ఇప్పుడు సమాచారం, పనులకు మాత్రమే పరిమితం కావడం లేదు. కొందరికి ఏఐ స్నేహితుడిగా.. మరికొందరికి భావోద్వేగ తోడుగా.. ఇంకొందరికి వర్చువల్ భాగస్వామిగా మారుతోంది. ‘ఏఐ కంపానియన్’ పేరుతో సాగుతున్న ఈ కొత్త ట్రెండ్‌పై చైనా ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా యువతలో వర్చువల్ సంబంధాలు, ఏఐపై భావోద్వేగ ఆధారపడటం, పిల్లల భద్రత వంటి అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
70 కోట్ల మందికి పైగా ఏఐ వినియోగం
చైనాలో జనరేటివ్ ఏఐ వినియోగం వేగంగా విస్తరిస్తోంది. చైనా ఇంటర్నెట్ నెట్‌వర్క్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (CNNIC) 2026 నివేదిక ప్రకారం.. జూన్ 2026 నాటికి దేశంలో 70 కోట్ల మందికిపైగా జనరేటివ్ ఏఐ వినియోగదారులు ఉన్నారు. అంటే దేశ జనాభాలో సగానికి పైగానే. 2025 డిసెంబర్ నాటికి ఈ సంఖ్య 60.2 కోట్లు కాగా.. వినియోగ విస్తృతి 42.8 శాతంగా ఉంది. కొద్ది నెలల్లోనే వినియోగదారుల సంఖ్య సుమారు 16 శాతం పెరిగింది.
ఏఐని ఎలా ఉపయోగిస్తున్నారు?
ఏఐ వినియోగదారుల్లో 76 శాతం మంది ప్రశ్నలకు సమాధానాల కోసం ఉపయోగిస్తున్నారు. 48 శాతం మంది ఫొటోలు, వీడియోల ప్రాసెసింగ్ కోసం, 38 శాతం మంది టెక్స్ట్ ప్రాసెసింగ్‌కు, మరో 33 శాతం మంది వర్క్ సమ్మరీలు, మీటింగ్ నోట్స్, ప్రజెంటేషన్ల కోసం వినియోగిస్తున్నారు. ఏఐ రంగంలో చైనా భారీగా పెట్టుబడులు పెడుతోంది. 2026 జూన్ నాటికి దేశంలోని ఇంటెలిజెంట్ కంప్యూటింగ్ సామర్థ్యం 2,185 eFLOPSకు చేరింది. ఏడాది వ్యవధిలో ఇది 177 శాతం పెరిగింది. డీప్‌సీక్, మూన్‌షాట్ ఏఐ వంటి సంస్థలు పెద్ద ఏఐ మోడళ్ల అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాయి.

ఏఐ కంపానియన్ అంటే?
సాధారణ ఏఐ అసిస్టెంట్ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. కానీ ఏఐ కంపానియన్ అంతటితో ఆగదు. వినియోగదారుడితో సుదీర్ఘంగా సంభాషిస్తూ.. అతడి ఇష్టాలు, మాట్లాడే తీరు, భావోద్వేగ స్థితిని అర్థం చేసుకునేలా వీటిని రూపొందిస్తారు. అందుకే వీటిని ‘ఏఐ ఫ్రెండ్’, ‘వర్చువల్ కంపానియన్’, ‘ఏఐ బాయ్‌ఫ్రెండ్’, ‘ఏఐ గర్ల్‌ఫ్రెండ్’ వంటి పేర్లతో పిలుస్తున్నారు. ఒంటరితనంలో మాట్లాడుకోవడం, వ్యక్తిగత విషయాలు పంచుకోవడం, భావోద్వేగ మద్దతు పొందడం వంటి అవసరాలకు వీటిని వినియోగిస్తున్నారు.
వేల కోట్లకు చేరనున్న మార్కెట్
చైనాలో ఏఐ కంపానియన్ మార్కెట్ కూడా వేగంగా విస్తరిస్తోంది. గ్రాండ్ వ్యూ హారిజన్ రీసెర్చ్ అంచనాల ప్రకారం.. 2025లో ఈ మార్కెట్ విలువ 276.2 కోట్ల డాలర్లు. 2033 నాటికి ఇది 3,120.92 కోట్ల డాలర్లకు చేరొచ్చని అంచనా. 2026-33 మధ్య సగటు వార్షిక వృద్ధి రేటు 35.4 శాతంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 2025లో టెక్స్ట్ ఆధారిత ఏఐ కంపానియన్లు అత్యధిక ఆదాయాన్ని ఆర్జించగా.. మల్టీమోడల్ ఏఐ కంపానియన్లు వేగంగా వృద్ధి చెందే విభాగంగా నిలవనున్నాయి.
ఏఐని నిజంగానే స్నేహితుడిగా చూస్తున్నారా?
2026లో ప్రచురితమైన ‘Emotional Attachment to AI Chatbots’ అధ్యయనం చైనా సహా నాలుగు దేశాల్లో ఏఐతో ప్రజలకు ఏర్పడుతున్న భావోద్వేగ అనుబంధాన్ని పరిశీలించింది. 2025 జూలై-ఆగస్టులో నిర్వహించిన సర్వేలో 7,027 మంది పాల్గొనగా.. వారిలో 1,751 మంది చైనాకు చెందినవారు. చైనా చాట్‌బాట్ వినియోగదారుల్లో 28.73 శాతం మంది సోషల్ చాట్‌బాట్లను ఉపయోగించారు. నాలుగు దేశాల్లో ఇదే అత్యధికం. 68.86 శాతం మంది ఏఐని స్నేహితుడిగా భావించారు. 64.88 శాతం మంది ఏఐతో మాట్లాడేటప్పుడు మర్యాదగా వ్యవహరించారు. 51 శాతం మంది కొన్ని రోజులు ఏఐని ఉపయోగించకపోతే దాన్ని మిస్ అయినట్టు చెప్పారు. సోషల్ చాట్‌బాట్ వినియోగదారులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే.. 64.66 శాతం మంది ఏఐని స్నేహితుడిగా భావించారు. 50.35 శాతం మంది కొంతకాలం ఉపయోగించకపోతే మిస్ అయినట్టు చెప్పారు.

