Hayathnagar | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగర శివార్లలోని హయత్‌నగర్‌లో స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో విజయవాడ - హైదరాబాద్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ జాతీయ రహదారిపై హయత్‌నగర్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. గత కొంతకాలం నుంచి హయత్ నగర్‌లో హైవేపై తరుచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానికంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేకపోవడంతో.. స్థానికులు రోడ్డు దాటే క్రమంలో వారిని వాహనాలు ఢీకొడుతున్నాయి. దీంతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల ఎంబీబీఎస్ విద్యార్థిని హయత్‌నగర్‌లో రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హయత్ నగర్ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి, మన్సురాబాద్ కార్పొరేటర్ నరసింహారెడ్డితో పాటు జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. ఇది జాతీయ రహదారా..? మృత్యు రహదారా..? అంటూ నినాదాలు చేశారు. స్థానికుల ఆందోళనతో హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకుని స్థానికులకు సర్దిచెప్పి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.