త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Arrive Alive Cyberabad | అంబులెన్స్ అవసరం లేని రోడ్లు మన లక్ష్యం కావాలి.. గమ్యస్థానానికి సురక్షితంగా చేరుదాం: సైబరాబాద్ సీపీ

రోడ్డు ప్రమాదాలను నివారించి, వాహనదారులంతా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేలా సైబరాబాద్ పోలీసులు ప్రతిష్టాత్మకంగా ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీ డాక్టర్ ఎం. రమేష్ ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్ ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు.

J

Hyderabad | Published On Apr 13, 2026, 9.51 pm IST

Arrive Alive Cyberabad | అంబులెన్స్ అవసరం లేని రోడ్లు మన లక్ష్యం కావాలి.. గమ్యస్థానానికి సురక్షితంగా చేరుదాం: సైబరాబాద్ సీపీ

సంక్షిప్త సారాంశం

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా సైబరాబాద్ పోలీసులు గచ్చిబౌలిలో 'అరైవ్ అలైవ్' కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్న పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్.. రక్తసిక్తమైన రోడ్లను చూడటం తమకు ఏమాత్రం ఇష్టం లేదని, అంబులెన్సులు అవసరం లేని రోడ్డు వ్యవస్థను నిర్మించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు. హెల్మెట్ స్ట్రాప్ పెట్టుకోవడం, సీటు బెల్ట్ ధరించడం, డిఫెన్సివ్ డ్రైవింగ్ ప్రాముఖ్యతను ఆయన వివరించారు. ఓపికగా వాహనాలు నడుపుతూ, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. ఏప్రిల్ 13 నుంచి 18 వరకు ఈ అవగాహన కార్యక్రమాలు కొనసాగనున్నాయి.

Advertisement

Arrive Alive Cyberabad | త్రినేత్ర.న్యూస్ : "రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రతి వాహనదారుడు సురక్షితంగా తమ ఇళ్లకు చేరుకోవాలి. రక్తసిక్తమైన రోడ్లను చూడటం పోలీసులకు ఏమాత్రం ఇష్టం లేదు. అంబులెన్సులు అవసరం లేని రోడ్డు వ్యవస్థను నిర్మించడం ప్రతి ఒక్కరి బాధ్యత కావాలి.." అని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ పిలుపునిచ్చారు.

సైబరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో గచ్చిబౌలిలో ఈరోజు "అరైవ్ అలైవ్" (Arrive Alive) అవగాహనా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్న సీపీ రమేష్.. ద్విచక్ర వాహనదారులు, పాదచారులు, కారు డ్రైవర్లతో నేరుగా ముచ్చటించి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.

హెల్మెట్ స్ట్రాప్ (బెల్ట్) తప్పనిసరి

ద్విచక్ర వాహనదారుల భద్రత గురించి సీపీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. హెల్మెట్ ధరించడం కేవలం ఒక చలాన్ నిబంధన మాత్రమే కాదని, అది ప్రాణ రక్షణ కవచమని గుర్తుచేశారు. కేవలం హెల్మెట్ పెట్టుకుంటే సరిపోదని, దానికి ఉన్న స్ట్రాప్ (బెల్ట్) తప్పనిసరిగా బిగించాలని సూచించారు. లేనిపక్షంలో ప్రమాదం జరిగిన వెంటనే అది ఎగిరిపోయి ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందన్నారు. బైక్ నడిపే వారే కాకుండా వెనుక కూర్చునే వారు, 4 ఏళ్లు పైబడిన పిల్లలు కూడా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారందరూ సీటు బెల్టు పెట్టుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

Let us Build an Ambulance-Free Road System Cyberabad CP M Ramesh Launches Arrive Alive Campaign

'డిఫెన్సివ్ డ్రైవింగ్' కీలకం

రోడ్డు ప్రమాదాలను నివారించడంలో ‘డిఫెన్సివ్ డ్రైవింగ్’ (రక్షణాత్మక డ్రైవింగ్) కీలక పాత్ర పోషిస్తుందని సీపీ పేర్కొన్నారు. అనుభవజ్ఞులైన డ్రైవర్లు కూడా పొరపాట్లు చేసే అవకాశం ఉన్నందున, ఎదుటివారి తప్పులను కూడా ముందే ఊహించి వాహనాన్ని నియంత్రించడమే డిఫెన్సివ్ డ్రైవింగ్ అని తెలిపారు.

  • రాత్రి వేళల్లో ప్రయాణించేటప్పుడు రిఫ్లెక్టివ్ దుస్తులు ధరించాలి.
  • చిన్న రోడ్ల నుండి ప్రధాన రహదారుల్లోకి వచ్చేటప్పుడు ఇరువైపులా గమనించాలి.
  • రోడ్డుపై వెళ్లే చిన్నపిల్లలు, వృద్ధులు, పాదచారుల పట్ల వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి.
  • కూడళ్ల వద్ద జంక్షన్ల దగ్గర పోలీసు సిబ్బంది సహకారంతో జాగ్రత్తగా రోడ్డు దాటాలి.
  • భారీ వాహనాలు రహదారికి ఎడమ వైపున మాత్రమే ప్రయాణించాలి, ఆకస్మికంగా ఓవర్ టేక్ చేయకూడదు.

అతివేగం, డ్రంక్ అండ్ డ్రైవ్ పై ఉక్కుపాదం

అతివేగంగా, మద్యం సేవించి వాహనం నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. వేగం పెరిగే కొద్దీ ప్రమాద తీవ్రత పెరుగుతుందని, పాఠశాలలు, ఆసుపత్రుల వద్ద వేగ పరిమితిని తప్పక పాటించాలన్నారు. సుదీర్ఘ ప్రయాణాలు చేసే వారు ప్రతి 2 గంటలకు ఒకసారి విరామం తీసుకుంటే ఏకాగ్రత దెబ్బతినకుండా ఉంటుందని సూచించారు. డ్రైవింగ్ చేసేటప్పుడు కోపం, అసహనం పక్కనపెట్టి, తోటి ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలని, హారన్ మోగించి అనవసరంగా ఇబ్బంది పెట్టొద్దని కోరారు.

Let us Build an Ambulance-Free Road System Cyberabad CP M Ramesh Launches Arrive Alive Campaign

ఏప్రిల్ 13 నుండి 18 వరకు జరగనున్న ఈ అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో మరింత చైతన్యం రావాలని సీపీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్-1 డీసీపీ రంజన్ రతన్ కుమార్, ట్రాఫిక్-1 అదనపు డీసీపీ హనుమంతరావు, మాధాపూర్ ట్రాఫిక్ డివిజన్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి, గచ్చిబౌలి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సురేష్, రాయదుర్గం ట్రాఫిక్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ హనిమిరెడ్డి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement