KTR | ఆయిల్ పామ్ రైతులతో ముచ్చటించిన కేటీఆర్.. బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే మరిన్ని ప్రోత్సాహకాలు ఇస్తామని హామీ..
KTR | భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులతో సమావేశమై వారి సమస్యలు, అనుభవాలు, సూచనలను తెలుసుకున్నారు. మొన్న జిల్లాలో పర్యటించిన కేటీఆర్ అక్కడ ఆయిల్ ఫామ్ పంట పండిస్తున్న రైతన్నలతో మాట్లాడారు.
KTR | భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులతో సమావేశమై వారి సమస్యలు, అనుభవాలు, సూచనలను తెలుసుకున్నారు. మొన్న జిల్లాలో పర్యటించిన కేటీఆర్ అక్కడ ఆయిల్ ఫామ్ పంట పండిస్తున్న రైతన్నలతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులతో సుదీర్ఘంగా ముచ్చటించిన కేటీఆర్, గత బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో చేపట్టిన పంటల వైవిధ్యీకరణ కార్యక్రమం ఫలితాలను సమీక్షించడంతో పాటు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగును విస్తరించాలన్నది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో రూపొందించిన లక్ష్యమని తెలిపారు. మలేషియా, ఇండోనేషియా దేశాల తరహాలో ఆయిల్ పామ్ సాగును అభివృద్ధి చేసి దేశంలో వంటనూనెల దిగుమతులపై ఆధారపడే పరిస్థితిని తగ్గించడమే కాకుండా, రైతులకు వరి వంటి సంప్రదాయ పంటలతో పోలిస్తే మూడు రెట్లు అధిక ఆదాయం వచ్చేలా చేయడమే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యంగా ఈ పంటకి ప్రోత్సాహాన్ని అందించామని వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో సుమారు లక్షన్నర ఎకరాల్లో మాత్రమే ఉన్న ఆయిల్ పామ్ సాగు ప్రస్తుతం దాదాపు మూడు లక్షల ఎకరాలకు విస్తరించిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ సహకారం కొనసాగితే అది ఏడు లక్షల ఎకరాలకు చేరుకునే అవకాశముందని కేటీఆర్ పేర్కొన్నారు.
ఎకరాకు ఐదుటన్నుల దిగుబడి వస్తుందని ఐటీ ఉద్యోగి..
సమావేశంలో పలువురు రైతులు తమ అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా హెచ్‌సీఎల్ సంస్థలో వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న ఐటీ ఉద్యోగి అనిల్ మాట్లాడుతూ.. తాను ఏడు ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నానని, నాలుగేళ్ల తర్వాత పంట దిగుబడి ప్రారంభమై ప్రస్తుతం ఎకరాకు నాలుగు నుంచి ఐదు టన్నుల వరకు దిగుబడి వస్తోందని తెలిపారు. ఉద్యోగంలో జీతం వచ్చినట్లే ప్రతి నెలా స్థిరమైన ఆదాయం ఈ పంట ద్వారా వస్తోందని చెప్పారు. వాతావరణ మార్పులకు తట్టుకునే సామర్థ్యం ఉండటంతో పాటు వరితో పోలిస్తే తక్కువ నీటితోనే ఆయిల్ పామ్ సాగు సాధ్యమవుతోందని ఇతర రైతులు కూడా పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైతులు పలు సమస్యలను కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. కూలీల కొరత కారణంగా యాంత్రీకరణకు మరింత ప్రోత్సాహం అవసరమని, మొక్కలు ఎదిగిన తర్వాత అదనపు డ్రిప్ లైన్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ సహకారం అవసరమని కోరారు. అలాగే విదేశాల నుంచి తక్కువ ధరలకు దిగుమతి అవుతున్న పామ్ ఆయిల్ కారణంగా దేశీయ రైతులు నష్టపోతున్నందున కేంద్ర ప్రభుత్వం యాంటీ డంపింగ్ విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. రైతుల సూచనలకు స్పందించిన కేటీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయిల్ పామ్ రైతులకు మరింత ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు. ట్రాక్టర్లు, స్లాషర్లు వంటి వ్యవసాయ యంత్రాల కొనుగోలుపై అధిక సబ్సిడీలు అందించి యాంత్రీకరణను మరింత ప్రోత్సహిస్తామని తెలిపారు. పంట పూర్తిస్థాయిలో ఎదిగిన తర్వాత అవసరమయ్యే రెండో దశ డ్రిప్ ఇరిగేషన్ లైన్ల ఏర్పాటుకు ప్రత్యేక సహాయం అందిస్తామని చెప్పారు. అంతేకాకుండా ప్రపంచ స్థాయి ఆయిల్ పామ్ సాగు పద్ధతులను రైతులు ప్రత్యక్షంగా అధ్యయనం చేసేలా మలేషియాకు ప్రత్యేక అధ్యయన పర్యటనలను నిర్వహిస్తామని కేటీఆర్ ప్రకటించారు. అక్కడి ఆధునిక సాగు విధానాలు, యాంత్రీకరణ, నీటి వినియోగ పద్ధతులను పరిశీలించి తెలంగాణలో అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇంట్లో లీకేజీ ఉంటే.. ఇంటినే కూల్చేస్తారా?
సమావేశంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపైనా కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని సమర్థవంతంగా వినియోగించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేస్తూ రైతుల పంటలను ఎండబెడుతున్నారని విమర్శించారు. ‘ఇంట్లో ఒక చోట చిన్న లీకేజీ వచ్చిందని మొత్తం ఇంటినే కూల్చేస్తారా?’ అని ప్రశ్నించిన కేటీఆర్, మేడిగడ్డ బ్యారేజీలో ఒక భాగంలో సమస్య తలెత్తిందనే కారణంతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన పెట్టడం రైతుల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తోందన్నారు. వెంటనే కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ప్రారంభించి నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లను నింపాలని, నిలువ పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చివరగా కేటీఆర్ మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే కేసీఆర్ జీవిత లక్ష్యమని, పంటల వైవిధ్యీకరణలో తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. 2028లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, ఆ తర్వాత తెలంగాణను దేశంలోనే అత్యధిక ఆయిల్ పామ్ సాగు చేసే రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని పూర్తి స్థాయిలో సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..





