త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chinese Manja in Kukatpally | చైనా మాంజా మెడకు చుట్టుకొని బైక్‌పై వెళ్తున్న ఐదేళ్ల బాలిక మృతి

హైదరాబాద్‌ కూకట్‌పల్లి పరిధిలోని వివేకానంద నగర్ వద్ద జరిగిన ప్రమాదంలో ఐదేళ్ల బాలిక మృతి చెందింది. సంగారెడ్డి జిల్లా నుంచి తండ్రితో కలిసి బైక్‌పై వెళ్తుండగా, నిషేధిత చైనా మాంజా బాలిక మెడకు చుట్టుకుంది. తీవ్ర రక్తస్రావం కావడంతో నిష్విక మరణించింది.

J

Hyderabad | Published On Jan 26, 2026, 7.51 pm IST

Chinese Manja in Kukatpally | చైనా మాంజా మెడకు చుట్టుకొని బైక్‌పై వెళ్తున్న ఐదేళ్ల బాలిక మృతి
Advertisement

Chinese Manja in Kukatpally | త్రినేత్ర.న్యూస్ : నిషేధిత చైనా మాంజా మరో నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. సంక్రాంతి పండుగ వేళ గాలిపటాలు ఎగురవేసేందుకు వాడే ఈ ప్రమాదకరమైన దారం, ప్రయాణికులకు శాపంగా మారుతోంది. సోమవారం సాయంత్రం కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.

తండ్రి కళ్ల ముందే కూతురు మృతి

సంగారెడ్డి జిల్లా కాజీపల్లికి చెందిన ఒక వ్యక్తి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి బైక్‌పై కూకట్‌పల్లి వైపు వెళ్తున్నారు. వివేకానంద నగర్ లోని హైవే వద్దకు చేరుకోగానే, గాలిలో నుంచి తెగి పడిన చైనా మాంజా ఐదేళ్ల బాలిక నిష్విక ఆదిత్య మెడకు చుట్టుకుంది. దారం మెడకు బలంగా దిగబడటంతో తీవ్ర గాయమై బాలిక బైక్ పై నుంచి కిందపడిపోయింది. గొంతు వద్ద తీవ్రమైన కోత పడటంతో విపరీతంగా రక్తస్రావం జరిగి, బాలిక తన తండ్రి కళ్ల ముందే ప్రాణాలు వదిలింది.

పోలీసుల నిఘా ఉన్నా ఆగని విక్రయాలు

నగరంలో చైనా మాంజా అమ్మకాలు, వాడకంపై ప్రభుత్వం పూర్తి నిషేధం విధించినప్పటికీ, రహస్యంగా వీటి విక్రయాలు సాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే నగరవ్యాప్తంగా వందల సంఖ్యలో కేసులు నమోదు చేసి, భారీగా మాంజా బండిల్స్ సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. చైనా మాంజా మనుషులకే కాకుండా పక్షులకు కూడా ప్రాణాంతకమని, దీనిని ఎవరూ వాడకూడదని పోలీసులు పదే పదే హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనపై కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement