త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Afghanistan–Pakistan | అఫ్గాన్‌-పాక్ మ‌ధ్య కొన‌సాగుతున్న ఉద్రిక్త‌త‌లు.. కాబూల్‌లో పేలుడు, కాల్పుల శ‌బ్దాలు

Afghanistan–Pakistan | అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో ఆదివారం ఉదయం పేలుళ్లు, కాల్పుల శబ్దాలు వినిపించాయి. అఫ్గానిస్తాన్–పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఘర్షణలు నాలుగో రోజుకు చేరాయి. ఈ నేపథ్యంలో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వేకువ జాము స‌మ‌యంలో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో వరుస పేలుళ్ల శబ్దాలు మార్మోగాయని, అనంతరం కాల్పులు జరిగినట్లు కాబూల్‌లో ఉన్న రాయిటర్స్ ప్రతినిధి తెలిపారు.

P

International | Published On Mar 1, 2026, 5.08 pm IST

Afghanistan–Pakistan | అఫ్గాన్‌-పాక్ మ‌ధ్య కొన‌సాగుతున్న ఉద్రిక్త‌త‌లు.. కాబూల్‌లో పేలుడు, కాల్పుల శ‌బ్దాలు
Advertisement

Afghanistan–Pakistan | అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో ఆదివారం ఉదయం పేలుళ్లు, కాల్పుల శబ్దాలు వినిపించాయి. అఫ్గానిస్తాన్–పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఘర్షణలు నాలుగో రోజుకు చేరాయి. ఈ నేపథ్యంలో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వేకువ జాము స‌మ‌యంలో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో వరుస పేలుళ్ల శబ్దాలు మార్మోగాయని, అనంతరం కాల్పులు జరిగినట్లు కాబూల్‌లో ఉన్న రాయిటర్స్ ప్రతినిధి తెలిపారు. అయితే, దాడుల లక్ష్యం ఏంటీ? ప్రాణనష్టం జరిగిందా? అన్నది వెంటనే స్పష్టంగా తెలియ‌రాలేదు. తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ కాబూల్ గగనతలంలోకి వచ్చిన పాకిస్తాన్ విమానాలను అఫ్గాన్ బలగాలు లక్ష్యంగా చేసుకుని వైమానిక రక్షణ చర్యలు చేప‌ట్టింద‌ని.. ఫలితంగానే ఈ శబ్దాలు వినిపించాయని తెలిపారు. “పాకిస్తాన్ విమానాలపై కాబూల్‌లో వైమానిక రక్షణ దాడులు నిర్వహించాం. నగర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అని పేర్కొన్నారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్ద‌ని ఆయ‌న ప్రజలకు సూచించారు.

ఇదిలా ఉండగా, పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయం, సమాచార శాఖ, సైన్యం ఈ ఘటనలపై స్పందించలేదు. ఈ వారంలో అఫ్గానిస్తాన్ భూభాగంలో పాకిస్తాన్ వైమానిక దాడులు జరిపినట్టు ప్రకటించింది. ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై లక్ష్యంగా ఈ దాడులు చేపట్టినట్లు పాకిస్తాన్ పేర్కొంది. అయితే, దీన్ని తమ సార్వభౌమాధికారానికి విరుద్ధమని పేర్కొంటూ, సరిహద్దు వెంట ప్రతిదాడులు ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇరు దేశాలు భారీ ప్రాణనష్టం జరిగినట్లు చెబుతున్నప్పటికీ, విడుదల చేసిన గణాంకాల్లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. స్వతంత్రంగా ఆ వివరాలను ధ్రువీక‌రించ‌డం సాధ్యం కాలేద‌ని స‌మాచారం. ఇదిలా ఉండ‌గా సుమారు 2,600 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు వెంట ఈ ఘర్షణలు ఇటీవల తీవ్ర‌మ‌య్యాయి. పరిస్థితులు మరింత ముదిరే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

పాక్ సైన్యం ఫిబ్ర‌వ‌రి 22న అఫ్గాన్ స‌రిహ‌ద్దుల్లో వైమానిక దాడుల‌కు దిగింది. దాడుల్లో 70 మంది ఉగ్ర‌వాదుల‌ను హ‌త‌మార్చామ‌ని పాకిస్తాన్ ప్ర‌క‌టించింది. గురువారం అఫ్గాన్ సైతం పాక్‌ సరిహద్దుల‌పై విరుచుకుపడింది. గురువారం అర్ధరాత్రి దాటిన త‌ర్వాత ‘ఆపరేషన్‌ గజబ్‌ లిల్‌ హక్‌’ పేరుతో అఫ్గాన్‌లోని కాబూల్, కాందహార్, పక్తియా ప్రావిన్సులపై ఇస్లామాబాద్‌ వైమానిక దాడులు నిర్వహించింది. తమ దాడుల్లో 274 మంది తాలిబన్లు హతమయ్యారని పాక్ ప్ర‌క‌టించ‌గా.. మరో 400 మంది గాయపడ్డారని పేర్కొంది. త‌మ దాడుల్లో 55 మంది పాక్‌ సైనికులను మ‌ట్టుపెట్టామ‌ని అఫ్ఘ‌నిస్తాన్ ప్ర‌క‌టించింది.

అఫ్గాన్ తాలిబాన్‌పై పాకిస్తాన్ చేపట్టిన సైనిక చర్యలు కొనసాగుతున్నాయని ఆ దేశ మంత్రి ఆదివారం ప్రకటించారు. దాడులు ముగిసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న వార్తలను ఆయన ఖండించారు. పార్లమెంటరీ వ్యవహారాల ఫెడరల్ మంత్రి తారిక్ ఫజల్ చౌధ్రి మాట్లాడుతూ పాకిస్తాన్ అఫ్గానిస్తాన్‌పై చేపట్టిన ఆపరేషన్‌ను నిలిపివేసిందని వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యమన్నారు. “పాకిస్తాన్ తన ఆపరేషన్లను ఆపేసిందని సోషల్ మీడియాలో తప్పుడు, కల్పిత వార్తలు ప్ర‌సార‌మ‌వుతున్నాయ‌ని.. ఇందులో నిజం లేద‌న్నారు. తాలిబాన్ లక్ష్యంగా కొనసాగుతున్న ఈ చర్యలపై ప్రభుత్వం అధికారికంగా స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇంకా తగ్గుముఖం పట్టలేదని సంకేతాలు వెలువడుతున్నాయి.

Advertisement
Advertisement