త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kukatpally Nalla Cheruvu | తల తాకట్టు పెట్టైనా నిధులు తెస్తా.. పేదల ఇండ్లు కూలగొట్టడం మా ఉద్దేశం కాదు: సీఎం రేవంత్ రెడ్డి

కూకట్‌పల్లి నల్ల చెరువు ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ అభివృద్ధికి నిధులు ఇస్తామని, పేదల ఇళ్లు కూలగొట్టడం ప్రభుత్వ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళన, చెరువుల అభివృద్ధిపై కీలక ప్రకటన చేశారు.

J

Hyderabad | Published On Mar 9, 2026, 10.06 pm IST

Kukatpally Nalla Cheruvu | తల తాకట్టు పెట్టైనా నిధులు తెస్తా.. పేదల ఇండ్లు కూలగొట్టడం మా ఉద్దేశం కాదు: సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

Kukatpally Nalla Cheruvu | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో ఎలాంటి అడ్డంకులు ఎదురైనా తగ్గేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అభివృద్ధికి రాజకీయాలను ముడిపెట్టబోమని, తల తాకట్టు పెట్టైనా నిధులు తీసుకొచ్చి హైదరాబాద్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆయన ఉద్ఘాటించారు. సోమవారం కూకట్‌పల్లిలోని ప్రతిష్టాత్మక 'నల్ల చెరువు' సుందరీకరణ పనులను, ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంది.

ఆ విమర్శలు ఆశీర్వాదంగా మారాయి!

ముఖ్యమంత్రి హోదాలో తాను ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కూకట్‌పల్లికి రావడం ఎంతో సంతోషంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. "చెరువుల పునరుద్ధరణకు పూనుకున్నప్పుడు ఎంతోమంది ఎన్ని ఆరోపణలు, విమర్శలు చేసినా మౌనంగా భరించాను. ఈరోజు నల్ల చెరువు అభివృద్ధిని చూశాక.. ఇక్కడి ప్రజల ముఖాల్లో చిరునవ్వు చూస్తుంటే, ఆ విమర్శలే నాకు ఆశీర్వాదంగా మారినట్లు అనిపిస్తోంది" అని ఆయన భావోద్వేగంగా మాట్లాడారు.

పేదల ఇళ్లు కూలగొట్టడం మా ఉద్దేశం కాదు

నగరంలో జరుగుతున్న చెరువులు, నాలాల ఆక్రమణల తొలగింపుపై సీఎం స్పష్టత ఇచ్చారు. పేదవాడిని ఇబ్బంది పెట్టడం, వారి ఇండ్లు కూలగొట్టడం ప్రభుత్వ ఉద్దేశం ఏమాత్రం కాదని ఆయన తేల్చిచెప్పారు. "వరదలు వచ్చినపుడు ఏ ఒక్కరూ ముంపు బాధితులుగా మిగలకూడదు అన్నదే మా తపన. చెరువులు, నాలాలను ఆక్రమించుకున్న వారికి నా సూచన ఒక్కటే.. మీకు పూర్తి స్థాయిలో న్యాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది." అని సీఎం భరోసా ఇచ్చారు. పునరుద్ధరించిన చెరువుల వద్ద మహిళలకు ఉపాధి కల్పించేలా స్టాల్స్ ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తామని, చిన్నారుల కోసం చెరువుల ఒడ్డున ఆటస్థలాలు అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

మూసీ ప్రక్షాళన.. కోర్ అర్బన్ డెవలప్‌మెంట్

దేశంలోని అనేక మహానగరాలు మౌలిక సదుపాయాల లేమితో, కాలుష్యంతో సతమతమవుతున్నాయని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. అందుకే హైదరాబాద్ నగరంలో ప్రకృతిని కాపాడుకుంటూ చెరువులను పునరుద్ధరించుకుందామని పిలుపునిచ్చారు. మూసీ నదిని సంపూర్ణంగా ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు. కోర్ అర్బన్ రీజియన్ (Core Urban Region) లో ఉన్న చెరువులన్నీ పునరుద్ధరిస్తామని, నాలాల ఆక్రమణలు తొలగించి, రోడ్ల విస్తరణ చేపడతామని స్పష్టం చేశారు.

అభివృద్ధి ఆగదు!

మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

"కష్ట కాలంలో ఈ ప్రాంత ప్రజలు నన్ను అక్కున చేర్చుకుని నిలబెట్టారు. నన్ను నిలబెట్టిన మీ కోసం ఎంతటి అభివృద్ధి చేయడానికైనా వెనకాడను. ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి.. తల తాకట్టు పెట్టైనా సరే నిధులు ఇచ్చే బాధ్యత నాది. దయచేసి అభివృద్ధిని అడ్డుకోకండి.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ అభివృద్ధి చేసుకోలేం. మీ అందరి సహకారంతో హైదరాబాద్ నగరాన్ని ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దుతాను" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.

Advertisement
Advertisement