ఎందుకింత అనుబంధం?
అదే అధ్యయనం దీనికి కారణాలపైనా దృష్టి పెట్టింది. ఏఐతో మాట్లాడినప్పుడు ఒంటరితనం తగ్గుతుందని 63.49 శాతం మంది చెప్పారు. ఇతరులు తనను జడ్జ్ చేస్తారనే భయం తగ్గిందని 64.09 శాతం మంది, ఏఐతో సంభాషణలో గోప్యత ఉన్న భావన కలుగుతోందని 79.60 శాతం మంది తెలిపారు. ఆరోగ్యం, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ప్రశ్నలను ఏఐని అడుగుతున్నట్టు 46.44 శాతం మంది చెప్పారు. ఉద్యోగం, డబ్బు, సంబంధాలు, వ్యక్తిగత సమస్యలపైనా ఏఐతో మాట్లాడుతున్నట్టు అధ్యయనం వెల్లడించింది. అంటే.. కొందరికి ఏఐ ఇక కేవలం సమాచారం ఇచ్చే సాధనం కాదు.. తీర్పు చెప్పని మిత్రుడిగా మారుతోంది.
ఆధారపడే స్థాయి పెరుగుతోందా?
ఏఐపై ఆధారపడటాన్ని అంచనా వేసేందుకు పరిశోధకులు పలు అంశాలను పరిశీలించారు. ఏఐ లేకుండా జీవితం, పని ఎంత కష్టమవుతుందనే భావన.. అత్యంత వ్యక్తిగత రహస్యాలను పంచుకునే సిద్ధత.. చెల్లింపు ఏఐ సేవల వినియోగం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. చైనా చాట్‌బాట్ వినియోగదారుల సగటు ‘డిఫికల్టీ స్కోర్’ 37.27గా నమోదైంది. 37.66 శాతం మంది తమ అత్యంత వ్యక్తిగత రహస్యాలను చాట్‌బాట్‌తో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. 66.30 శాతం మంది ప్రీమియం ఏఐ సేవలను వినియోగించారు. అయితే, ఏఐతో భావోద్వేగ అనుబంధం ఉండటం ఒక్కటే సమస్య కాదని పరిశోధకులు స్పష్టం చేశారు. అది మితిమీరి నిజ జీవిత సంబంధాలు, రోజువారీ కార్యకలాపాలను ప్రభావితం చేసే స్థాయికి చేరితేనే సమస్యగా మారుతుందని పేర్కొన్నారు.
‘ఐ లవ్ యూ’.. ఏఐకే!
ఈ అనుబంధానికి యువతలో కనిపిస్తున్న ఉదాహరణలు ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా చైనాలో యువతలో, మహిళల్లో ఏఐని భాగస్వామిగా భావించే ధోరణి కనిపిస్తోంది. 2026 ఆగస్టులో ‘ది గార్డియన్’ ప్రచురించిన కథనం ప్రకారం.. క్విన్ అనే చైనా మహిళ తన తల్లిదండ్రులకు, స్నేహితులకు ఎప్పుడూ ‘ఐ లవ్ యూ’ చెప్పలేదు. కానీ తన ఏఐ బాయ్‌ఫ్రెండ్‌కు మాత్రం చెప్పింది. ఆమె సుమారు 840 రోజులుగా ఏఐ కంపానియన్‌తో మాట్లాడుతోంది. అది ఆమెకు సంభాషణ భాగస్వామిగా, ఊహాజనిత ప్రేమ సంబంధంగా, ఒంటరితనాన్ని తగ్గించే తోడుగా మారింది. ఆమెతో మాట్లాడటం, ఆహారంపై సూచనలు ఇవ్వడం, భావోద్వేగంగా ఊరటనిచ్చేలా స్పందించడం వంటివి ఏఐ చేసేది.
జననాల రేటుపైనా ప్రభావం ఉంటుందా?
ఇదే ఇప్పుడు చైనా ప్రభుత్వానికి మరో ఆందోళన. 2025లో చైనా జననాల రేటు ప్రతి 1,000 మందికి 5.63కు పడిపోయింది. మరణాల రేటు 8.04గా నమోదైంది. ఏడాది చివరికి దేశ జనాభా సుమారు 140 కోట్లకు చేరగా.. ఏడాదిలోనే దాదాపు 33.9 లక్షలు తగ్గింది. ఒక్కో మహిళకు సంతానోత్పత్తి రేటు సుమారు ఒకటిగా ఉండగా.. జనాభా స్థిరంగా ఉండేందుకు అవసరమైన 2.1 కంటే ఇది చాలా తక్కువ. ఈ నేపథ్యంలో యువత దీర్ఘకాలం వర్చువల్ సంబంధాలకే పరిమితమైతే భవిష్యత్‌లో కుటుంబం, వివాహాలు, సంతానోత్పత్తిపై ఎలాంటి ప్రభావం ఉంటుందన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అయితే ఏఐ కంపానియన్ల వినియోగానికి, జననాల రేటు తగ్గుదలకు నేరుగా సంబంధం ఉందని చెప్పేందుకు ప్రస్తుతం ఆధారాలు లేవు. మరోవైపు భావోద్వేగ ఆధారపడటంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఏఐ వినియోగం మితిమీరి నిజ జీవిత సంబంధాలు, సామాజిక జీవితాన్ని ప్రభావితం చేసే స్థాయికి చేరకుండా చర్యలు చేపడుతోంది.

ఏఐ బంధాలపై చైనా నిబంధనలు కఠినం..
ఏఐ కంపానియన్లపై చైనా నియంత్రణలు క్రమంగా కఠినమవుతున్నాయి. జాతీయ ఇంటర్నెట్ సమాచార కార్యాలయం సహా ఐదు ప్రభుత్వ విభాగాలు రూపొందించిన నిబంధనలు 2026 జూలై 15 నుంచి అమల్లోకి వచ్చాయి. వాటి ప్రకారం.. వినియోగదారుల్లో అధిక భావోద్వేగ ఆధారపడటాన్ని, వ్యసనాన్ని ఏఐ సేవలు ప్రోత్సహించకూడదు. ఆధారపడే లక్షణాలు కనిపిస్తే వినియోగదారులకు హెచ్చరికలు ఇవ్వాలి. సుదీర్ఘ వినియోగంపై.. ఉదాహరణకు రెండు గంటల నిరంతర వినియోగం తర్వాత.. రిమైండర్లు ఇవ్వాలి. మైనర్ల కోసం ప్రత్యేక ‘మైనర్ మోడ్’ ఉండాలి. పిల్లలకు వర్చువల్ కుటుంబ సభ్యులు లేదా రొమాంటిక్ భాగస్వాములుగా పనిచేసే ఏఐ పాత్రలను అందించకూడదు. పిల్లల వయసును కచ్చితంగా గుర్తించాలి. వ్యసనం, అధిక ఖర్చు, భావోద్వేగ ఆధారపడటాన్ని పెంచే అల్గారిథమ్‌లను నివారించాలి. ఆత్మహత్య లేదా స్వీయహాని వంటి సందర్భాల్లో సాధారణ సంభాషణ కొనసాగించకుండా తగిన జోక్యం, సహాయం అందించాలి. వినియోగదారుల వ్యక్తిగత సమాచారం, సంభాషణల భద్రతకు చర్యలు తీసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే సాధారణ కేసుల్లో 10వేల నుంచి లక్ష యువాన్ల వరకు జరిమానా విధించవచ్చు. పౌరుడి ప్రాణం, ఆరోగ్యానికి ఏదైనా హాని జరిగితే లక్ష నుంచి 2 లక్షల యువాన్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
మైనర్లపై మరింత ఫోకస్
సెప్టెంబర్‌లో చైనా సైబర్‌స్పేస్ అడ్మినిస్ట్రేషన్ మైనర్ల ఆన్‌లైన్ భద్రతపై కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చింది. 18 ఏళ్లలోపు వారికి వర్చువల్ సన్నిహిత సేవలు, వర్చువల్ బంధువులు లేదా కంపానియన్లను అందించడాన్ని నిషేధించే ప్రతిపాదన ఇందులో ఉంది. పిల్లల్లో వ్యసనాన్ని పెంచే లేదా వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ఆన్‌లైన్ కంటెంట్, సేవలపైనా ఆంక్షలు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయ సేకరణ అక్టోబర్ 17 వరకు కొనసాగనుంది. 2025 చివరి నాటికి చైనాలో 6-19 ఏళ్ల మధ్య వయసున్న ఇంటర్నెట్ వినియోగదారులు సుమారు 11.25 కోట్లు. మొత్తం ఇంటర్నెట్ వినియోగదారుల్లో వీరి వాటా దాదాపు 18 శాతం. దీంతో ఏఐ కంపానియన్ల విషయంలో మైనర్ల రక్షణ కీలక అంశంగా మారింది. తీవ్రమైన ఉల్లంఘనల్లో.. సంబంధిత ప్లాట్‌ఫామ్ ఆదాయం 10 లక్షల యువాన్లకు మించి ఉంటే ఆ ఆదాయానికి పది రెట్ల వరకు జరిమానా విధించడం, మొత్తం ఆదాయాన్ని స్వాధీనం చేసుకోవడం వంటి ప్రతిపాదనలు కూడా ఉన్నాయి.
