త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Madhu Yashki Goud | కవితను చేర్చుకునే దుస్థితి కాంగ్రెస్‌కు లేదు.. ఆ పోలీసుల తీరు మారాలి: మధు యాష్కీ గౌడ్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, పోలీసుల పనితీరుపై కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కవితను పార్టీలో చేర్చుకునే అవసరం కాంగ్రెస్ కు లేదని స్పష్టం చేశారు. కొందరు పోలీసులు ఇంకా గత ప్రభుత్వ హయాంలోలాగే పనిచేస్తున్నారని, అర్ధరాత్రి అరెస్టులతో ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు.

J

Hyderabad | Published On Jan 28, 2026, 10.00 pm IST

Madhu Yashki Goud | కవితను చేర్చుకునే దుస్థితి కాంగ్రెస్‌కు లేదు.. ఆ పోలీసుల తీరు మారాలి: మధు యాష్కీ గౌడ్

సంక్షిప్త సారాంశం

గాంధీ భవన్‌లో జరిగిన చిట్‌చాట్‌లో మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ బీఆర్ఎస్ నేతలు, పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే కేటీఆర్, హరీష్ రావు, కవితలు ఆస్తులు కూడబెట్టుకున్నారని ఆరోపించారు. లిక్కర్ స్కామ్‌లో ఉన్న కవితను కాంగ్రెస్‌లో చేర్చుకునే దుస్థితి తమకు లేదని తేల్చిచెప్పారు. అలాగే, కొందరు పోలీస్ అధికారులు అర్ధరాత్రి అరెస్టులు చేస్తూ, లా అండ్ ఆర్డర్ కంటే సెటిల్మెంట్లపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు పాత నేతలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

Advertisement

Madhu Yashki Goud | త్రినేత్ర.న్యూస్: మాజీ ఎంపీ, టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్.. బీఆర్ఎస్ నేతలు, రాష్ట్రంలోని కొందరు పోలీస్ అధికారుల పనితీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్‌లో జరిగిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు బలహీనపడ్డాయని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితపై, పోలీసుల వ్యవహార శైలిపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కవితను చేర్చుకునే ప్రసక్తే లేదు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై మధు యాష్కీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కున్న కవితను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే దుస్థితి తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. కవిత బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడే ఆ పార్టీని మట్టికరిపించామని, ఇప్పుడు ఆమెను తీసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్‌కు లేదని తేల్చిచెప్పారు. తెలంగాణ ప్రజలు ఉద్యమాల్లో ప్రాణత్యాగాలు చేసుకుంటున్న సమయంలో.. కేటీఆర్, హరీష్ రావు, కవితలు అమెరికాలో కంపెనీలు పెట్టుకున్నారని (2010లో) ఆరోపించారు. కవిత ఉద్యమ సమయంలోనూ, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాక కూడా భారీగా సంపాదించారని, రూ. 3000 కోట్లతో రాజభవంతి కట్టుకున్నారని విమర్శించారు. ఆమె జిల్లాకో పీఏను పెట్టుకుని చక్రం తిప్పారని మండిపడ్డారు.

పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల్లా మారుతున్నారు

రాష్ట్రంలోని కొందరు పోలీస్ అధికారుల తీరుపై మధు యాష్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పోలీసులు ఆ పార్టీ కార్యకర్తల్లా పనిచేశారని, అక్రమంగా సంపాదించారని ఆరోపించారు. గతంలో 'ఫ్రెండ్లీ పోలీస్' అంటే డ్రగ్స్ పెడ్లర్లకు ఫ్రెండ్లీగా ఉండటమేనా అని ప్రశ్నించారు. ప్రస్తుతం కొందరు అధికారులు హెడ్ లైన్లలో నిలిచేందుకు, వార్తల్లో హైలెట్ అయ్యేందుకు అర్ధరాత్రి అరెస్టులు చేస్తున్నారని, తద్వారా ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఏ కేసైనా చట్టప్రకారం, ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్లమని చెబుతుంటే.. అధికారులు మాత్రం దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. లా అండ్ ఆర్డర్ కాపాడటం మానేసి ల్యాండ్ సెటిల్మెంట్లపై దృష్టి పెడుతున్నారని, ఇలాంటి చర్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ప్రభుత్వం మారిందన్న విషయాన్ని అధికారులు గుర్తుపెట్టుకుని రాజ్యాంగబద్ధంగా పనిచేయాలని హితవు పలికారు.

అవినీతి ఆరోపణలు - పార్టీ సమన్వయం

నైనీ కోల్ బ్లాక్ విషయంలో టెండర్ల కేటాయింపు జరగలేదని, బొగ్గు తీయలేదని, అలాంటప్పుడు స్కాం ఎలా జరుగుతుందని మధు యాష్కీ ప్రశ్నించారు. గతంలో 2జీ స్కాం, నేషనల్ హెరాల్డ్ కేసుల్లో సోనియా, రాహుల్ గాంధీలకు ఒక్క రూపాయి ముట్టినట్లు బీజేపీ నిరూపించలేకపోయిందని గుర్తుచేశారు.

పార్టీలో చేరిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలు పాత కాంగ్రెస్ నేతలను కలుపుకుపోవాలని సూచించారు. అభివృద్ధి కోసం పార్టీలో చేరిన వారు కాంగ్రెస్ పార్టీని బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటే కుదరదన్నారు. పార్టీని సమన్వయం చేసే బాధ్యత ఇన్చార్జి మంత్రులపై ఉందని, త్వరలోనే సమన్వయ కమిటీ వేయాలని కోరారు. సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని, కేసీఆర్ ఎన్ని ఆఫర్లు ఇచ్చినా పార్టీ మారలేదని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు పార్టీ మారుతారని అనుకోవడం అవివేకమని కొట్టిపారేశారు. ముఖ్యమంత్రికి, మంత్రులకు మధ్య పూర్తి సమన్వయం ఉందని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement