Hyd Mecca Masjid 2001 Clash | కొత్వాల్ కాళ్ల ముందే పేలిన పెట్రోల్ బాంబు!
కళ్లముందే పేలిన పెట్రోల్ బాంబు.. రక్తసిక్తమైన డీసీపీ నుదురు.. స్వయంగా రంగంలోకి దిగిన కొత్వాల్ పేర్వారం రాములు! పాతికేళ్ల నాటి పాతబస్తీ ఉద్రిక్తతపై సీనియర్ జర్నలిస్ట్ ప్రత్యక్ష కథనం.
సంక్షిప్త సారాంశం
2001 అక్టోబర్ 12న ఆఫ్ఘనిస్థాన్‌పై అమెరికా ఎయిర్ స్ట్రైక్స్ నేపథ్యంలో హైదరాబాద్ మక్కా మసీదు వద్ద తీవ్ర ఉద్రిక్తత, రాళ్లదాడి చోటుచేసుకుంది. అప్పటి సీపీ పేర్వారం రాములు కాళ్ల ముందే పెట్రోల్ బాంబు పేలగా, రాయి తగిలి సౌత్ జోన్ డీసీపీ ఉమాపతి సహా 50 మంది పోలీసులు గాయపడ్డారు. పరిస్థితి తీవ్రరూపం దాల్చడంతో సీపీ స్వయంగా లాఠీ చేతబట్టి రంగంలోకి దిగి ఆందోళనకారులను అదుపులోకి తెచ్చారు. నాటి భీకర ఘటనా జ్ఞాపకాలను, పాతికేళ్ల తర్వాత రిటైర్డ్ ఐపీఎస్ అధికారి రాములుతో కలిసిన అనుబంధాన్ని సీనియర్ క్రైమ్ రిపోర్టర్ వేముల సత్యనారాయణ నెమరువేసుకున్నారు.
- పాతికేళ్ల నాటి మంట… నేడు మధుర జ్ఞాపకం
- నా జర్నలిజం జ్ఞాపకాలు – 2001
- వేముల సత్యనారాయణ
Hyd Mecca Masjid 2001 Clash | త్రినేత్ర న్యూస్ : 2001 అక్టోబర్ 12… శుక్రవారం. హైదరాబాద్ పాతబస్తీ. ఆ రోజుల్లో ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న మతపరమైన ఉద్రిక్త ఘటన జరిగినా దాని ప్రకంపనలు హైదరాబాద్ పాతబస్తీలో కనిపిస్తాయేమోనని నిఘా వర్గాలు అప్రమత్తంగా ఉండేవి. ఆ రోజు కూడా శుక్రవారం ప్రార్థనల తర్వాత పరిస్థితి మారవచ్చన్న ముందస్తు సమాచారంతో మక్కా మసీదు పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. అమెరికా దేశము అఫ్ఘనిస్తాన్ మీద ఎయిర్ స్ట్రైక్ చేయడంతో దేశవ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొంది.. మక్కా మసీదు ముందు భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి.
అప్పటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పేర్వారం రాములు స్వయంగా అక్కడే ఉన్నారు. ఆయనతో పాటు అదనపు కమిషనర్ అరవిందరావు, సౌత్ జోన్ డీసీపీ ఉమాపతి, టాస్క్ ఫోర్స్ డీసీపీ ఇక్బాల్ తదితర పోలీస్ అధికారులు ఉన్నారు. మీడియా ప్రతినిధులమూ మక్కా మసీదు ముందు మోహరించాం.
అప్పుడు నేను ఆంధ్రభూమి క్రైమ్ రిపోర్టర్‌ను. యునానీ ఆస్పత్రి కింద, సరిగ్గా మక్కా మసీదు గేటుకు ఎదురుగా నిలబడి పరిస్థితిని గమనిస్తున్నాను. ప్రార్థనలు ముగిశాయి. సాధారణంగా అయితే నమాజ్ పూర్తయిన తర్వాత ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ఎవరి దారిన వారు వెళ్లిపోవాలి. కానీ ఆ రోజు సీన్ మారింది.
ఎవరూ బయటకు రావడం లేదు. లోపలి నుంచి ఒక్కసారిగా వందల గొంతులు మార్మోగాయి. “నారా-ఏ-తక్బీర్…” నినాదాలు. క్షణాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు… రాళ్లు పోలీసుల వైపు దూసుకొచ్చాయి. ఒకటి కాదు… రెండు కాదు… రాళ్ల వర్షం.
కమిషనర్ రాములు అక్కడే ఉండటంతో ఆయనకు రాళ్లు తగలకుండా టాస్క్‌ఫోర్స్ సిబ్బంది షీల్డులతో రక్షణగా నిలబడ్డారు. నేనూ అక్కడే చూస్తున్నాను. అంతలో రివ్వున గాలిని చీల్చుకుంటూ ఓ మండుతున్న బాటిల్ మా వైపు వచ్చింది. చూస్తుండగానే కొత్వాల్ రాములు గారి కాళ్ల ముందే పడింది.
పెట్రోల్ బాంబు పేలింది!
ఒక్కసారిగా మంటలు ఎగిశాయి. అందరం దూరంగా జరిగాం. ఆ పేలుడు ధాటికి లేచిన ఓ రాయి పెళ్ల రివ్వున వెళ్లి సౌత్‌జోన్ డీసీపీ ఉమాపతి నుదుటిని తాకింది. అంతే… నుదుటి నుంచి రక్తం ధారగా కారింది.
ఆ రోజు జరిగిన దాడిలో ఉమాపతితో పాటు టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డీసీపీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ , ఏసీపీ హమీద్, 50మంది అధికారులు, సిబ్బంది గాయపడ్డారు.
అప్పటివరకు ఎంతో ఓపికగా పరిస్థితిని గమనిస్తున్న రాములు గారు ఉమాపతి నుదుటి నుంచి రక్తం కారుతున్న దృశ్యం చూడగానే లాఠీ చేతిలోకి తీసుకున్నారు. “చార్జ్!” అంటూ స్వయంగా ముందుకు దూకారు. ఆయనతో పాటు అరవిందరావు, ఇక్బాల్ వారి టాస్క్ ఫోర్స్ టీమ్ కదిలింది. స్వయంగా కమిషనర్ ముందుకు వెళుతుంటే పోలీసు బలగాలు వెనుక ఎలా ఉంటాయి? అంతే… కొన్ని క్షణాల్లో సీన్ మారిపోయింది. పోలీసులు ముందుకు దూసుకెళ్లారు. మసీదు గేట్లను దాటి లోపలికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఆ తర్వాత మరో వివాదం. పవిత్రమైన మసీదులోకి పోలీసులు బూట్లతో ప్రవేశించడంపై అసదుద్దీన్ ఒవైసీ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు నాకు గుర్తు. దానికి రాములు గారు ఇచ్చిన సమాధానం నా జ్ఞాపకాల్లో ఇప్పటికీ చెరిగిపోలేదు. “పవిత్రమైన మందిరం నుంచి పోలీసులపై రాళ్లు విసిరితే… మేం ఎక్కడికైనా వస్తాం.”
ఆ రోజు ఘటన సద్దుమణిగింది. కానీ నా జ్ఞాపకం అక్కడితో ముగియలేదు. రాళ్ల వర్షం… మండుతున్న పెట్రోల్ బాంబు… ఉమాపతి నుదుటి నుంచి కారుతున్న రక్తం… గాయపడిన హమీద్, ఇక్బాల్ సహా పోలీసు అధికారులు… లాఠీ పట్టుకుని ముందుకు దూకిన కొత్వాల్… ఆ ఉద్రిక్తత ఇంకా శరీరంలో నుంచి దిగలేదు.
అంతా సద్దుమణిగిన తర్వాత చార్మినార్ పోలీస్‌స్టేషన్ పై అంతస్తుకు వెళ్లాం. అక్కడ నేను… నా పెద్దన్న రాములు గారు… ఒక్కో సిగరెట్ వెలిగించాం. పెద్దగా మాటల్లేవు. కింద ఇంకా పోలీసుల హడావుడి. పైన మాత్రం ఇద్దరి మధ్య సిగరెట్ పొగ. ఆ రోజు ఆ పొగలో కలిసిపోయింది సిగరెట్ మాత్రమే కాదు… కొన్ని గంటలుగా లోపల పేరుకుపోయిన టెన్షన్ కూడా.
కాలం గిర్రున తిరిగింది. దాదాపు పాతికేళ్లు గడిచిపోయాయి. ఈ రోజు రాములు గారి ఇంటికి వెళ్లాను. వయసు ఇద్దరినీ మార్చింది. కాలం ఎన్నో మార్పులు తెచ్చింది. హోదాలు గతమయ్యాయి. కానీ అనుబంధం మాత్రం అలాగే ఉంది.
ఆయన పక్కన కూర్చుని ఆనాటి మక్కా మసీదు సంఘటనను గుర్తుచేశాను. కాళ్ల ముందు పేలిన పెట్రోల్ బాంబు… పేలుడు ధాటికి ఎగిరిన రాయి పెళ్ల ఉమాపతి నుదుటిని తాకడం… ఆయన ఇచ్చిన “చార్జ్” ఆదేశం… చివరకు చార్మినార్ పోలీస్‌స్టేషన్ పై అంతస్తులో ఇద్దరం కాల్చిన సిగరెట్… ఒక్కొక్క జ్ఞాపకాన్ని తిరగేస్తుంటే పాతికేళ్ల కాలం ఒక్కసారిగా కరిగిపోయినట్టనిపించింది.
ఆ జ్ఞాపకాల మధ్య రాములు గారు ప్రేమతో తాను రచించిన ‘పోలీస్ చమత్కారాలు’ పుస్తకాన్ని నా చేతుల్లో పెట్టారు. ఆ క్షణంలో నాకు ఒక్కటే అనిపించింది.
ఆ రోజు ఆయన చేతిలో లాఠీ… ఈ రోజు ఆయన చేతిలో పుస్తకం
నాడు మక్కా మసీదు ముందు ఆయన కాళ్ల దగ్గర పెట్రోల్ బాంబు మంట చూశాను. అదే రోజు చార్మినార్ పోలీస్‌స్టేషన్ పైన ఆయనతో కలిసి సిగరెట్ పొగ చూశాను. పాతికేళ్ల తర్వాత ఈ రోజు ఆయన ఇంట్లో పక్కన కూర్చుని… ఆ చేతుల నుంచే ప్రేమగా ఒక పుస్తకం అందుకున్నాను.
జర్నలిస్టు జీవితంలో వార్తలు వేలుంటాయి. కానీ కొన్ని వార్తలే జ్ఞాపకాలవుతాయి. కొంతమంది అధికారులే ఆత్మీయులవుతారు. కొన్ని అనుబంధాలకు మాత్రం పదవీ విరమణ ఉండదు.

నాడు మంటల మధ్య… నేడు జ్ఞాపకాల మధ్య… మధ్యలో పాతికేళ్లు!
— వేముల సత్యనారాయణ
క్రైమ్ జర్నలిస్టు జ్ఞాపకాల నుంచి
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jagtial CDPO ACB Trap | అంగన్వాడీ కేంద్రాలపై నెలవారీ మామూళ్లు: రూ.63,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మెట్పల్లి సీడీపీవో
- ●Gadala Srinivasa Rao | జనసేన తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీగా గడల శ్రీనివాసరావు
- ●Borabanda Belt Shop PD Act | ఆడవాళ్లైతే ఏంది?... తప్పుడు పనులు చేస్తే.. బయటికి రాకుండా జైలు
- ●Best Selling EVs | టాటా పంచ్‌ను దాటేసిన మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్
- ●Manmohan Singh | భారతదేశం గర్వించదగ్గ జాతిరత్నం మన్మోహన్ : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Bangkok | బ్యాంకాక్ టూర్‌కి ప్లాన్ చేస్తున్నారా? ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తే వెంటనే క్యాన్సిల్ చేసుకోండి

Jagtial CDPO ACB Trap | అంగన్వాడీ కేంద్రాలపై నెలవారీ మామూళ్లు: రూ.63,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మెట్పల్లి సీడీపీవో

Gadala Srinivasa Rao | జనసేన తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీగా గడల శ్రీనివాసరావు

Borabanda Belt Shop PD Act | ఆడవాళ్లైతే ఏంది?... తప్పుడు పనులు చేస్తే.. బయటికి రాకుండా జైలు

Best Selling EVs | టాటా పంచ్‌ను దాటేసిన మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్




