త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court Slams Telangana Govt | సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు – జర్నలిస్ట్ రేవతి కస్టడీ పిటిషన్ కొట్టివేత

పల్స్ న్యూస్ జర్నలిస్ట్ రేవతి కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ వచ్చి ఆరు నెలలైన తర్వాత ఇప్పుడు పోలీస్ కస్టడీ కోరడంపై కోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఇది "అత్యంత దారుణమైన చర్య" అంటూ పోలీసుల పిటిషన్‌ను కొట్టివేసింది.

J

Hyderabad | Published On Feb 4, 2026, 8.26 pm IST

Supreme Court Slams Telangana Govt | సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు – జర్నలిస్ట్ రేవతి కస్టడీ పిటిషన్ కొట్టివేత
Advertisement

Supreme Court Slams Telangana Govt | త్రినేత్ర.న్యూస్ : పల్స్ న్యూస్ జర్నలిస్ట్ రేవతి (Revathi) కేసులో తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆమెను తిరిగి పోలీస్ కస్టడీకి అప్పగించాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం, పోలీసుల తీరుపై తీవ్ర ఆశ్చర్యం, ఆగ్రహం వ్యక్తం చేసింది.

అసలేం జరిగింది?

పల్స్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ రేవతికి నాంపల్లి కోర్టు గత ఏడాది మార్చిలోనే బెయిల్ మంజూరు చేసింది. అయితే, బెయిల్ వచ్చి సుమారు ఆరు నెలలు గడిచిన తర్వాత, తదుపరి విచారణ కోసం ఆమెను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ తెలంగాణ పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం పోలీసుల వాదనను తప్పుబట్టింది.

కాలం చెల్లిన అభ్యర్థన

"చట్టం ప్రకారం, బెయిల్ మంజూరైన తర్వాత పోలీస్ కస్టడీ సాధ్యం కాదు. సాధారణంగా అరెస్ట్ అయిన మొదటి 15 రోజుల్లోపు లేదా పదేళ్ల శిక్ష పడే కేసుల్లోనైతే గరిష్టంగా 45 రోజుల్లోపు మాత్రమే కస్టడీకి అనుమతి ఉంటుంది. కానీ, బెయిల్ వచ్చి ఆరు నెలలైన తర్వాత కస్టడీ కోరడం ఏంటి?" అని కోర్టు ప్రశ్నించింది.

పోలీసుల తీరుపై మండిపాటు

ఇన్ని నెలల తర్వాత కస్టడీ అడగడాన్ని సుప్రీంకోర్టు "అత్యంత దారుణమైన, విపరీతమైన నిర్ణయం"గా అభివర్ణించింది. జర్నలిస్ట్ రేవతి పోలీస్ కస్టడీకి అనుమతిని నిరాకరించడమే కాక, భవిష్యత్తులో కూడా ఈ కేసులో కస్టడీకి తీసుకునే వీలు లేదని తేల్చి చెప్పింది.

కేసు నేపథ్యం ఇదీ

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఒక రైతు మాట్లాడిన వీడియోను పల్స్ సోషల్ మీడియా ఛానల్‌లో పోస్ట్ చేయడం వివాదానికి దారితీసింది. ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో రేవతిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అప్పట్లో నాంపల్లి కోర్టు రూ. 25 వేల పూచీకత్తుతో ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ, ప్రతి సోమ, శుక్రవారాల్లో విచారణకు హాజరుకావాలని షరతు విధించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఆమెకు ఊరట లభించినట్లయింది.

ప్రజా సమస్యలను ప్రసారం చేసినందుకు జర్నలిస్టులను ఇబ్బంది పెట్టడం సరికాదని, సుప్రీంకోర్టు తీర్పు భావ ప్రకటనా స్వేచ్ఛకు దక్కిన విజయమని పలువురు పాత్రికేయులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
Advertisement