త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana MLAs Disqualification Case | సుప్రీం డెడ్‌లైన్ ఫిబ్రవరి 6.. అయినా సాగదీస్తారా? కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కుపై వివేకానంద గౌడ్ ఫైర్

ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వేటుపై సుప్రీంకోర్టు ఫిబ్రవరి 6 డెడ్‌లైన్ విధించినా, కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టులను తప్పుదోవ పట్టిస్తోందని బీఆర్ఎస్ విప్ వివేకానంద గౌడ్ మండిపడ్డారు. దానం నాగేందర్ కేసులో పిటిషనర్ ఎందుకు రాలేదు? కడియం కేసులో ఏం జరిగింది? అని ప్రశ్నించారు.

J

Hyderabad | Published On Feb 4, 2026, 11.00 pm IST

Telangana MLAs Disqualification Case | సుప్రీం డెడ్‌లైన్ ఫిబ్రవరి 6.. అయినా సాగదీస్తారా? కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కుపై వివేకానంద గౌడ్ ఫైర్

సంక్షిప్త సారాంశం

కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తోందని బీఆర్ఎస్ ఎల్పీ విప్ వివేకానంద గౌడ్ ఆరోపించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో ఫిబ్రవరి 6లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించినా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. కడియం శ్రీహరి కేసు విచారణను స్పీకర్ ఫిబ్రవరి 19కి వాయిదా వేశారు. కాంగ్రెస్ పార్టీని బీజేపీ రక్షిస్తోందని, బొగ్గు కుంభకోణంలో ఇద్దరికీ వాటా ఉందని ఆరోపించారు. స్పీకర్ న్యాయం చేయకపోయినా, కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.

Advertisement

Telangana MLAs Disqualification Case | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై రాజకీయ వేడి రాజుకుంది. అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ ఎల్పీ విప్ వివేకానంద గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై, స్పీకర్ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఫిబ్రవరి 6లోపు ఫిరాయింపుల కేసులో తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టంగా సూచించినప్పటికీ, ప్రభుత్వం కోర్టులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు.

సుప్రీం డెడ్‌లైన్ ఫిబ్రవరి 6.. విచారణ వాయిదా ఫిబ్రవరి 19కి

కడియం శ్రీహరి అనర్హత పిటిషన్ విచారణకు తాను హాజరయ్యానని వివేకానంద గౌడ్ తెలిపారు. అయితే, కడియం తరపు న్యాయవాది తమకు మరింత సమయం కావాలని కోరడంతో, స్పీకర్ తదుపరి విచారణను ఫిబ్రవరి 19కి వాయిదా వేశారని వెల్లడించారు. "సుప్రీంకోర్టు ఫిబ్రవరి 6లోపు తేల్చమని చెప్పింది. సుప్రీం సూచన మేరకే విచారణ వేగవంతమైంది అనుకుంటే, మళ్లీ సాగదీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి," అని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

Congress Misleading Courts on Defections BJP Protecting Them BRS Whip Vivekananda Goud

కాంగ్రెస్‌ను కాపాడుతున్న బీజేపీ

ఈ మొత్తం ఎపిసోడ్‌లో బీజేపీ పాత్రపై కూడా వివేకానంద గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. "దానం నాగేందర్ కేసు విచారణకు పిటిషనర్ అయిన బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎందుకు హాజరుకాలేదు? ఇది కాంగ్రెస్ పార్టీని బీజేపీ రక్షిస్తోందనడానికి నిదర్శనం కాదా?" అని ప్రశ్నించారు. బొగ్గు కుంభకోణంలో కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీల ప్రమేయం ఉందని ఆరోపించారు.

ఆధారాలు లేవా? కళ్లు కనబడటం లేదా? : ఫిరాయింపులకు పాల్పడిన 8 మంది ఎమ్మెల్యేలకు ఆధారాలు లేవని క్లీన్ చిట్ ఇవ్వడంపై ఆయన మండిపడ్డారు.

"దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ బీ-ఫామ్ మీద ఎంపీగా పోటీ చేశారు. ఇంతకంటే ఆధారం ఏం కావాలి?" అని నిలదీశారు.

"ఎమ్మెల్యే సంజయ్ గాంధీ భవన్‌కు ఎలా వస్తారని సొంత పార్టీ నేత జీవన్ రెడ్డే ప్రశ్నించారు. ఇవి స్పీకర్‌కు కనపడవా?" అని ప్రశ్నించారు.

న్యాయం జరగాల్సిందే..

స్పీకర్ ద్వారా తమకు న్యాయం జరగకపోయినా, న్యాయస్థానాల్లో కచ్చితంగా న్యాయం జరుగుతుందని వివేకానంద గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్ని జిమ్మిక్కులు చేసినా, కోర్టులను మరోసారి తప్పుదోవ పట్టించాలని చూసినా అది సాధ్యం కాదని హెచ్చరించారు.

Advertisement
Advertisement