Hyderabad | వేసవిలో నీటి ఎద్దడి నివారణకు జలమండలి ప్లాన్!
Hyderabad | రానున్న వేసవిలో గ్రేటర్ హైదరాబాద్‌లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా జలమండలి ముందస్తు చర్యలకు సిద్ధమవుతోంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశాలు, సింగూరు–మంజీరా జలాశయాల్లో నీటి నిల్వలపై ఒత్తిడి నేపథ్యంలో ప్రత్యామ్నాయ నీటి వనరుల వినియోగంపై దృష్టి సారించింది.
- నవంబర్ 1 నుంచి ‘డయల్-ఏ-గ్రీన్ ట్యాంకర్’ సేవలు
- తొలి దశలో రోజుకు 100 ఎంఎల్డీ శుద్ధి చేసిన నీటి వినియోగం లక్ష్యం
- ట్యాంకర్ బుకింగ్, ట్రాకింగ్‌కు ప్రత్యేక డిజిటల్ ప్లాట్‌ఫామ్
- నిర్మాణాలు, పరిశ్రమలకు శుద్ధి చేసిన నీటి సరఫరా
Hyderabad | రానున్న వేసవిలో గ్రేటర్ హైదరాబాద్‌లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా జలమండలి ముందస్తు చర్యలకు సిద్ధమవుతోంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశాలు, సింగూరు–మంజీరా జలాశయాల్లో నీటి నిల్వలపై ఒత్తిడి నేపథ్యంలో ప్రత్యామ్నాయ నీటి వనరుల వినియోగంపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు నిర్మాణ రంగం, పరిశ్రమలు, పార్కులు, ఇతర అవసరాలకు శుద్ధి చేసిన మురుగునీటిని వినియోగించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందులో భాగంగా నవంబర్ 1 నుంచి ‘డయల్-ఏ-గ్రీన్ ట్యాంకర్’ సేవలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
రోజుకు 100 ఎంఎల్డీ లక్ష్యం
తాగునీటి వనరులపై ఒత్తిడి తగ్గించేందుకు నిర్మాణ పనులు, పరిశ్రమలు, పార్కులు, గ్రీన్‌బెల్టులు, ల్యాండ్‌స్కేపింగ్ వంటి అవసరాలకు శుద్ధి చేసిన నీటిని వినియోగించాలని జలమండలి నిర్ణయించింది. తొలి దశలో రోజుకు 100 ఎంఎల్డీ శుద్ధి చేసిన నీటిని వినియోగంలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు శుక్రవారం జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో క్రెడాయ్, నరెడ్కో, టీబీఎఫ్ తదితర నిర్మాణ రంగ సంస్థల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నీటి సరఫరా, నాణ్యతా ప్రమాణాలు, రవాణా వ్యయం, మౌలిక సదుపాయాలపై చర్చించారు. జలమండలి చేపట్టే చర్యలకు పూర్తి సహకారం అందిస్తామని నిర్మాణ రంగ ప్రతినిధులు తెలిపారు.
ట్యాంకర్ బుకింగ్.. ట్రాకింగ్ సదుపాయం
శుద్ధి చేసిన నీటిని అవసరమైన వారికి సులభంగా అందించేందుకు ప్రత్యేక డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో నిర్మాణ సంస్థలు, పరిశ్రమలు, ట్యాంకర్ నిర్వాహకులు, నీటి సరఫరాదారులు నమోదు చేసుకునే అవకాశం కల్పించనున్నారు. వినియోగదారులు ఆన్లైన్లో ట్యాంకర్లను బుక్ చేసుకోవడంతో పాటు వాటి కదలికలను ట్రాక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి తీసుకురానున్నారు. వారం నుంచి పది రోజుల్లో ఈ ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రైవేట్ ఎస్టీపీల్లో మిగులు నీటి వినియోగం
నగరంలోని గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లు, ఇతర ప్రైవేట్ సంస్థల్లో ఉన్న మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) నుంచి మిగులుగా లభించే నీటిని కూడా వినియోగంలోకి తీసుకురావాలని జలమండలి భావిస్తోంది. ఇప్పటివరకు 51 ప్రైవేట్ ఎస్టీపీలు నమోదు చేసుకోగా, వాటి నుంచి రోజుకు సుమారు 1.5 ఎంఎల్డీ మిగులు శుద్ధి చేసిన నీరు అందుబాటులో ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ నీటిని సమీపంలోని నిర్మాణ ప్రాజెక్టులు, పార్కులు, ల్యాండ్‌స్కేపింగ్ అవసరాలకు మళ్లించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. అవసరమైన సదుపాయాలు ఉన్న ఎస్టీపీలను తాత్కాలిక నీటి ఫిల్లింగ్ కేంద్రాలుగా వినియోగించడంపైనా దృష్టి సారించారు.
పైప్లైన్లతో రవాణా వ్యయానికి కళ్లెం
శుద్ధి చేసిన నీటిని ట్యాంకర్ల ద్వారా ఎక్కువ దూరం తరలించాల్సి రావడంతో రవాణా వ్యయం పెరుగుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు ఎస్టీపీల నుంచి సమీపంలోని నిర్మాణ ప్రాజెక్టులు, పార్కులు, గోల్ఫ్ కోర్సులు, గేటెడ్ కమ్యూనిటీలకు నేరుగా పైప్లైన్లు ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారు. బొటానికల్ గార్డెన్‌కు ఇప్పటికే ఎస్టీపీ నుంచి పైప్‌లైన్ ఏర్పాటు చేసిన తరహాలో ఇతర ప్రాంతాల్లోనూ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. నీటి పరిమాణం, రవాణా దూరం, ట్యాంకర్ సామర్థ్యం ఆధారంగా సముచిత ధరల విధానాన్ని రూపొందించడంపైనా చర్చించారు.
నిర్మాణ రంగ సంస్థల సహకారం
శుద్ధి చేసిన నీటి వినియోగాన్ని పెంచేందుకు నిర్మాణ రంగ సంస్థలు తమ సభ్యులకు అవగాహన కల్పించాలని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి కోరారు. నిర్మాణ అవసరాలకు సరఫరా చేసే నీరు నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని, నిబంధనలు ఉల్లంఘించే సరఫరాదారులపై చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని పార్కులు, గ్రీన్‌బెల్టులు, రహదారుల మధ్య పచ్చదనం నిర్వహణకు కూడా శుద్ధి చేసిన నీటిని వినియోగించేలా సమన్వయం పెంచాలని సూచించారు.
ఎనిమిది నెలలు కీలకం..
రానున్న ఎనిమిది నెలలు నీటి వనరుల పరిరక్షణలో కీలకమని, తాగునీటిని అత్యవసర అవసరాలకే ప్రాధాన్యంగా వినియోగిస్తూ ఇతర అవసరాలకు శుద్ధి చేసిన నీటిని ఉపయోగించాలని జలమండలి సూచించింది. సమావేశంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్, డైరెక్టర్లు నారాయణ, ప్రభు, సీజీఎంలు పద్మజ, సుజాత, క్రెడాయ్ అధ్యక్షుడు జయదీప్‌రెడ్డి, నరెడ్కో ఉపాధ్యక్షుడు అశోక్ స్వామినాథన్, టీబీఎఫ్ ప్రతినిధి ప్రభాకర్‌రావుతో పాటు పలువురు అధికారులు, నిర్మాణ రంగ ప్రతినిధులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Garuda Seva | వానజల్లుల మధ్య వైభవంగా శ్రీవారి గరుడసేవ!
- ●TGSRTC | ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. దసరాకు 7వేల ప్రత్యేక బస్సులు!
- ●Sheela Rajkumar | రణబాలిలో అలివేలు - జైలర్ 2లో పార్వతి - రెండు సినిమాల్లో నటించిన తమిళ నటి ఎవరంటే?
- ●Pranitha Subhash | తల్లయిన తగ్గని గ్లామర్ - బాపు బొమ్మ ప్రణీత లేటెస్ట్ ఫొటోలపై ఓ లుక్కేయండి!
- ●KTR | సహకార ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెండి.. కేటీఆర్‌కు సంఘాల అధ్యక్షుల రిక్వెస్ట్
- ●Vijay Deverakonda | అఫీషియల్ - "మనం" డైరెక్టర్‌తో విజయ్ దేవరకొండ సినిమా - జానర్ ఇదే

Garuda Seva | వానజల్లుల మధ్య వైభవంగా శ్రీవారి గరుడసేవ!

TGSRTC | ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. దసరాకు 7వేల ప్రత్యేక బస్సులు!

Sheela Rajkumar | రణబాలిలో అలివేలు - జైలర్ 2లో పార్వతి - రెండు సినిమాల్లో నటించిన తమిళ నటి ఎవరంటే?

Pranitha Subhash | తల్లయిన తగ్గని గ్లామర్ - బాపు బొమ్మ ప్రణీత లేటెస్ట్ ఫొటోలపై ఓ లుక్కేయండి!