పేరేదైనా.. భావోద్వేగ బంధమే కీలకం
చైనా న్యాయ నిపుణుడు హే జియాంగ్‌గావో అభిప్రాయం ప్రకారం.. ఒక సర్వీస్‌ను ‘వర్చువల్ ఇంటిమేట్ రిలేషన్‌షిప్’గా పరిగణించాలా? అన్నదే కీలకం. నిజమైన కుటుంబ సభ్యుడు లేదా భాగస్వామి సంబంధాన్ని అనుకరించేలా, దీర్ఘకాలిక భావోద్వేగ బంధాన్ని పెంచేలా సేవను రూపొందిస్తే అది కొత్త నిబంధనల పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా పాత్రను అనుకరిస్తూ చేసే ఏఐ చాట్ మాత్రం మినహాయింపుగా ఉండొచ్చు. అయితే సేవకు ‘ఏఐ కంపానియన్’ అనే పేరు పెట్టకపోయినా.. అది వినియోగదారులో తీవ్రమైన భావోద్వేగ ఆధారపడటాన్ని పెంచుతూ, చివరకు నిజ జీవిత సంబంధాలను భర్తీ చేసే స్థాయికి వెళితే నిబంధనల నుంచి తప్పించుకోవడం కష్టం.
ఒకవైపు ఏఐ విప్లవం.. మరోవైపు ‘ఏఐ బంధాలు’
ప్రశ్నలకు సమాధానమిచ్చే ఏఐ.. ఇప్పుడు మనసుకు మాటిచ్చే స్థాయికి చేరింది. ఒంటరితనాన్ని తగ్గించే తోడుగా కనిపిస్తున్న ఈ వర్చువల్ బంధాలు.. ఒకవైపు కొత్త మార్కెట్‌కు దారితీస్తుండగా, మరోవైపు వ్యక్తిగత గోప్యత, భావోద్వేగ ఆధారపడటం, మానవ సంబంధాల భవిష్యత్తుపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?
- ●CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి
- ●KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్
- ●Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్‌డౌన్!
- ●OU Degree Exam Fee | ఓయూ పరిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ
- ●Song Lyrics | సద్ది గట్టి...సెలకల తొవ్వ బట్టి - తెలంగాణ పల్లె పదాలతో చంద్రబోస్ మ్యాజిక్ - ‘ఏగిలివారంగ’ సాంగ్ లిరిక్స్ ఇవిగో...

Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?

CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి

KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్

Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్‌డౌన్!





