త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | రేవంత్ న‌మ్మేది గాడ్సేను.. పెట్టేది గాంధీ విగ్ర‌హ‌మ‌ట‌

KTR | రేవంత్ రెడ్డి గాడ్సేను న‌మ్ముతార‌ని మ‌ళ్లీ మహాత్మా గాంధీ విగ్రహం పెడతానని దొంగ మాటలు చెబుతున్నార‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమ‌ర్శించారు. గాంధీపై ప్రేమ ఉంటే పేదల ఇండ్లు కూల్చకుండా విగ్రహం ఏర్పాటు చేయాల‌న్నారు. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోందన్నారు.

S

Hyderabad | Published On Jun 21, 2026, 5.01 pm IST

KTR | రేవంత్ న‌మ్మేది గాడ్సేను.. పెట్టేది గాంధీ విగ్ర‌హ‌మ‌ట‌
Advertisement
  • ఇంకెన్ని రోజులు ఈ దొంగ మాట‌లు
  • చోటే భాయ్ - బడే భాయ్ క‌లిసి భూములు కొల్ల‌గొడుతున్న‌రు
  • రాష్ట్రంలో మాఫియా రాజ్యం న‌డుస్తుంది
  • రేవంత్‌రెడ్డి అనే సినిమా అట్ట‌ర్‌ఫ్లాప్ అయింది
  • ఈ ప్ర‌భుత్వాన్ని ఓడించాల‌ని ప్ర‌జ‌లు ఒక‌టే ప‌ట్టువ‌ట్టిండ్రు
  • రాజేంద్ర‌న‌గ‌ర్ బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో కేటీఆర్ ఫైర్‌

త్రినేత్ర‌.న్యూస్‌: రేవంత్ రెడ్డి గాడ్సేను న‌మ్ముతార‌ని మ‌ళ్లీ మహాత్మా గాంధీ విగ్రహం పెడతానని దొంగ మాటలు చెబుతున్నార‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమ‌ర్శించారు. గాంధీపై ప్రేమ ఉంటే పేదల ఇండ్లు కూల్చకుండా విగ్రహం ఏర్పాటు చేయాల‌న్నారు. ఆదివారం రాజేంద్రనగర్‌లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల స‌మావేశంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై సభ్యత్వ నమోదు, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై దిశానిర్దేశం చేశారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోంది. దండుపాళ్యం ముఠాకు అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి. నిజాయితీగా పనిచేసే అధికారులకు గౌరవం లేదు. గతంలో హైదరాబాద్‌ అంటే లా అండ్‌ ఆర్డర్‌కు చిరునామా. న‌గ‌రంలో పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారు. హైడ్రా పేరుతో ప్రజలను బెదిరిస్తున్నారు. గాంధీ పేరుతో రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ విధ్వంసాన్ని చూస్తే మహాత్ముని ఆత్మ కూడా ఘోషిస్తుంది. ఆయన ఆధ్వర్యంలో "దోచుకో.. దాచుకో.." అన్నట్లుగా కాంగ్రెస్ మంత్రులంతా కలిసి మాఫియాలు, స్కామ్‌లు చేస్తున్నారు అని కేటీఆర్ ఆరోపించారు.

స్వయంగా గాంధీజీ మనవడే వద్దన్నా.. ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా.. రేవంత్ అసలే పట్టించుకోకుండా బీజేపీతో కుమ్మక్కై ఈ వినాశనానికి తెరలేపిండు. బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాజెక్టుకు సహకరిస్తూ ఇచ్చిన రక్షణ శాఖ భూములను కాపాడాలి. నాడు కేసీఆర్ హయాంలో అంతర్జాతీయ కంపెనీలకు కేరాఫ్ అడ్రస్‌గా, సూపర్ స్టార్ రజనీకాంతే చూసి అబ్బురపడేలా ఉన్న హైదరాబాద్.. నేడు కాంగ్రెస్ 420 పాలనలో కుదేలైంది అని ఆయ‌న విమ‌ర్శించారు.

