త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

China Export Rules | ఇండియా టార్గెట్ 120 బిలియన్ డాలర్లు.. అడ్డుకట్ట వేసేందుకు చైనా కొత్త స్కెచ్! అసలేంటి ఆ రూల్స్?

భారత్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో దూసుకుపోతున్న వేళ చైనా కొత్త రూల్స్ తో షాకిచ్చింది. ఎగుమతులపై ఆంక్షలు ఇండియా టార్గెట్‌ను దెబ్బతీస్తాయా?

J

International | Published On May 25, 2026, 9.30 pm IST

China Export Rules | ఇండియా టార్గెట్ 120 బిలియన్ డాలర్లు.. అడ్డుకట్ట వేసేందుకు చైనా కొత్త స్కెచ్! అసలేంటి ఆ రూల్స్?
Advertisement
  • కొత్త ఎగుమతి చట్టాలతో (Decrees 834 & 835) సప్లై చైన్‌పై నియంత్రణ పెంచిన చైనా
  • భారత్ నిర్దేశించుకున్న 120 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల లక్ష్యంపై ఆందోళన
  • కార్ల తయారీ నుంచి స్మార్ట్‌ఫోన్ల వరకు ముడిసరుకు, యంత్రాల కోసం చైనాపైనే ఆధారపడుతున్న వైనం
  • దీటుగా బదులిచ్చేందుకు 'భవ్య' స్కీమ్ కింద 50 ఇండస్ట్రియల్ పార్కులను సిద్ధం చేస్తున్న కేంద్రం

China Export Rules | త్రినేత్ర.న్యూస్ : కోవిడ్ తర్వాత ప్రపంచ దేశాలకు, చైనాకు (China) ప్రత్యామ్నాయంగా భారత్ (India) ఎదిగింది. ఎలక్ట్రానిక్స్, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో మన దేశం దూసుకుపోతోంది. అయితే, సరిగ్గా ఇదే సమయంలో మన ఎదుగుదలకు బ్రేక్ వేసేలా చైనా కొత్త ఎగుమతి నిబంధనలను (Export rules) తెరపైకి తెచ్చింది. కేవలం ఫ్యాక్టరీలు పెడితే సరిపోదు, వాటికి అవసరమైన ముడిసరుకు, యంత్రాల సప్లైపై తన పట్టు బిగిస్తూ డ్రాగన్ కంట్రీ సరికొత్త ఆంక్షలకు తెరతీసింది.

భారత్ లక్ష్యానికి గండిపడేనా?

భారత్ ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 2015లో 8.6 బిలియన్ డాలర్లు ఉంటే.. 2025 నాటికి అది 47 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 2026 సంవత్సరాంతానికి దీనిని ఏకంగా 120 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) టార్గెట్‌గా పెట్టుకుంది. యాపిల్ (Apple) లాంటి దిగ్గజాలు ఇక్కడే ఫ్యాక్టరీలు పెడుతున్నాయి. సెమీకండక్టర్ల ప్లాంట్లు కూడా ఊపందుకున్నాయి. కానీ, చైనా తీసుకువచ్చిన కొత్త 'స్టేట్ కౌన్సిల్ డిక్రీస్ 834, 835' (Decrees 834 and 835) చట్టాలు ఇప్పుడు మన ఇండస్ట్రీకి టెన్షన్ పుట్టిస్తున్నాయి.

అసలు సమస్య ఎక్కడంటే

ఇండియా ఎంత వేగంగా తయారీ రంగాన్ని విస్తరిస్తున్నా.. అందుకు అవసరమైన కీలక యంత్రాలు, ముడిసరుకు (Raw materials), కాంపోనెంట్స్ కోసం ఇంకా చైనాపైనే ఆధారపడుతోంది. తాజా నిబంధనలతో చైనా వీటి ఎగుమతులపై కఠిన ఆంక్షలు విధించింది. దీనివల్ల మన దేశంలోకి వచ్చే క్యాపిటల్ ఎక్విప్‌మెంట్, కీలక పరికరాల సప్లై దెబ్బతింటుందని ఎలక్ట్రానిక్స్, ఆటో రంగాలు (Auto sector) ఆందోళన చెందుతున్నాయి. ఒక్క ఆటోమొబైల్ సెక్టార్‌లోనే గత ఆర్థిక సంవత్సరంలో (FY25) 26 శాతం కాంపోనెంట్స్ చైనా నుంచే దిగుమతి కావడం గమనార్హం.

ఇండస్ట్రీ వర్గాల ఆందోళన

ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చే ఒక్కో కార్‌లో దాదాపు 3,000 చిప్స్ (Chips) వాడుతున్నారని, చైనా ఆంక్షల వల్ల కార్ల డెలివరీలు లేట్ అవ్వడమే కాదు.. ఫీచర్లు కూడా తగ్గే ప్రమాదం ఉందని కార్స్ అన్‌లిమిటెడ్ ఫౌండర్ ముస్తఫా సింగపూర్‌వాలా హెచ్చరించారు. అంతేకాదు, తయారీ సంస్థలను చైనా దాటి బయటకు తరలిస్తే కంపెనీలు, ఎగ్జిక్యూటివ్‌లపై చర్యలు తీసుకునేలా ఈ కొత్త రూల్స్ ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం దిగుమతులపై ఆధారపడకుండా స్థానికంగానే సప్లయర్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఎన్‌ఎక్స్‌టీసెల్ (NXTCELL) మొబిలిటీ సీఈవో అతుల్ వివేక్ అభిప్రాయపడ్డారు.

కేంద్రం మాస్టర్ ప్లాన్.. 'భవ్య'

చైనా ఎత్తుగడలను దీటుగా ఎదుర్కొనేందుకు కేంద్రం కూడా సిద్ధమైంది. కీలక సప్లై చైన్స్ (Supply chains) విషయంలో కేవలం ఒకే దేశంపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు రంగాల వారీగా కొత్త పెట్టుబడి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) తెలిపారు.

అలాగే, దేశంలో మౌలిక సదుపాయాలను పెంచేందుకు రూ. 33,660 కోట్లతో 'భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన' (Bhavya) స్కీమ్‌ను కేంద్రం ప్రకటించింది. దీని కింద రాబోయే మూడేళ్లలో ఏకంగా 50 కొత్త ఇండస్ట్రియల్ పార్కులను ప్రారంభించి, గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మారాలన్నది భారత్ వ్యూహం. చైనా ఆంక్షలు భారత్‌కు తాత్కాలికంగా సవాలు విసిరినా, దీర్ఘకాలంలో సొంతంగా ఎదిగేందుకు ఇది ఒక సువర్ణావకాశంగా మారుతుందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Advertisement
Advertisement