త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pain Killers | 30 రోజుల్లో 13 పెయిన్‌కిల్లర్లు.. చివరకు కిడ్నీలు ఫెయిల్‌.. వైద్యుల హెచ్చ‌రిక‌..

Pain Killers | ఇండోర్‌కు చెందిన 31 ఏళ్ల వ్యక్తికి నెల రోజులకుపైగా జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు కొనసాగాయి. ఈ లక్షణాలు కనిపించిన ప్రతిసారీ అతను పెయిన్‌కిల్లర్‌ వేసుకునేవాడు. ఇలా పెయిన్‌కిల్లర్ల వాడకం క్రమంగా అదుపు తప్పింది. కేవలం 30 రోజుల్లో 13 పెయిన్‌కిల్లర్లు తీసుకోవడంతో చివరకు అతని కిడ్నీలు తీవ్రంగా దెబ్బతిని, కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీసింది.

S

Health | Published On Sep 4, 2026, 5.38 pm IST

Pain Killers | 30 రోజుల్లో 13 పెయిన్‌కిల్లర్లు.. చివరకు కిడ్నీలు ఫెయిల్‌.. వైద్యుల హెచ్చ‌రిక‌..
Advertisement

Pain Killers | ఇండోర్‌కు చెందిన 31 ఏళ్ల వ్యక్తికి నెల రోజులకుపైగా జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు కొనసాగాయి. ఈ లక్షణాలు కనిపించిన ప్రతిసారీ అతను పెయిన్‌కిల్లర్‌ వేసుకునేవాడు. ఇలా పెయిన్‌కిల్లర్ల వాడకం క్రమంగా అదుపు తప్పింది. కేవలం 30 రోజుల్లో 13 పెయిన్‌కిల్లర్లు తీసుకోవడంతో చివరకు అతని కిడ్నీలు తీవ్రంగా దెబ్బతిని, కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీసింది. పరిస్థితి విషమించడంతో కిడ్నీ మార్పిడి అవసరమైంది. అతడి తల్లి కిడ్నీ దానం చేయడంతో దెబ్బతిన్న కిడ్నీ స్థానంలో కొత్త కిడ్నీని శస్త్రచికిత్స ద్వారా అమర్చారు. ఈ ఘటన స్వయంగా మందులు వేసుకోవడం, పెయిన్‌కిల్లర్లను అధికంగా ఉపయోగించడం ఎంత ప్రమాదకరమో మరోసారి తెలియజేస్తోంది. పెయిన్‌కిల్లర్ల అధిక వినియోగం వల్ల కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇప్పటికే ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో మరిన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.

పెయిన్ కిల్ల‌ర్‌ల‌ను ప‌దే ప‌దే వాడొద్దు..

చాలామంది తీవ్రమైన అనారోగ్య సమస్యల లక్షణాలను కనిపించినప్పటికీ పట్టించుకోరు. వైద్యుడిని సంప్రదించే పరిస్థితి వచ్చే వరకు వాటిని నిర్లక్ష్యం చేస్తుంటారు. ముఖ్యంగా ఓవర్‌ది కౌంటర్‌ మందులు, పెయిన్‌కిల్లర్లు తీసుకుంటే సమస్య సులభంగా తగ్గిపోతుందని చాలామంది భావిస్తారు. అయితే వాటి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. సరైన సమయంలో వైద్య చికిత్స తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుంది. పెయిన్‌కిల్లర్లను అధికంగా ఉపయోగించడం కిడ్నీలను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా ఎన్‌ఎస్‌ఏఐడీలు అంటే నాన్‌-స్టెరాయిడల్‌ యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్‌ కిడ్నీ గాయానికి కారణమయ్యే అవకాశం ఉంది. సాధారణంగా ఉపయోగించే పారాసిటమాల్‌, ఐబుప్రోఫెన్‌, డైక్లోఫెనాక్‌, నాప్రోక్సెన్‌, ఏసిక్లోఫెనాక్‌, మెఫెనామిక్‌ యాసిడ్‌, ఎటోరికాక్సిబ్‌ వంటి పెయిన్‌కిల్లర్లను అధికంగా తీసుకున్నప్పుడు కిడ్నీ సమస్యలు తలెత్తుతాయి. నొప్పి, వాపును తగ్గించడమే పెయిన్‌కిల్లర్ల ప్రధాన ఉద్దేశం అయినప్పటికీ, వాటి ప్రభావం కిడ్నీలపై ఎలా ఉంటుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

దీర్ఘకాలంలో కిడ్నీలు దెబ్బ‌తినే అవ‌కాశం..

ఫార్మకాలజీ రీసెర్చ్‌ అండ్‌ పెర్స్‌పెక్టివ్స్‌లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం, పెయిన్‌కిల్లర్లు లిపిడ్‌ సమ్మేళనాలకు సంబంధించిన కొన్ని ఎంజైమ్‌లను నిరోధిస్తాయి. దీంతో కిడ్నీలకు వెళ్లే రక్తప్రసరణ తగ్గే అవకాశం ఉంటుంది. ఫలితంగా వ్యర్థ పదార్థాలు, శరీరంలోని ద్రవాలను ఫిల్టర్‌ చేసే కిడ్నీల సాధారణ పనితీరు కూడా ప్రభావితమవుతుంది. పెయిన్‌కిల్లర్ల వినియోగాన్ని నియంత్రించకపోతే దీర్ఘకాలికంగా కిడ్నీలు దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. వైద్యుడి సలహా లేకుండా ఆరోగ్య సమస్యలకు ఓవర్‌ది కౌంటర్‌ మందులు ఉపయోగించడాన్ని సెల్ఫ్‌ మెడికేషన్‌ అంటారు. సరైన వైద్య పరీక్షలు, వ్యాధి నిర్ధారణ లేకుండా మందులు తీసుకోవడం ఇందులో ప్రధాన ప్రమాదం. ఇలా మందులు తీసుకోవడం వల్ల అసలు అనారోగ్యానికి సంబంధించిన ముఖ్యమైన లక్షణాలు తాత్కాలికంగా తగ్గిపోతాయి. దీంతో తీవ్రమైన వ్యాధి గుర్తించడంలో ఆలస్యం జరిగి, దీర్ఘకాలిక చికిత్స అవసరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే వైద్యుల సలహా లేకుండా ఒకేసారి పలు మందులు తీసుకుంటే అవి పరస్పరం ప్రభావితం చేసుకునే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది.

స్ప‌ష్ట‌మైన ల‌క్ష‌ణాలు ఉండ‌వు..

కిడ్నీ దెబ్బతినడంలో ప్రధాన సమస్య, అది చాలాసార్లు ఎలాంటి స్పష్టమైన లక్షణాలు లేకుండానే కొనసాగుతుంది. నష్టం గణనీయంగా పెరిగిన తర్వాతే లక్షణాలు బయటపడే అవకాశం ఉంటుంది. స్వయంగా మందుల‌ను తీసుకోవడం వల్ల కిడ్నీలు ప్రభావితమైతే కాళ్లు, చీలమండల వద్ద వాపు వ‌స్తాయి. దీనిని వైద్యపరంగా ఎడిమా అంటారు. మూత్రం పరిమాణం తగ్గడం లేదా మూత్ర విసర్జనలో మార్పులు కనిపించడం, అలసట లేదా బలహీనత, వికారం, వాంతులు, ఆకలి తగ్గడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అధిక రక్తపోటు, చర్మం పొడిబారడం లేదా దురద, మానసిక గందరగోళం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వయసు పెరగడంతో కిడ్నీల పనితీరు బలహీనపడినవారిలో పెయిన్‌కిల్లర్ల వల్ల కిడ్నీ నష్టం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాగే మధుమేహం, అధిక రక్తపోటు, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి ఉన్నవారు కూడా అధిక ప్రమాదంలో ఉంటారు. శరీరంలో నీరు తగ్గిపోయిన పరిస్థితి అంటే డీహైడ్రేషన్‌ ఉన్నవారికి కూడా ప్రమాదం పెరుగుతుంది. వైద్యులు ఇప్పటికే పలు మందులు సూచించినవారు కూడా అదనంగా పెయిన్‌కిల్లర్లు తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి.

అవ‌య‌వాల‌పై ప్రభావం..

కిడ్నీ దెబ్బతినడంతో పాటు పెయిన్‌కిల్లర్ల అధిక వినియోగం కాలేయం, జీర్ణాశ‌యం, గుండెపై కూడా ప్రభావం చూపిస్తుంది. పెయిన్‌కిల్లర్లలోని ఔషధ పదార్థాలు ఈ అవయవాలపై వివిధ రకాల ప్రభావాలను చూపే అవకాశం ఉంటుంది. లక్షణాల కోసం ఎక్కువ మోతాదులో పారాసిటామాల్‌ తీసుకుంటే కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. దీర్ఘకాలం పెయిన్‌కిల్లర్లు అధికంగా వాడటం వల్ల జీర్ణవ్యవస్థ కూడా ప్రభావితమై జీర్ణాశ‌యంలో అల్సర్లు, పేగుల్లో అంతర్గత రక్తస్రావం వంటి సమస్యలు తలెత్తుతాయి. పెయిన్‌కిల్లర్లు రక్తప్రసరణ, రక్తపోటు, శరీరంలోని ద్రవాల సమతుల్యతపై ప్రభావం చూపడం ద్వారా గుండెపై కూడా ఒత్తిడిని పెంచి తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉంది. పెయిన్‌కిల్లర్లను సురక్షితంగా ఉపయోగించాలంటే వైద్యుల సూచించిన మోతాదును తప్పనిసరిగా పాటించాలి. అనారోగ్య తీవ్రతను బట్టి అవసరమైన మందు మోతాదును నిర్ణయిస్తారు.

వైద్యుల స‌ల‌హా అవ‌స‌రం..

వైద్యుల సలహా లేకుండా వివిధ మందులను కలిపి తీసుకోవడం ప్రమాదకరం. అనారోగ్యంతో శరీరం పోరాడుతున్న సమయంలో తగినంత నీరు తీసుకోవడం కూడా ముఖ్యం. పెయిన్‌కిల్లర్లను ఎక్కువ కాలం నిరంతరం ఉపయోగించకూడదు, ఎందుకంటే అవయవాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. లక్షణాలు కొన్ని రోజులకుపైగా కొనసాగితే పెయిన్‌కిల్లర్లతోనే సమస్యను అణచివేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. దాని వెనుక తీవ్రమైన అనారోగ్య సమస్య ఉండే అవకాశం ఉంది. జ్వరం నిరంతరంగా కొనసాగుతున్నా, తలనొప్పి పదేపదే వస్తున్నా, ఒళ్లు నొప్పులు పునరావృతమవుతున్నా వైద్యుడిని సంప్రదించాలి. మూత్రం తగ్గడం, శరీరంలో వాపు కనిపించడం లేదా కారణం తెలియని తీవ్రమైన అలసట వంటి లక్షణాలు కనిపించినా వైద్య సహాయం తీసుకోవడం అవసరం. పెయిన్‌కిల్లర్ల అధిక వినియోగం చివరకు తీవ్రమైన కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీసిన ఈ ఘటన.. నొప్పి లేదా జ్వరం వచ్చిన ప్రతిసారీ స్వయంగా పెయిన్‌కిల్లర్లు వేసుకోవడం ఎంత ప్రమాదకరమో హెచ్చరిస్తోంది. ఏ మందు ఎంత మోతాదులో తీసుకోవాలో వైద్యుడి సలహాతో నిర్ణయించుకోవడం సురక్షితం. లక్షణాలకు తాత్కాలిక ఉపశమనం కోసం మందులు తీసుకోవడం కంటే, వాటికి అసలు కారణాన్ని గుర్తించి సరైన చికిత్స పొందడం అత్యంత ముఖ్యం.

Advertisement
Advertisement