FSSAI Registration | హైదరాబాద్లోని 14 ప్రధాన కూరగాయల మార్కెట్లలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) అధికారులు రిజిస్ట్రేషన్, లైసెన్సింగ్ శిబిరాలను నిర్వహించారు. కూరగాయల వ్యాపారుల్లో ఆహార భద్రత ప్రమాణాలు పెంచడం, బలోపేతం చేయడం, పరిశుభ్రతపై అవగహన పెంపొందించడం కోసం ఫుడ్ సేఫ్టీ శాఖ అధికారులు మంగళవారం ఈ శిబిరాలను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ శిబిరాల ద్వారా కూరగాయల వ్యాపారులకు ఎఫ్ఎస్ఎస్ఏఐ రిజిస్ట్రేషన్, లైసెన్సులు జారీ చేయడంతో పాటు ఆహార పరిశుభ్రత, భద్రతా నిబంధనలు, మార్కెట్ ప్రాంగణాల్లో శానిటేషన్ నిర్వహణపై వ్యాపారులకు ఈసందర్భంగా అవగాహన కల్పించారు. FSSAI Registration | రిజిస్ట్రేషన్ చేసుకున్న 926 మంది వ్యాపారులు ఈ శిబిరాలను హైదరాబాద్ నగరంలోని ప్రధాన రైతు బజార్లు అయిన కుషాయిగూడ, ఉప్పల్ వెజిటబుల్, ఫ్రూట్స్ మార్కెట్, సరూర్ నగర్ రైతు బజార్, ఎన్టీఆర్ నగర్ కూరగాయల మార్కెట్, వనస్థలిపురం రైతు బజార్, మాదన్నపేట కూరగాయల మార్కెట్, మీర్ ఆలం మండి, ఓవైసీ కూరగాయల మార్కెట్, మోండా మార్కెట్, మెట్టుగూడ కూరగాయల మార్కెట్, ఎర్రగడ్డ కూరగాయల మార్కెట్, గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్, లింగంపల్లి మార్కెట్, జేఎన్టీయూ రైతు బజార్లలో నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ శాఖ అధికారుల వివరాల ప్రకారం, ఈ శిబిరాల సందర్భంగా మొత్తం 926 మంది వ్యాపారులు FSSAI రిజిస్ట్రేషన్ లేదా లైసెన్సుల కోసం దరఖాస్తులు చేసుకున్నారన్నారు. ఇవే మార్కెట్లలో డిసెంబర్ 30, 2025న మరో విడత శిబిరాలు నిర్వహించనున్నట్లు ఫుడ్ సేఫ్టీ శాఖ అధికారులు వెల్లడించారు. మంగళవారం పెట్టిన శిబిరాల్లో దరఖాస్తు చేయడానికి వీలు పడని వ్యాపారులు డిసెంబర్ 30న మరోసారి రాబోయే అవకాశాన్ని వినియోగించుకోవాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచించారు.