త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Form 7 Voter Deletion Fraud | ఓటర్ల జాబితా నుంచి పేర్ల గల్లంతు కుట్ర: బీజేపీ ఏజెంట్‌పై ఎఫ్ఐఆర్

ఓటర్లకు తెలీకుండానే పేర్ల తొలగింపు! ముషీరాబాద్‌లో ప్రీ-ఫిల్డ్ ఫారం-7 సమర్పించిన బీజేపీ బూత్ ఏజెంట్‌పై కేసు నమోదు.. ఆధారాలతో టీపీసీసీ సంచలన ఆరోపణలు.

J

Hyderabad | Published On Oct 7, 2026, 5.11 pm IST

Form 7 Voter Deletion Fraud | ఓటర్ల జాబితా నుంచి పేర్ల గల్లంతు కుట్ర: బీజేపీ ఏజెంట్‌పై ఎఫ్ఐఆర్

సంక్షిప్త సారాంశం

ముషీరాబాద్‌లో ఓటర్ల ప్రమేయం లేకుండానే నకిలీ ప్రీ-ఫిల్డ్ ఫారం-7 సమర్పించిన బీజేపీ బూత్ ఏజెంట్ ఎస్.బాలచందర్ అలియాస్ బాలుపై ఈఆర్వో ఫిర్యాదుతో చిక్కడపల్లి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముషీరాబాద్, బహదూర్‌పురా, గోషామహల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లను లక్ష్యంగా చేసుకుని బీజేపీ నాయకులు కుట్రపూరితంగా ఫారం-7లు ఇస్తున్నారని టీపీసీసీ ఈసీ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ పులిపాటి రాజేష్ కుమార్ వెల్లడించారు. ఫారం-7 ద్వారా తొలగించిన ఓట్లను మళ్లీ ఫారం-6 ద్వారా చేర్పించుకోవచ్చన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నకిలీ ఫారాల ముద్రణ, సరఫరా వెనుక ఉన్న వారందరితో పాటు రామచంద్రరావు పాత్ర ఉన్నట్లు రుజువైతే ఆయనపై కూడా క్రిమినల్ కేసులు పెట్టాలని ఎలక్షన్ కమిషన్‌ను కోరింది.

Advertisement
  • గాంధీభవన్‌లో కాంగ్రెస్ సంచలన ఆధారాలు

Form 7 Voter Deletion Fraud | త్రినేత్ర న్యూస్ : హైదరాబాద్ నగరంలోని కీలక నియోజకవర్గాల్లో అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించేందుకు బీజేపీ అమలు చేస్తున్న 'ప్రీ-ఫిల్డ్ ఫారం-7' కుట్ర పక్కా ఆధారాలతో బట్టబయలైందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ప్రకటించింది. గాంధీభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో టీపీసీసీ ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ పులిపాటి రాజేష్ కుమార్ మాట్లాడారు. ముషీరాబాద్‌లో స్వయంగా ఓటరుకు తెలియకుండానే నకిలీ ఫారం-7 సమర్పించిన బీజేపీ పోలింగ్ బూత్ ఏజెంట్‌పై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైందని తెలిపారు.

నిజమైన కాంగ్రెస్ ఆరోపణలు.. రంగంలోకి దిగిన ఈఆర్వో

ముషీరాబాద్ అసెంబ్లీ పరిధిలోని 210వ పోలింగ్ బూత్ పరిధిలో ఓటర్లకే తెలియకుండా 31 ఫారం-7 దరఖాస్తులను బీఎల్ఓకి సమర్పించారని ఎన్నికల కమిషన్ విచారణలో తేలింది. ఈ కుట్రకు పాల్పడింది బీజేపీకి చెందిన బూత్ లెవల్ ఏజెంట్ ఎస్.బాలచందర్ అలియాస్ బాలుగా తేలడంతో, ముషీరాబాద్ ఈఆర్వో (ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్) అధికారికంగా చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సదరు బీజేపీ నేతపై కేసు నమోదు చేశారు. ఈ పరిణామంతో బీజేపీ నేతలు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని రుజువైందని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు.

రామచంద్రరావు వ్యాఖ్యలపై తీవ్ర ధ్వజం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీరుపై పులిపాటి రాజేష్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "మీరు వృత్తిరీత్యా న్యాయవాది. ప్రభుత్వ అధికారులకు తప్పుడు సమాచారం ఇవ్వడం, అర్హులైన ఓటర్ల పేర్లను దొంగతనంగా జాబితా నుంచి తీసేయడానికి ఫారం-7 పెట్టడం చట్టరీత్యా నేరమని మీకు తెలియదా?" అని ఆయన సూటిగా ప్రశ్నించారు. తొలగించిన ఓట్లను మళ్లీ ఫారం-6 ద్వారా నమోదు చేసుకోవచ్చని రామచంద్రరావు చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. ఫారం-6 అనేది మొదటిసారి ఓటు హక్కు పొందే యువత "నాకు ఎక్కడా ఓటు లేదు" అని ధ్రువీకరిస్తూ పెట్టేదని, ఒకసారి తొలగించబడిన ఓటర్లను తప్పుడు డిక్లరేషన్‌పై సంతకం పెట్టాలని చెప్పడం ప్రజలను నేరానికి పురిగొల్పడమేనని దుయ్యబట్టారు.

Voter Deletion Scam FIR Filed Against BJP Agent Over Fake Form-7 In Musheerabad

గోషామహల్‌లోనూ అదే దందా.. అడ్డుకున్న బీఎల్ఓలు

గోషామహల్ నియోజకవర్గంలోని బూత్ నంబర్ 21కి చెందిన బీజేపీ బీఎల్ఏ సాయికిరణ్, బూత్ నంబర్ 28 బీఎల్ఏ తుడుము జనార్దన్ కూడా వందలాది ప్రీ-ఫిల్డ్ ఫారం-7లను సమర్పించడానికి యత్నించారని కాంగ్రెస్ ఆధారాలు బయటపెట్టింది. అయితే, స్థానిక బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్ఓలు) వాటిని నిరాకరించడం అభినందనీయమన్నారు. ముషీరాబాద్, బహదూర్‌పురా, గోషామహల్ వంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ సానుభూతిపరులను లక్ష్యంగా చేసుకుని ఈ తొలగింపుల దందా నడుస్తోందని ఆరోపించారు.

ఎంతటి వారైనా క్రిమినల్ కేసులు పెట్టాలి

ఈ బోగస్ ఫారాల వెనుక పెద్ద ముఠా ఉందని, వీటిని ముందుగానే ప్రింట్ చేయడం, వ్యక్తిగత డేటాను సేకరించి పంపిణీ చేయడం వెనుక బీజేపీ అగ్రనేతల హస్తం ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ కుట్రలో ఎవరి ప్రమేయం ఉన్నా, చివరికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పాత్ర రుజువైనా వారిపై కూడా తక్షణమే క్రిమినల్ కేసులు పెట్టాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సజ్జనార్‌లకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

ఈ విలేకరుల సమావేశంలో పులిపాటి రాజేష్ కుమార్‌తో పాటు టీపీసీసీ ఎస్ఐఆర్ కోఆర్డినేటర్ గంప వేణుగోపాల్, ఈసీసీసీ సభ్యుడు వాజీద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

Also Read | సీఎం రేవంత్ రెడ్డి వాటా ఎంత‌?.. గీతా హ్యుందాయ్ ముందు వెలసిన ఫ్లెక్సీలు

Advertisement
Advertisement