త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Fake Number Plate Scam | ట్రాఫిక్ చలాన్లకు భయపడి బైక్‌కు నకిలీ నంబర్ ప్లేట్.. అడ్డంగా బుక్కైన కిలాడీ

ట్రాఫిక్ చలాన్ల భయంతో బైక్‌కి నకిలీ నంబర్ ప్లేట్ అమర్చిన ఓ వ్యక్తిని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆటకట్టించారు. తన బండి నంబర్‌పై ఇతరులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతూ చలాన్లు వేయిస్తున్నారని అసలు యజమాని ఇచ్చిన ఫిర్యాదుతో ఈ మోసం బట్టబయలైంది.

J

Hyderabad | Published On Apr 28, 2026, 11.00 pm IST

Fake Number Plate Scam | ట్రాఫిక్ చలాన్లకు భయపడి బైక్‌కు నకిలీ నంబర్ ప్లేట్.. అడ్డంగా బుక్కైన కిలాడీ
Advertisement

Fake Number Plate Scam | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. తమ వాహనాలకు నకిలీ నంబర్ ప్లేట్లు అమర్చి, ప్రభుత్వ అధికారుల కళ్లుగప్పే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఖైరతాబాద్ పరిధిలో వెలుగుచూసింది. వేరొకరి నంబర్ ప్లేట్‌ను వాడుతున్న వ్యక్తిని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు.

అసలు ఏం జరిగిందంటే

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి సమీపంలోని బౌరంపేటకు చెందిన టి. శ్రీకాంత్ అనే వ్యక్తి.. హీరో డెస్టినీ (Hero Destini) వాహనాన్ని వాడుతున్నాడు. అయితే, అతని బండి నంబర్‌ (TS08HS7658) పై వరుసగా ట్రాఫిక్ చలాన్లు వస్తుండటంతో అతను కంగుతిన్నాడు. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా అక్రమంగా వస్తున్న చలాన్లతో ఆర్థికంగా నష్టపోతున్నానని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రంగంలోకి దిగిన పోలీసులు.. గుట్టు రట్టు

బాధితుడి ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు క్షుణ్ణంగా విచారణ జరిపారు. ఈ దర్యాప్తులో ఖైరతాబాద్ ఆనంద్ నగర్ కాలనీకి చెందిన డి.రాబర్ట్ శామ్యూల్ (41) అనే వ్యక్తి అసలు దొంగ అని తేలింది. నిందితుడు తన వద్ద ఉన్న హీరో డెస్టినీ వాహనానికి, శ్రీకాంత్ వాహన నంబర్‌ను (TS08HS7658) నకిలీ ప్లేట్‌గా వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎన్‌ఫోర్స్మెంట్ కెమెరాలను తప్పుదారి పట్టించి, ట్రాఫిక్ జరిమానాల నుంచి తప్పించుకునేందుకే ఇదంతా చేసినట్లు దర్యాప్తులో తేలింది.

Fake Number Plate Scam Busted in Hyderabad Man Arrested for Evading Traffic Challans

క్రిమినల్ కేసు నమోదు

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల పక్కా సమాచారంతో ఖైరతాబాద్ లా అండ్ ఆర్డర్ పోలీసులు నిందితుడు రాబర్ట్ శామ్యూల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కొత్త చట్టాల ప్రకారం.. BNS సెక్షన్ 318(4), మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 192 కింద ఎఫ్ఐఆర్ (FIR నం. 118/2026) నమోదు చేశారు. BNSS సెక్షన్ 35(3) (పాత Cr.P.C సెక్షన్ 41) కింద నిందితుడికి నోటీసులు జారీ చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

వాహనదారులకు ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక

ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీ జాయింట్ పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) డి.జోయల్ డేవిస్ వాహనదారులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. నకిలీ, ట్యాంపరింగ్ చేసిన లేదా ఇతరులను పోలిన నంబర్ ప్లేట్లను ఉపయోగించడం చట్టరీత్యా తీవ్రమైన నేరం.

ఇటువంటి చర్యలకు పాల్పడితే భారతీయ న్యాయ సంహిత (BNS), మోటార్ వాహనాల చట్టం ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. నగరవ్యాప్తంగా వందలాది ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరాలు, అత్యాధునిక CCTV నిఘా ఉంది. నకిలీ ప్లేట్లతో తిరిగితే ఈజీగా దొరికిపోతారు.

మీ బండి నంబర్‌పై ఫేక్ చలాన్లు వస్తున్నాయా?

మీ బైక్ లేదా కారు, ఇతర వాహనం ఏది ఉన్నా దాని నంబర్ ప్లేట్‌ను ఎవరైనా దుర్వినియోగం చేస్తున్నట్లు మీకు అనుమానం వస్తే, ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ట్రాఫిక్ పోలీసులకు ఈ క్రింది మార్గాల్లో ఫిర్యాదు చేయండి.

వెబ్‌సైట్: https://echallan.tspolice.gov.in

ఈమెయిల్: echallanhelpdesk.hyd@gmail.com

వాట్సాప్ నంబర్: 8712661690

Advertisement
Advertisement