త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Congress Zero Seats MLC Polls | బ్యాలెట్ సమరంలో ‘హస్తం’ విలవిల.. 4 రాష్ట్రాలు.. 28 స్థానాలు.. కాంగ్రెస్ ‘జీరో’

నాలుగు రాష్ట్రాల్లో జరిగిన 28 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా తెరవలేకపోయింది. సొంత పాలన ఉన్న కర్ణాటకలోనూ క్లీన్ స్వీప్ కావడంతో హస్తం పార్టీ తీవ్ర ఇరకాటంలో పడింది.

J

National | Published On Oct 28, 2026, 8.46 pm IST

Congress Zero Seats MLC Polls | బ్యాలెట్ సమరంలో ‘హస్తం’ విలవిల.. 4 రాష్ట్రాలు.. 28 స్థానాలు.. కాంగ్రెస్ ‘జీరో’
Advertisement
  • కర్ణాటక, యూపీ, బిహార్, మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘోర పరాభవం
  • పాలనలో ఉన్న కర్ణాటకలోనే 4 స్థానాలూ ఊడ్చేసిన బీజేపీ-జేడీఎస్ కూటమి
  • ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే స్వంత ఇలాకాలోనే బీజేపీ అభ్యర్థి ఘన విజయం
  • "ఇట్స్ డన్ బ్రో" అంటూ డీకేఎస్‌పై విరుచుకుపడ్డ కమలనాథులు
  • ప్రధాని మోదీ చురకలు

Congress Zero Seats MLC Polls | త్రినేత్ర న్యూస్ : దేశవ్యాప్తంగా నాలుగు ప్రధాన రాష్ట్రాల్లో జరిగిన శాసనమండలి ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చాయి. కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్రల్లోని మొత్తం 28 పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్ ఒక్కటంటే ఒక్క స్థానం కూడా గెలవలేక పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఈ ఫలితాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు బీజేపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాయి.

ఈ ఎన్నికలు బ్యాలెట్ పేపర్లతో నిర్వహించినప్పటికీ కాంగ్రెస్ సున్నా సీట్లకే పరిమితమైందని, చివరికి అధికారంలో ఉన్న కర్ణాటకలోనూ ప్రజలు ఆ పార్టీని పూర్తిగా తిరస్కరించారని మోదీ ఎద్దేవా చేశారు. సాధారణంగా ఎన్నికల్లో ఓడిపోయినప్పుడల్లా ఈవీఎంలను నిందించే కాంగ్రెస్‌కు.. విద్యావంతులు, ఉపాధ్యాయులు బ్యాలెట్ ద్వారా ఇచ్చిన ఈ తీర్పు ఆ పార్టీ సంస్థాగత వైఫల్యానికి నిదర్శనమని ప్రధాని మోదీ చురకలంటించారు.

కర్ణాటకలో కోలుకోలేని దెబ్బ: బీజేపీ-జేడీఎస్ క్లీన్‌స్వీప్

ఈ ఫలితాల్లో కాంగ్రెస్‌కు అత్యంత చేదు అనుభవం కర్ణాటకలోనే ఎదురైంది. సొంత ప్రభుత్వం, అధికార యంత్రాంగం అండగా ఉన్నప్పటికీ అక్కడ ఖాళీ అయిన మొత్తం 4 ఎమ్మెల్సీ స్థానాలనూ ఎన్డీయే (బీజేపీ-జేడీఎస్) కూటమి కైవసం చేసుకుంది.

కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ పుట్టన్నపై జేడీఎస్ అభ్యర్థి ఏపీ రంగనాథ్ 908 ఓట్ల తేడాతో గెలిచి సీటును ఎగరేసుకుపోయారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత ప్రాంతమైన కలబురగి పరిధిలోని నార్త్-ఈస్ట్ టీచర్స్ స్థానాన్ని బీజేపీ అభ్యర్థి శశిల్ నమౌషి నిలబెట్టుకున్నారు. వెస్ట్ గ్రాడ్యుయేట్స్ స్థానంలో ఎస్వీ సంకనూర్, సౌత్-ఈస్ట్ గ్రాడ్యుయేట్స్‌లో కేఎం సురేష్ విజయం సాధించారు.

'ఇట్స్ డన్ బ్రో'.. బీజేపీ సెటైర్లు

ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంత్రులను సైతం మోహరించి ప్రచారం చేయించినా విద్యావంతులు, ఉద్యోగుల నుంచి కాంగ్రెస్‌కు మొండిచేయి ఎదురైంది. ఫలితాల అనంతరం కర్ణాటక బీజేపీ "డీకే, ఇట్స్ డన్ బ్రో!" అంటూ అసెంబ్లీలో ఆయన చెవిలో పువ్వు పెట్టుకున్న పాత ఫోటోను షేర్ చేస్తూ ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ గ్యారెంటీలు, పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, 2028 అసెంబ్లీ ఎన్నికలకు ఇదొక దిశానిర్దేశమని జేడీఎస్ చీఫ్ హెచ్‌డీ కుమారస్వామి పేర్కొన్నారు.

మిగతా రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి

11 స్థానాల్లో ఎన్నికలు జరిగిన ఉత్తరప్రదేశ్‌లో మీరట్, లక్నో, బరేలీ వంటి చోట్ల బీజేపీ పట్టు నిలుపుకోగా.. వారణాసి, ఆగ్రా టీచర్స్ స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) గెలిచింది. కాంగ్రెస్ ఎక్కడా ప్రభావం చూపలేకపోయింది. 8 స్థానాల్లో జరిగిన బిహార్‌లో సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ మదన్ మోహన్ ఝా ఉన్న దర్భంగాలో ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని 'జన్ సురాజ్ పార్టీ' విజయం సాధించి తొలిసారి మండలిలో అడుగుపెట్టింది. ఆర్జేడీ, బీజేపీ, స్వతంత్రులు ఇతర స్థానాలను దక్కించుకున్నారు. 5 స్థానాల్లో జరిగిన మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి ఆధిక్యంలో ఉంది.

బ్యాలెట్ పేపర్లతో జరిగిన ఈ ఎన్నికల్లో విద్యావంతులు, ఉపాధ్యాయ ఓటర్లు కాంగ్రెస్‌కు ఏ ఒక్క స్థానంలోనూ అవకాశం ఇవ్వకపోవడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. రాబోయే ఎన్నికలకు సంస్థాగత వైఫల్యాలపై కాంగ్రెస్ పునరాలోచన చేసుకోవాల్సిన సమయం వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

Advertisement
Advertisement