త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Snakes Hotspot | పాముల హాట్‌స్పాట్‌గా హైద‌రాబాద్ న‌గ‌రం..! వెలుగులోకి షాకింగ్ విష‌యాలు..!!

Snakes Hotspot | | రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రం పాముల‌కు సంచార కేంద్రంగా మారింది. ఇందుకు ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ గ‌ణాంకాలే ప్ర‌త్య‌క్ష సాక్ష్యం.

S

Hyderabad | Published On Jan 20, 2026, 8.41 am IST

Snakes Hotspot | పాముల హాట్‌స్పాట్‌గా హైద‌రాబాద్ న‌గ‌రం..! వెలుగులోకి షాకింగ్ విష‌యాలు..!!
Advertisement

రాజ‌ధానిలో కుప్ప‌లు తెప్ప‌లుగా పాములు..
2025లోనే 15 వేల‌కు పైగా పాములు రెస్క్యూ..
ఆందోళ‌న‌లో హైద‌రాబాదీలు..

Snakes Hotspot | త్రినేత్ర‌.న్యూస్ : పాములు.. ఈ పేరు వింటేనే గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతాయి. మ‌రి ప్ర‌త్య‌క్షంగా వాటిని చూస్తే.. శ‌రీర‌మంతా చెమ‌ట‌లు ప‌ట్టేస్తాయి.. అంతేకాదు.. ఒళ్లంతా వ‌ణుకు పుడుతుంది. అలాంటి భ‌యంక‌ర‌మైన పాములు.. చెట్లు, పుట్ట‌లు.. ద‌ట్ట‌మైన అట‌వీ ప్రాంతాల్లో విరివిగా క‌నిపిస్తాయి. కానీ ఇప్పుడు అలాంటి అడ‌వులు, చెట్ల‌ను వ‌దిలేసి.. జ‌నావాసాల్లోకి ప్ర‌వేశిస్తున్నాయి పాములు. రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రం పాముల‌కు సంచార కేంద్రంగా మారింది. ఇందుకు ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ గ‌ణాంకాలే ప్ర‌త్య‌క్ష సాక్ష్యం.

పాముల హాట్ స్పాట్ కేంద్రాలు ఇవే..

2025లో తెలంగాణ వ్యాప్తంగా అట‌వీశాఖ అధికారుల స‌హ‌కారంతో 15,265 పాముల‌ను ర‌క్షించిన‌ట్లు ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ వెల్ల‌డించింది. ఇందులో 55.61 శాతం పాములు విష‌పూరిత‌మైన‌వే ఉన్నాయి. 15000 వేల‌కు పైగా ర‌క్షించ‌బ‌డ్డ పాముల్లో అత్య‌ధిక శాతం హైద‌రాబాద్ న‌గ‌రంలో ఉన్నాయి. ఔట‌ర్ రింగ్ రోడ్డు ప‌రిస‌ర ప్రాంతాల్లో అధికంగా పాములు సంచ‌రిస్తూ, జ‌న‌వాసాల్లోకి వ‌చ్చిన‌ట్లు ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ పేర్కొంది. మ‌రి ముఖ్యంగా మియాపూర్, ద‌మ్మాయిగూడ‌, నాగారం, రాంప‌ల్లి, వ‌న‌స్థ‌లిపురం, బాలాపూర్, బండ్ల‌గూడ జాగీర్, మ‌ణికొండ ప్రాంతాలు పాముల‌కు హాట్ స్పాట్ కేంద్రాలుగా మారాయ‌ని తెలిపింది.

ఈ మూడు పాములే అత్య‌ధికం..

నాగుపాములు, ర‌స్సెల్ వైప‌ర్స్, క‌ట్ల‌పాములు అత్య‌ధికంగా ప‌ట్టుబ‌డ్డాయ‌ని తెలిపింది. న‌గ‌రంలో పాముల సంచారానికి ప్ర‌ధాన కార‌ణం.. న‌గ‌ర విస్త‌ర‌ణే మూల‌కార‌ణ‌మ‌ని పేర్కొంది. సిటీ శివార్ల‌లో కాంక్రీట్ నిర్మాణాలు ఊహించ‌ని విధంగా నెల‌కొల్ప‌డ‌మే దీనికి ప్ర‌ధాన కార‌ణం. పెద్ద పెద్ద భ‌వ‌నాల నిర్మాణాలు చేప‌డుతుండ‌డంతో.. పాముల ఆవాసాలు దెబ్బ‌తిని అవి బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఈ కార‌ణంగా మానవులు, పాముల మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ ఏర్ప‌డుతుంది. అయితే పాములు అంటేనే భ‌య‌ప‌డే మ‌న‌షులు.. వాటి సంర‌క్ష‌ణ‌పై అవ‌గాహ‌న పెర‌గ‌డంతో పాములు క‌నిపించ‌గానే స్నేక్ క్యాచ‌ర్ల‌కు స‌మాచారం అందిస్తున్నారు. దీంతో వాలంటీర్లు హుటాహుటిన వ‌చ్చి పాముల‌ను ప‌ట్టుకుని, వాటిని సంర‌క్ష‌ణ కేంద్రాల‌కు త‌ర‌లించి, అక్క‌డ్నుంచి అడ‌వుల్లో వ‌దిలేస్తున్న‌ట్లు ఫ్రెండ్స్ స్నేక్స్ సొసైటీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అవినాష్ తెలిపారు. 2013లో 2,464 పాముల‌ను ప‌ట్టుకోగా, 2025 నాటికి ఆ సంఖ్య 15 వేల‌కు చేరుకుంద‌న్నారు.

పాముల రెస్క్యూ వివ‌రాలివే..

2016లో 3097, 2017లో 4504, 2018లో 5644, 2019లో 6689, 2020లో 8895, 2021లో 10525, 2022లో 9101, 2023లో 10282, 2024లో 13028, 2025లో 15265 పాముల‌ను సంర‌క్షించి అడ‌వుల్లో వ‌దిలేశారు. 2025 గ‌ణాంకాల‌ను ప‌రిశీలిస్తే మొత్తం సంర‌క్షించబ‌డిన పాముల్లో 55.6 శాతం పాములు అత్యంత విష‌పూరిత‌మైన పాములు ఉన్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement