త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy Kaleshwaram | ఎలాంటి భూ పరీక్ష చేయకుండా ఇసుకపై బ్యారేజీలు నిర్మిస్తే ఇలాగే ఉంటది

కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను 'ఆర్థిక ఉగ్రవాదులు'గా అభివర్ణించారు.

J

Telangana | Published On Jul 7, 2026, 9.05 pm IST

Revanth Reddy Kaleshwaram | ఎలాంటి భూ పరీక్ష చేయకుండా ఇసుకపై బ్యారేజీలు నిర్మిస్తే ఇలాగే ఉంటది
Advertisement
  • కాళేశ్వరం కాదు.. అది కమీషన్ల ప్రాజెక్టు
  • కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తెలంగాణకు పట్టిన ఆర్థిక ఉగ్రవాదులు
  • డిజైన్, మెయింటెనెన్స్ లోపం వల్లే కుంగిపోయాయని విమర్శలు
  • కాళేశ్వరంపై చర్చకు కేసీఆర్ ఎప్పుడొచ్చినా జాయింట్ సెషన్ నిర్వహించేందుకు సిద్ధమని సవాల్
  • వైఎస్సార్ హయాంలో మొదలుపెట్టిన 'ప్రాణహిత-చేవెళ్ల'ను కేవలం కమిషన్ల కోసమే రీ-డిజైన్ పేరుతో రూ.81 వేల కోట్లకు పెంచారని ఆరోపణ
  • కేసీఆర్, కేటీఆర్‌లపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Revanth Reddy Kaleshwaram | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర రాజకీయాల్లో కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టు ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. తమ తప్పును కప్పిపుచ్చుకుని రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ (BRS) నేతలు ఆరాటపడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజాభవన్‌లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమర్పించిన ఆధారాలు, నివేదికలపై సీఎం స్పందించారు. ఈ ప్రాజెక్టు విధ్వంసానికి కారణమైన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను రాష్ట్రానికి పట్టిన 'ఆర్థిక ఉగ్రవాదులు' (Economic Terrorists) గా అభివర్ణించారు.

కమిషన్ల కోసమే రీ-డిజైన్ డ్రామా

గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 16.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 39 వేల కోట్ల అంచనాతో 'డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల' ప్రాజెక్టును ప్రారంభించారని సీఎం గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడే నాటికి ఆ ప్రాజెక్టుపై 6 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారని తెలిపారు. కానీ, ఆ తర్వాత కేసీఆర్ కమిషన్ల కక్కుర్తితో ప్రాజెక్టు ఊరు, పేరు మార్చేశారని మండిపడ్డారు. 2015లో వేసిన ఎక్స్‌పర్ట్ కమిటీ మేడిగడ్డ వద్ద బ్యారేజీ వద్దని నివేదిక ఇచ్చినా పక్కనపెట్టి.. తనకు కావాల్సిన రిపోర్ట్‌ను వ్యాప్కోస్ (WAPCOS) సంస్థతో ఇప్పించుకున్నారని ఆరోపించారు. నీళ్లు, ఆయకట్టు పెరగకపోయినా.. అంచనాలు మాత్రం 38 వేల కోట్ల నుంచి 81 వేల కోట్లకు పెంచేశారని దుయ్యబట్టారు.

ఇసుకపై కట్టిన మేడ.. ఏడాదికే బీటలు

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ సమయంలో కనీస భూ పరీక్షలు (Soil tests) చేయలేదని సీఎం రేవంత్ మండిపడ్డారు. ఇసుకపై మేడలు కట్టినట్లుగా కేసీఆర్ బ్యారేజీలు నిర్మించారని ఎద్దేవా చేశారు. ప్లానింగ్, డిజైన్ (Design), క్వాలిటీ, ఆపరేషనల్ మెయింటెనెన్స్ (Maintenance) సరిగా లేకపోవడం వల్లే ఈ దుస్థితి దాపురించిందన్నారు. 2019 జూన్ లో ప్రాజెక్టును ప్రారంభిస్తే.. ఏడాదికే మేడిగడ్డ దెబ్బతిందని ఇంజనీర్లు చెప్పినా కేసీఆర్ సర్కార్ పట్టించుకోలేదన్నారు. నాణ్యత లేకపోవడం వల్లే 2022లో కన్నెపల్లి పంప్ హౌస్ మునిగిపోయిందని, బీఆర్ఎస్ హయాంలోనే NDSA ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఈ లోపాలను ఎత్తిచూపిందని స్పష్టం చేశారు.

అసెంబ్లీకి రండి.. తేల్చుకుందాం

కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ అనేది వెన్నెముక లాంటిదని, అది పనిచేయకపోతే ప్రాజెక్టు మొత్తం వృథానే అని రేవంత్ అన్నారు. వర్షాలు లేకపోయినా, ఎల్ నినో (El Nino) ప్రభావం ఉన్నా మోటార్లు వేసి నీళ్లు ఎత్తిపోస్తాం అంటూ హరీష్ రావు మాట్లాడుతున్న మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. కేసీఆర్ కోరుకున్న రోజున అసెంబ్లీలో జాయింట్ సెషన్ (Joint Session) ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సవాల్ విసిరారు. "స్పీకర్‌కు లేఖ రాయండి.. తేదీ ఖరారు చేయండి. మీ గౌరవానికి భంగం కలగకుండా సభను సజావుగా సాగేలా చూసుకునే బాధ్యత మాది" అని సీఎం స్పష్టం చేశారు.

తొమ్మిదిన్నరేళ్లలో ఎనిమిది లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి రాష్ట్రాన్ని నాశనం చేశారని సీఎం అగ్గిమీద గుగ్గిలమయ్యారు. కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్, ప్రజా భవన్‌ను తాము వాడుకోవడం లేదా? మంచి పథకాలను కొనసాగించడం లేదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ చేసిన తప్పులకు ప్రజలు ఉరి తీయాలని కోరుకుంటున్నా.. చట్ట నిబంధనలు అడ్డొస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. లక్ష కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టును ఎక్స్‌పర్ట్స్ (Experts) సాయంతో ఎలాగైనా కాపాడేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన స్పష్టం చేశారు.

Advertisement
Advertisement