త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad Hotels | గ్యాస్ కొర‌త‌.. మూసివేత దిశ‌గా హైద‌రాబాద్ హోట‌ల్స్..!

Hyderabad Hotels | దేశంలోని ప‌లు న‌గ‌రాల్లో వంట గ్యాస్ కొర‌త ఏర్ప‌డింది. ఇప్ప‌టికే ఢిల్లీ, బెంగ‌ళూరు, ముంబై, చెన్నై వంటి న‌గ‌రాల్లో హోట‌ల్స్ మూతప‌డ్డాయి. ఆ న‌గ‌రాల జాబితాలో హైద‌రాబాద్ న‌గ‌రం కూడా చేరిపోనుంది.

S

Hyderabad | Published On Mar 10, 2026, 7.16 pm IST

Hyderabad Hotels | గ్యాస్ కొర‌త‌.. మూసివేత దిశ‌గా హైద‌రాబాద్ హోట‌ల్స్..!
Advertisement

నేటి వ‌ర‌కే గ్యాస్ నిల్వ‌లు..!
రోజువారిగా 20 గ్యాస్ సిలిండ‌ర్స్ అవ‌స‌రం
ప‌రిస్థితిని బ‌ట్టి హోట‌ల్స్ మూసివేస్తాం
గ్యాస్ రాక‌పోతే సిబ్బంది కూడా ప‌స్తులుండే ప‌రిస్థితి
కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చొర‌వ చూపాలి..
గ్యాస్ కొర‌త లేకుండా చూడాలి..

Hyderabad Hotels | త్రినేత్ర‌.న్యూస్ : దేశంలోని ప‌లు న‌గ‌రాల్లో వంట గ్యాస్ కొర‌త ఏర్ప‌డింది. ఇప్ప‌టికే ఢిల్లీ, బెంగ‌ళూరు, ముంబై, చెన్నై వంటి న‌గ‌రాల్లో హోట‌ల్స్ మూతప‌డ్డాయి. ఆ న‌గ‌రాల జాబితాలో హైద‌రాబాద్ న‌గ‌రం కూడా చేరిపోనుంది. వంట గ్యాస్ కొర‌త కార‌ణంగా హైద‌రాబాద్ న‌గ‌రంలో హోట‌ల్స్‌ను మూసివేసే ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని తెలంగాణ హోటల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. హోటళ్లకు కమర్షియల్‌ సిలిండర్ల సరఫరా నిలిపివేయాలని డీలర్లకు పెట్రోలియం కంపెనీలు ఆదేశించిన నేపథ్యంలో యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో తెలంగాణ హోట‌ల్స్ అసోసియేష‌న్ సికింద్రాబాద్‌లో అత్య‌వ‌స‌రంగా స‌మావేశ‌మైంది. ప్రభుత్వాలు ప్రత్యామ్నాయాలు చూపించకపోతే రాష్ట్రవ్యాప్తంగా హోటళ్ల బంద్‌ నిర్వహించే యోచనలో ఉన్నట్లు అధ్య‌క్షుడు వెంక‌ట్ రెడ్డి తెలిపారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఎల్‌పీజీ గ్యాస్‌ దిగుమతులు తగ్గిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. గ్యాస్‌ కొరతతో హోటల్‌ వ్యాపారాలు పూర్తిగా దెబ్బతింటున్నాయని, త‌మ వ్యాపారానికి భారీగా గండి ప‌డింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

మరోవైపు పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్‌ సిలిండర్ల కొరత ఎదుర్కొంటున్నట్లు హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌ హాస్టల్‌ అసోసియేషన్‌ తెలిపింది. ఈ నేపథ్యంలో పరిస్థితి మెరుగుపడే వరకు గ్యాస్‌ సిలిండర్ల వినియోగం విషయంలో ఐటీ కారిడార్‌లోని హాస్టళ్ల యజమానులు ఆచితూచి వ్యవహరించాలని సూచించింది. ‘సెల్ఫ్‌ కుకింగ్‌’ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ‘‘టీ, కాఫీలను తాత్కాలికంగా నిలిపేయాలి. చపాతీ, దోసె, పూరీ వంటి ఎక్కువ సమయం తీసుకునే, లేదా అధిక నూనె అవసరమయ్యే బ్రేక్‌ఫాస్ట్‌లు వద్దు. పరిస్థితిని బట్టి కొన్ని కూరలు, అదనపు వంటకాలను తాత్కాలికంగా నిలిపేయొచ్చు. అన్ని హాస్టళ్ల యజమానులు ప్రత్యామ్నాయ వంట పద్ధతులను అమలు చేయాలి’’ అని సూచించింది.

Advertisement
Advertisement