త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Golconda Bonalu | గోల్కొండ ఆషాఢ బోనాలు ప్రారంభం.. భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన సీపీ స‌జ్జ‌నార్

Golconda Bonalu | గోల్కొండ శ్రీ జగదాంబికా మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాల ఉత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి బోనం సమర్పణను పురస్కరించుకుని హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు.

S

Hyderabad | Published On Jul 16, 2026, 3.06 pm IST

Golconda Bonalu | గోల్కొండ ఆషాఢ బోనాలు ప్రారంభం.. భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన సీపీ స‌జ్జ‌నార్
Advertisement

Golconda Bonalu | త్రినేత్ర‌.న్యూస్ : గోల్కొండ శ్రీ జగదాంబికా మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాల ఉత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి బోనం సమర్పణను పురస్కరించుకుని హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. గోల్కొండ కోట దిగువ భాగం నుంచి పైవరకు ఉన్న బందోబస్తును ఆయన నిశితంగా పరిశీలించారు. అనంతరం జగదాంబికా మహంకాళి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీ సజ్జనర్ మాట్లాడుతూ.. తొలి బోనం రోజున తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. ఉత్సవాల భద్రత కోసం సుమారు 2,000 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. లంగర్‌హౌస్ చౌరస్తా నుంచి కోటలోని ఆలయం వరకు ప్రత్యేక పోలీసు బలగాలను రంగంలోకి దించినట్లు పేర్కొన్నారు.

శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ఆకతాయిల ఆటకట్టించేందుకు అత్యాధునిక డ్రోన్ కెమెరాలు, విస్తృతమైన సీసీటీవీ నెట్‌వర్క్‌ను వినియోగిస్తున్నట్లు తెలిపారు. జేబు దొంగతనాలు, గొలుసు చోరీలను అరికట్టేందుకు క్రైమ్ విభాగం ప్రత్యేక నిఘా పెంచిందని.. మహిళల భద్రత కోసం షీ-టీమ్స్ నిరంతరం గస్తీ కాస్తాయని స్పష్టం చేశారు. భక్తుల వాహనాల పార్కింగ్ కోసం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారని వివరించారు.

శాంతిభద్రతలు, ట్రాఫిక్ విభాగాలతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారని.. బోనాల ఉత్సవాలను ప్రశాంతమైన, ఆధ్యాత్మిక వాతావరణంలో విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ పర్యటనలో జాయింట్ సీపీ (ట్రాఫిక్) డి. జోయల్ డెవిస్, డీసీపీ (సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్) ఆర్. వెంకటేశ్వర్లు, గోల్కొండ జోన్ డీసీపీ జె. రాఘవేంద్ర రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement