త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CP Ramesh | సైబ‌ర్ కేసుల ద‌ర్యాప్తులో బ్యాంకుల స‌హ‌కారం కీల‌కం : సీపీ ర‌మేశ్‌

CP Ramesh | సైబ‌ర్ కేసుల ద‌ర్యాప్తులో బ్యాంకుల స‌హ‌కారం కీల‌క‌మ‌ని సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ ఎం ర‌మేశ్ అన్నారు. కమిషనరేట్ పరిధిలోని వివిధ బ్యాంకుల ప్రతినిధులతో కార్యాలయ ఆడిటోరియంలో ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు.

P

Hyderabad | Published On May 8, 2026, 7.35 pm IST

CP Ramesh | సైబ‌ర్ కేసుల ద‌ర్యాప్తులో బ్యాంకుల స‌హ‌కారం కీల‌కం : సీపీ ర‌మేశ్‌
Advertisement

CP Ramesh | సైబ‌ర్ కేసుల ద‌ర్యాప్తులో బ్యాంకుల స‌హ‌కారం కీల‌క‌మ‌ని సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ ఎం ర‌మేశ్ అన్నారు. కమిషనరేట్ పరిధిలోని వివిధ బ్యాంకుల ప్రతినిధులతో కార్యాలయ ఆడిటోరియంలో ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు. సైబర్ నేరాలకు సంబంధించిన కేసుల్లో బ్యాంకులు, పోలీసుల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేస్తూ దర్యాప్తును వేగవంతం చేయడం, ముఖ్యంగా మ్యూల్ అకౌంట్ల క‌ట్ట‌డి, ఖాతాల ఫ్రీజ్–డిఫ్రీజ్ ప్రక్రియ, బాధితులకు రీఫండ్‌, డిజిటల్ మోసాలపై స‌మావేశంలో చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు ముప్పుగా మారాయ‌న్నారు. ఆన్‌లైన్ స్కామ్‌లు, నకిలీ పెట్టుబడి పథకాలు, ప్రీ-లాంచ్ ఆఫర్లు, కాల్ సెంటర్ మోసాలు, క్రిప్టో కరెన్సీ స్కామ్‌ల‌తో ప్రజలు భారీ మొత్తంలో డబ్బు కోల్పోతున్నారని చెప్పారు. చాలామంది తమ జీవితకాల పొదుపులను కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

సైబరాబాద్ పరిధిలో గ‌తేడాది సైబర్ మోసాల కారణంగా ప్రజలు రూ.438 కోట్లను కోల్పోగా, 2026లో ఇప్పటివరకు రూ.104 కోట్ల నష్టం జరిగినట్లు ఆయన వెల్లడించారు. సోషల్ మీడియా ద్వారా అవగాహన పెరుగుతున్నప్పటికీ మరింత అప్రమత్తత, పటిష్ట నివారణ చర్యలు అవసరమని స్పష్టం చేశారు. బ్యాంకింగ్ డేటా భద్రత, మ్యూల్ అకౌంట్ల నియంత్రణ, దర్యాప్తులకు బ్యాంకుల సకాల సహకారం అత్యంత కీలకమని తెలిపారు. ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించేందుకు ప్రతి బ్యాంకులో ప్రత్యేక, కేంద్రీకృత ‘సైబర్ సెల్స్’ ఏర్పాటు చేయాలని సీపీ సూచించారు. ప్రజలు పెట్టుబడులు పెట్టే ముందు వాస్తవాలను సరిచూసుకోవాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, నేరగాళ్లకు సహకరించవద్దని విజ్ఞప్తి చేశారు. ద‌ర్యాప్తులో ఎదురవుతున్న సవాళ్లపై సైబర్ క్రైమ్ డీసీపీ సాయి మనోహర్ వివ‌రించారు.

బ్యాంకుల నుంచి ఖాతా వివరాలు, కేవైసీ పత్రాలు, ఫ్రీజ్ కన్ఫర్మేషన్లు అందడంలో ఆలస్యం జరుగుతుండడంతో నిందితులను పట్టుకోవడం కష్టమవుతోందని తెలిపారు. మ్యూల్ అకౌంట్ల నియంత్రణ ద్వారా నేరాలను అడ్డుకోవచ్చని, ఒకసారి ఖాతాను ఫ్రీజ్ చేసిన తర్వాత ఎలాంటి డెబిట్ లావాదేవీలు జరగకుండా చూడాలని బ్యాంకర్లకు సూచించారు. సీఎస్‌బీ ఎస్పీ సాయిశ్రీ ఎన్‌సీఆర్‌బీ డేటా ఆధారంగా ప్రతి బ్యాంకులో అప్‌డేట్ చేసిన నోడల్ ఆఫీసర్ వివరాలతో ‘సైబర్ క్రైమ్ రెస్పాన్స్ డెస్క్’ ఏర్పాటు చేయాలని సూచించారు. దాంతో కమ్యూనికేషన్ వేగవంతమవుతుందని, కస్టమర్ల సొమ్ము రక్షించవచ్చని తెలిపారు. బ్యాంక్ సిబ్బందికి సైబర్ నేరాలపై శిక్షణ ఇవ్వాలని, కార్పొరేట్ ఖాతాలకు సంబంధించిన రిలేషన్ షిప్ మేనేజర్ల వివరాలు పంచుకోవాలని సూచించారు. సమావేశంలో కుత్బుల్లాపూర్ డీసీపీ కోటి రెడ్డి, క్రైమ్స్ డీసీపీ ఏ ముత్యం రెడ్డి, సైబర్ క్రైమ్స్ డీసీపీ టీ సాయి మనోహర్, సీఎస్‌బీ ఎస్పీ సాయిశ్రీతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, కోటక్ మహీంద్రా బ్యాంక్ స‌హా ప‌లు బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement