త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CP Sajjanar | గణేశ్‌ ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు

CP Sajjanar | రాబోయే వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన వేడుకలను ప్రశాంత వాతావరణంలో వైభవంగా నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ అధికారులను ఆదేశించారు. శనివారం బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ ఆడిటోరియంలో ఎస్సై స్థాయి నుంచి పైస్థాయి అధికారులతో గణేశ్ ఉత్సవాల బందోబస్తుపై సన్నాహక సమావేశం నిర్వహించారు.

P

Hyderabad | Published On Sep 5, 2026, 7.28 pm IST

CP Sajjanar | గణేశ్‌ ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు
Advertisement
  • మండపాలకు జియో ట్యాగింగ్‌..
  • సీసీ కెమెరాల నిఘా
  • వదంతులపై 24 గంటల పర్యవేక్షణ
  • రూట్‌ క్లియరెన్స్‌, ట్రాఫిక్‌ నియంత్రణపై ప్రత్యేక దృష్టి
  • హైదరాబాద్‌ సీపీ వీసీ స‌జ్జ‌నార్‌ ఆదేశం

CP Sajjanar | రాబోయే వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన వేడుకలను ప్రశాంత వాతావరణంలో వైభవంగా నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ అధికారులను ఆదేశించారు. శనివారం బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ ఆడిటోరియంలో ఎస్సై స్థాయి నుంచి పైస్థాయి అధికారులతో గణేశ్ ఉత్సవాల బందోబస్తుపై సన్నాహక సమావేశం నిర్వహించారు. లా అండ్‌ ఆర్డర్‌, ట్రాఫిక్‌ డీసీపీలు తమ పరిధిలో భద్రతా చర్యలు, ఇతర శాఖలతో సమన్వయం, బందోబస్తు ప్రణాళికలను వివరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఇటీవల బోనాల ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించిన తరహాలోనే గణేశ్ ఉత్సవాలను కూడా సమష్టి కృషితో ప్రశాంతంగా పూర్తి చేయాలని సూచించారు. 11 రోజులపాటు జరిగే ఉత్సవాలను సీరియస్‌గా తీసుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. సాధారణ కార్యక్రమాలు, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు.

మండపాలకు జియో ట్యాగింగ్‌

అన్ని గణేశ్ మండపాల నిర్వాహకులు హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ రూపొందించిన యాప్‌లో తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని సీపీ సూచించారు. మండపాల వివరాలను యాప్‌లో జియో ట్యాగింగ్‌ చేయాలని ఆదేశించారు. రద్దీ ఎక్కువగా ఉండే మండపాల వద్ద బారికేడ్లు, క్యూలైన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా నిర్వాహకులను ప్రోత్సహించాలని చెప్పారు. శాంతి కమిటీలు, మండపాల నిర్వాహకులు, వివిధ శాఖల ప్రతినిధులతో ఎస్‌హెచ్‌వోలు నిరంతరం సమన్వయ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. శంషాబాద్‌, రాజేంద్రనగర్‌ జోన్లు హైదరాబాద్‌ సిటీ పరిధిలోకి రావడంతో బాలాపూర్‌ నుంచి ఖైరతాబాద్‌ వరకు గణేశ్‌ ఉత్సవాల నిర్వహణ నగర పోలీసుల పరిధిలోకి వచ్చిందని సీపీ తెలిపారు. బాలాపూర్‌ నుంచి ప్రధాన నిమజ్జన మార్గాల మీదుగా ట్యాంక్‌బండ్‌, ఇతర జలాశయాల వరకు రూట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. భారీ విగ్రహాల తరలింపులో ట్రాఫిక్‌ జామ్‌లు లేకుండా, ఎత్తైన విగ్రహాల వల్ల విద్యుత్‌ తీగలకు ప్రమాదం జరగకుండా ముందస్తు రూట్‌ క్లియరెన్స్‌ చేపట్టాలని సూచించారు. సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల నుంచి వచ్చే విగ్రహాల రాకపోకలపై ఆయా పోలీస్‌ శాఖలతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. ఖైరతాబాద్‌ బడా గణేష్‌ వంటి అధిక రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక ట్రాఫిక్‌ నియంత్రణ ప్రణాళికలు అమలు చేయాలని ఆదేశించారు.

వదంతులపై 24 గంటల నిఘా

సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు, ఉద్రిక్తతలు రెచ్చగొట్టే పోస్టులు, వదంతులపై ఐటీ సెల్‌, స్థానిక పోలీసులు 24 గంటలూ నిఘా ఉంచుతారని సీపీ తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించే వారిపై, రెచ్చగొట్టే కంటెంట్‌ వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాబోయే నెల రోజులు కీలకమని.. అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ విజిబుల్‌ పోలీసింగ్‌ అమలు చేయాలని సూచించారు. ప్రజలు, భక్తులతో పోలీసులు సంయమనం, ఓర్పుతో వ్యవహరించాలని చెప్పారు. సమావేశంలో అడిషనల్‌ సీపీలు ఎం శ్రీనివాస్‌, తఫ్సీర్‌ ఇక్బాల్‌, జాయింట్‌ సీపీ ఎస్‌ఎం విజయ్‌కుమార్‌, వివిధ జోన్ల డీసీపీలు, ట్రాఫిక్‌ డీసీపీలు, ఇతర పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement