త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే ధ్యేయం : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | మహిళల ఆర్థిక స్వావలంబన, ఆరోగ్యం, విద్యకు తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఫుడ్స్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన బాలామృతం ప్లాంట్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ 2034 నాటికి కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని వెల్లడించారు.

P

Telangana | Published On Jul 7, 2026, 8.22 pm IST

CM Revanth Reddy | ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే ధ్యేయం : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy | మహిళల ఆర్థిక స్వావలంబన, ఆరోగ్యం, విద్యకు తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఫుడ్స్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన బాలామృతం ప్లాంట్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ 2034 నాటికి కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని వెల్లడించారు. గ‌ర్భిణుల‌కు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో అప్పట్లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రారంభించిన కార్యక్రమం అంచెలంచెలుగా అభివృద్ధి చెంది పరిశ్రమ స్థాయికి చేరుకుందని సీఎం గుర్తుచేశారు. ఇవాళ కొత్త బాలామృతం ప్లాంట్‌ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. దేశ రాజకీయాల్లో మహిళలు తమ సత్తా చాటారని సీఎం పేర్కొన్నారు. ఇందిరాగాంధీ, సోనియాగాంధీ, ప్రియాంకాగాంధీ నుంచి మంత్రి సీతక్క వరకు మహిళలు అన్ని రంగాల్లో రాణించి ఆదర్శంగా నిలిచార‌న్నారు.

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీలో 2 కోట్లకు పైగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరుతోనే అందిస్తున్నామని చెప్పారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 3 కోట్ల 28 లక్షల మంది తెలంగాణ బిడ్డలకు ప్రభుత్వం సన్నబియ్యం అందిస్తోందని సీఎం చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో పేదలకు అండగా నిలిచేందుకు లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా చర్యలు తీసుకుంటున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. వెయ్యి బస్సులకు మహిళలను యజమానులుగా చేశామని, వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టును మహిళలకు అప్పగించామని వెల్లడించారు.

ఆడబిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు వారి ఆరోగ్యంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టిందని సీఎం అన్నారు. గర్భిణీలకు పౌష్టికాహారం అందించేందుకు బాలమృతం కొత్త ప్లాంట్‌ను ప్రారంభించామని తెలిపారు. అభివృద్ధి చెందిన ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పేద పిల్లలు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించామని రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు కూడా బ్రేక్‌ఫాస్ట్, లంచ్ సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దుతున్నామని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం అన్నారు. విద్య, ఆరోగ్యంపై చేసే ఖర్చును ప్రభుత్వం భారంగా భావించడం లేదని, అది భవిష్యత్ తరాలపై పెట్టుబడిగా చూస్తోందని పేర్కొన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాకుండా విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.

Advertisement
Advertisement