త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kukatpally Truck Park | కూక‌ట్‌ప‌ల్లి ట్ర‌క్‌పార్క్ భూముల వేలానికి లైన్ క్లియ‌ర్‌.. పిటిష‌న్లు కొట్టేసిన హైకోర్టు

Kukatpally Truck Park | కూకట్‌పల్లిలోని హుడా ట్రక్ పార్క్ (Kukatpally Truck Park) భూముల వేల వ్య‌వ‌హారంలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ త‌గిలింది. వేలాన్ని నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు (High Court) ధర్మాసనం కొట్టివేసింది.

G

Hyderabad | Published On Nov 27, 2026, 12.43 pm IST

Kukatpally Truck Park | కూక‌ట్‌ప‌ల్లి ట్ర‌క్‌పార్క్ భూముల వేలానికి లైన్ క్లియ‌ర్‌.. పిటిష‌న్లు కొట్టేసిన హైకోర్టు
Advertisement

Kukatpally Truck Park | త్రినేత్ర న్యూస్‌: కూకట్‌పల్లిలోని హుడా ట్రక్ పార్క్ (Kukatpally Truck Park) భూముల వేల వ్య‌వ‌హారంలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ త‌గిలింది. వేలాన్ని నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు (High Court) ధర్మాసనం కొట్టివేసింది. దీంతో వేలం ప్రక్రియకు మార్గం సుగమమైంది. హైద‌రాబాద్ మూసాపేట ప‌రిధిలోని 3.15 ఎక‌రాలను ఈ నెల 27న వేలం వేయ‌డానికి క‌లెక్ట‌ర్ జారీచేసిన నోటిఫికేష‌న్‌ను స‌వాల్ చేస్తూ కూకట్‌పల్లి బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, సామాజిక కార్య‌క‌ర్త మాధ‌వ‌రం కాంతారావు హైకోర్టులో ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖలు చేశారు. వాటిపై గురువారం విచార‌ణ చేప‌ట్టిన తాత్కాలిక ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ పీ.శ్యాంకోశీ, జ‌స్టిస్ సుద్దాల చ‌ల‌ప‌తిరావుతో కూడిన ధ‌ర్మాస‌నం.. తాజాగా తీర్పును వెలువ‌రించింది. ఇరు పక్షాల వాదనల త‌ర్వాత ఆ రెండు పిటిషన్లు పబ్లిక్ ఇంట్రెస్ట్‌కు సంబంధించినవిగా లేవని పేర్కొంటూ కొట్టివేసింది.

హైకోర్టులో ట్రక్ పార్క్ వేలానికి అడ్డంకులు తొలగిపోవడంతో హెచ్ఎండీ (HMDA) ఏర్పాట్లు ముమ్మ‌రం చేసింది. ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్ర‌కారం శుక్ర‌వారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత వేలంపాట ప్రారంభిస్తామని స్ప‌ష్టం చేసింది. 3.15 ఎకరాల భూమికి కనీస ధర‌గా అధికారులు రూ.90 కోట్లుగా నిర్ణయించిన విష‌యం తెలిసిందే.

ఇరు ప‌క్షాల వాద‌న‌లు ఇలా..

పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు బీ.మయూర్‌రెడ్డి, గండ్ర మోహన్‌రావు, బీఎస్‌.ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. ప్రజాప్రయోజనాల నిమిత్తం సేకరించిన భూమిని ప్రైవేటు ప్రయోజనాల కోసం విక్రయించడం చెల్లదన్నారు. వేలం ద్వారా వచ్చే సొమ్మును ఇతర ప్రజాప్రయోజనాలకు వినియోగిస్తామనడం భూసేకరణ చట్టానికి విరుద్ధమని తెలిపారు. ప్రజాప్రయోజనాల నిమిత్తం సేకరించిన భూమిని ప్రైవేటు రియల్‌ఎస్టేట్‌ వ్యాపారానికి వినియోగిస్తున్నారని, అక్కడ షాపింగ్‌మాల్‌ మార్కింగ్‌ కూడా ఉందని చెప్పారు. భూమిని భవిష్యత్తులో ఎలాంటి ప్రత్యామ్నాయాలకు వినియోగించవచ్చన్న దానిపై అధ్యయనం చేయలేదని వెల్ల‌డించారు. ఎమ్మెల్యేగా (Madhavaram Krishna Rao)
ఇచ్చిన వినతిపత్రాలను, ప్రతిపాదనలను పరిశీలించలేదని కోర్టు దృష్టికి తీసుకువ‌చ్చారు. ఇప్పటికే ఈఎండీ కింద రూ.5 కోట్లు వసూలుచేసి వేలాన్ని ఈ నెల 27న నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని, దీన్ని నిలిపివేయాలని కోరారు.

అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ తేరా రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రజాప్రయోజనం పేరుతో వేసిన ఈ పిటిషన్‌ విచారణార్హం కాదన్నారు. పిటిషనర్లలో ఎమ్మెల్యే ఉన్నారని, అవి రాజకీయ పిటిషన్ల‌ని పేర్కొన్నారు. టెర్మినల్‌ కోసం భూసేకరణ జరిగిందని, 2005లో సబ్‌టెర్మినల్‌ ఏర్పాటు ప్రతిపాదన జరిగిందని, అయితే అది రద్దయిపోయిందని చెప్పారు. భూసేకరణ జరిగినప్పుడు అది శివార్లలో ఉందని ప్రస్తుతం చుట్టూ నివాస సముదాయాలతో అభివృద్ధి చెందిందన్నారు. ఈ భూమిని విక్రయించడం ద్వారా వచ్చే సొమ్మును ప్రజాప్రయోజనాలకే వెచ్చిస్తామని తెలిపారు. గతంలో ట్రక్‌ యజమానుల సంఘం దాఖలుచేసిన పిటిషన్‌ను ఇదే హైకోర్టు కొట్టివేసిందని పేర్కొన్నారు. ఇరు పక్షాల వాదనలను విన్న ధర్మాసనం దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరిస్తూ నిర్ణయాన్ని వాయిదా వేసింది. తాజాగా పిటిష‌న్ల‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువ‌రించింది.

Advertisement
Advertisement