త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HYDRAA recovers 1511 crore land | హైడ్రా మెరుపు దాడులు: ఒక్కరోజే రూ.1,511 కోట్ల ఆస్తులు స్వాధీనం.. చెరువులు, పార్కులకు విముక్తి..!

హైదరాబాద్‌లో హైడ్రా మరోసారి విరుచుకుపడింది. మంగళవారం ఒక్కరోజే నగరంలోని నాలుగు చోట్ల మెరుపు దాడులు చేసి రూ. 1,511 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులను కాపాడింది. కొండాపూర్, అల్వాల్‌తో పాటు మరో రెండు చోట్ల జరిగిన ఈ ఆపరేషన్ పూర్తి వివరాలు ఇవే.

J

Hyderabad | Published On Feb 10, 2026, 11.00 pm IST

HYDRAA recovers 1511 crore land | హైడ్రా మెరుపు దాడులు: ఒక్కరోజే రూ.1,511 కోట్ల ఆస్తులు స్వాధీనం.. చెరువులు, పార్కులకు విముక్తి..!
Advertisement

HYDRAA recovers 1511 crore land | నగరంలో ప్రభుత్వ ఆస్తులు, జలవనరుల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడిన 'హైడ్రా' (HYDRAA) తన దూకుడును కొనసాగిస్తోంది. ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ మంగళవారం (ఫిబ్రవరి 10) ఒక్కరోజే భారీ ఆపరేషన్ నిర్వహించింది. నగరానికి నలువైపులా నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో దాడులు చేసి సుమారు రూ.1,511 కోట్ల విలువైన భూములను కాపాడింది. ఇందులో 12 ఎకరాల చెరువు భూములు, 1,100 గజాల పార్కు స్థలాలు ఉన్నాయి.

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ (AV Ranganath) ఆదేశాల మేరకు జరిగిన ఈ ఆపరేషన్ వివరాలు ఇలా ఉన్నాయి:

1. కొండాపూర్‌లో రూ.700 కోట్ల విలువైన చెరువు రక్షణ

శేరిలింగంపల్లి మున్సిపల్ పరిధిలోని కొండాపూర్ - మదీనాగూడ రోడ్డులో ఉన్న 4 ఎకరాల 'జంగం కుంట' (Jangam Kunta) ఆక్రమణకు గురైంది. కబ్జాదారులు చెరువును మట్టితో పూడ్చేసి, చదును చేసి ప్లాట్లుగా విక్రయించడానికి సిద్ధమయ్యారు. దీని విలువ సుమారు రూ. 700 కోట్లు ఉంటుందని అంచనా. మీడియాలో వచ్చిన కథనాలు, ఫిర్యాదుల మేరకు హైడ్రా, రెవెన్యూ అధికారులు జాయింట్ ఇన్‌స్పెక్షన్ చేశారు. ఆక్రమణలను తొలగించి, చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేశారు. కబ్జాదారులపై కేసులు కూడా నమోదు చేశారు.

2. అల్వాల్ కొత్త చెరువులో 8 ఎకరాల క్లియరెన్స్

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అల్వాల్‌లోని 'కొత్త చెరువు' (Kotha Cheruvu) ఎఫ్‌టీఎల్ (FTL) పరిధిలో భారీ ఆక్రమణలను హైడ్రా తొలగించింది. సుమారు 8 ఎకరాల మేర చెరువు స్థలాన్ని ఆక్రమించి ప్లాస్టిక్ కంపెనీలు, షెడ్లు నిర్మించి కాలుష్యం చేస్తున్నారని ప్రజావాణిలో ఫిర్యాదులు వచ్చాయి. విచారణ జరిపిన హైడ్రా అధికారులు, మంగళవారం 4 భారీ షెడ్లను కూల్చివేసి చెరువు భూమిని స్వాధీనం చేసుకున్నారు.

3. వనస్థలిపురంలో పార్కు స్థలం స్వాధీనం

రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం, సాహేబ్‌నగర్ కలాన్‌లోని జక్కిడి కాలనీలో 650 గజాల పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడింది. 1982లో వేసిన లేఅవుట్‌లో పార్కు కోసం కేటాయించిన స్థలాన్ని (సర్వే నం. 132, 133) కొందరు ఆక్రమించి కాంపౌండ్ వాల్, షెడ్లు నిర్మించారు. వీటిని కూల్చివేసిన హైడ్రా అధికారులు, పార్కు చుట్టూ ఫెన్సింగ్ వేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.

4. మౌలాలిలో ఆక్రమణల కూల్చివేత

మల్కాజిగిరి జోన్, మౌలాలి పరిధిలోని కాకతీయ నగర్ - రాధాకృష్ణ హౌసింగ్ కాలనీలో 450 గజాల పార్కు స్థలాన్ని హైడ్రా రక్షించింది. గతంలోనే జీహెచ్‌ఎంసీకి గిఫ్ట్ డీడ్‌గా ఇచ్చిన ఈ స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన రేకుల షెడ్లు, ప్రహరీ గోడను అధికారులు నేలమట్టం చేశారు.

హైడ్రా సీరియస్ వార్నింగ్

చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని హైడ్రా స్పష్టం చేసింది. ఆక్రమణలు ఎంతటి వారివైనా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, కూల్చివేతలు ఆగవని అధికారులు హెచ్చరించారు.

https://x.com/Comm_HYDRAA/status/2021214770918220125

 

Advertisement
Advertisement