మూసీ పేరుతో విధ్వంసం..
మూసీ, హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూలుస్తూ.. నగరంలో శాంతిభద్రతలను గాల్లోకి దీపాల్లా మారుస్తూ వీరు చేస్తున్న దుర్మార్గాన్ని ప్రజలంతా గమనిస్తున్నారు. మూసీ పేరుతో కాంగ్రెస్ చేస్తున్న విధ్వంసపు రాజకీయాలకు బీజేపీ పార్టీ కూడా మద్దతు ఇస్తున్నది. ప్రధానమంత్రి మోడీతో మాట్లాడుకుని, 'చోటే భాయ్ - బడే భాయ్' (రేవంత్ - మోడీ) ఇద్దరూ కలిసి నిరుపేదల ఇండ్లను కూలుస్తూ మూసీ భూములు కొల్లగొడుతున్నారు. మోడీకి నిజాయితీ ఉంటే పేదల భూములు లాక్కోవద్దు, వారికి అన్యాయం చేయవద్దు అని ఎందుకు ప్రశ్నించరు? స్థానికంగా బీజేపీ నేతలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు కానీ, వారి సొంత ప్రభుత్వం మాత్రం ఇండ్లు కూల్చమని అనుమతులు ఇస్తున్నద అని కేటీ రామారావు అన్నారు.

రేవంత్‌రెడ్డి సినిమా వ‌ల్ల 4 కోట్ల ప్ర‌జ‌లు న‌ష్ట‌పోయారు..
2017లో రిలీజైన అర్జున్‌రెడ్డి మూవీ సూప‌ర్ హిట్ అయింది. ఇప్పుడు వ‌చ్చిన రేవంత్‌రెడ్డి సినిమా అట్ట‌ర్‌ఫ్లాప్ అయింది. సినిమా ఫెయిలైతే ప్రొడ్యూస‌ర్ న‌ష్ట‌పోతాడు. కానీ రేవంత్‌రెడ్డి అనే సినిమా వ‌ల్ల 4 కోట్ల మంది ప్ర‌జ‌లు న‌ష్ట‌పోయారు. ఈ స‌ర్కార్ వ‌చ్చాక త‌మ భూమిని ప్రొహిబిటెడ్ లిస్టులో చేర్చార‌ని శంషాబాద్‌కు చెందిన ఓ వ్య‌క్తి చెప్పాడు. బీఆర్ఎస్ ప్ర‌భుత్వం వ‌చ్చాక వారి భ‌ర‌తం ప‌ట్టాల‌ని కూడా చెప్పాడు అని కేటీఆర్ పేర్కొన్నారు.

కాంగ్రెస్ గద్దెనెక్కి రెండున్నరేళ్లు దాటినా.. ఒక్కటంటే ఒక్క హామీ నెరవేర్చేందుకు డబ్బులు లేవని చెబుతున్నది. మూసీలో మాత్రం లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి రేవంత్‌ సిద్ధమవుతున్నాడు. రేవంత్ ప్రభుత్వాన్ని ఓడించాలని ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రకాష్ గౌడ్.. అభివృద్ధి పేరుతో పార్టీ మారినా ఈ రెండున్నర సంవత్సరాలలో ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదు. ఎంతమంది పెద్ద నేతలు పోయినా గులాబీ సైన్యం బలంగా అలాగే ఉన్నది. రానున్న ఎన్నికల్లో కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిగా తీసుకువచ్చి గులాబీ జెండాను ఎగురవేయడం ఖాయం అని కేటీఆర్ ఆశాభావం వ్య‌క్తం చేశారు.

అనంత‌రం తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఆయనకు బీఆర్ఎస్ ఘన నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి జయశంకర్ చేసిన కృషిని స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్ రెడ్డి, సురభి వాణీదేవి, మాజీ ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అంజయ్య యాదవ్, రాజేంద్ర నగర్ నియోజకవర్గ ఇంచార్జ్ కార్తీక్ రెడ్డి, సీనియర్ నాయకులు రావుల శ్రీధర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement